సాక్షి, విశాఖపట్నం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వైస్సార్ సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో భాగమేనని, కానీ మోదీ మాత్రం అందుకు విరుద్ధంగా అనుకుంటున్నారని దుయ్యబట్టారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసాన్ని ఎదుర్కొలేకే సభలో నాటకాలు ఆడారంటూ విమర్శించారు. వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చినప్పడు అన్నాడీఎంకే ఎంపీలను నిలువరించి ఉంటే దీనిపై చర్చ జరిగేదంటూ వ్యాఖ్యానించారు.కేవలం సభ జరగకూడదనే నాటకాలు ఆడారని, కానీ ఇప్పుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు దొంగ దీక్షలు చేస్తామంటున్నారని మండిపడ్డారు.
పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలకే విలువ లేకపోతే, ఇక సభ కొనసాగించడం ఎందుకు అంటూ ప్రశ్నించారు. మన రాజ్యాంగాన్ని మనమే కించపరచుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అశోక్ గజపతిరాజు నాలుగేళ్లు పదవిలో ఉన్నారని ఏ ఒక్కరోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించలేదని దయ్యబట్టారు. రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదా, విశాఖపట్నానికి రైల్వేజోన్, విభజన హామీల గురించి ఏమాత్రం పట్టించుకోని గజపతిరాజు ఇప్పుడు కేంద్రంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment