అశోక్ గజపతిరాజు పౌరుషం ఏమైంది: రోజా
విశాఖ : విశాఖకు రైల్వే జోన్ కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన పాదయాత్రకు పార్టీ ఎమ్మెల్యే రోజా సంఘీభావం తెలిపారు. రైల్వే జోన్ కోసం అమర్‌నాథ్ చేస్తున్న ఆత్మగౌరవ యాత్ర గురువారం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్రలో నగరి ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ కోసం బాధ్యతగల యువకుడిగా అమర్‌నాథ్ చేస్తున్న పాదయాత్రకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆశీస్సులున్నాయని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా టీడీపీపై రోజా నిప్పులు చెరిగారు. ‘టీడీపీ ఎంపీలు దద్దమ్మల్లా పదవులు పట్టుకుని పాకులాడుతున్నారు. రాజీనామాలు చేసి ప్రజల తరఫున పోరాడలేరా?. కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పౌరుషం ఏమైంది. మోదీ కేబినెట్‌లో నోరు మూసుకుని ఉన్నారు. పదవులు కాదు...ప్రజల ఆకాంక్ష ముఖ్యం. కేంద్రంలో భాగస్వామ్యంగా ఉంటూ పదవులు పొందటంవల్లే కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు.
ఈ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు పేపర్ల లీక్, మరోమంత్రి నారాయణకు ర్యాంకులపై ఉన్న శ్రద్ధ రైల్వేజోన్, ప్రత్యేక హోదాపై లేదు. వియ్యంకులు ఇద్దరికి ల్యాండ్ పూలింగ్ కుంభకోణంపై ఉన్న శ్రద్ధ విశాఖ ప్రాంత ప్రయోజనంపై లేదు. బ్యాంకు రుణాల కేసులో బయటపడేందుకు గంటాకు కేంద్రంలో పెద్దల కాళ్లు పట్టుకునేందుకే టైమ్ సరిపోతోంది.
అందుకే రైల్వే జోన్‌పై ఆయన మాట్లాడరు. మరో మంత్రి అయ్యన్నపాత్రుడుకు బాక్సైట్, గంజాయి రవాణాపై ఉన్న శ్రద్ధ రైల్వే జోన్‌పై లేకపోవడం దురదృష్టకరం. ఇక జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకి విశాఖ ప్రాంత ప్రయోజనాలు పట్టవు. అసెంబ్లీ సమావేశాలో వైఎస్ జగన్‌తో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తిట్టించడానికి ఆయన్ని టీడీపీ సర్కార్ పావుగా వాడుకుంటోంది. అనవసరం అయిన విషయాల్లో నోరు పారేసుకోవడం మాత్రం చూస్తుంటాం కానీ, రైల్వే జోన్‌పై మాత్రం మాట్లాడరు.
మంత్రి పదవులు రాలేదని టీడీపీ నేతలు రాజీనామాలు చేశారు. అదే ప్రత్యేక హోదా, రైల్వేజోన్ కోసం ఎప్పుడైనా రాజీనామాలకు సిద్ధపడ్డారా?. బీసీ, మహిళలపై చంద్రబాబు వివక్ష చూపుతున్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పీతల సుజాతను మంత్రి పదవి నుంచి తొలగించారు. లాస్ట్ ర్యాంక్ వచ్చిన నారాయణకు అదనపు శాఖ అప్పగించారు. ప్రజలతో ఎన్నికకాని లోకేశ్‌కు ప్రాముఖ్యం ఉన్న శాఖలిచ్చారు. మంత్రుల సంఖ్యను పెంచి, మహిళల సంఖ్యను తగ్గించారు.’ అంటూ కడిగిపారేశారు.