ఆడాళ్ల కంటే మగాళ్లకి ఆయుష్షు తక్కువ
అవును.. మీరు విన్నది నిజమే. సవాలక్ష కుటుంబ బాధ్యతలు, బాధలతో సతమతమయ్యే మగాళ్లకు.. ఆడవాళ్ల కంటే ఆయుష్షు బాగా తక్కువగా ఉంటుందట. ఈ విషయం తాజా పరిశోధనలలో తేలింది. ఇది ఏదో ఒక దేశానికే పరిమితమైన లక్షణం కాదు.. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి ఉందట. ఎక్కువ మంది మగాళ్లు గుండెపోటుతో గుటుక్కుమంటున్నారు. 20వ శతాబ్దంలో ఎక్కువగా ఇలాంటి ట్రెండే కనిపించింది. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధక బృందం ఈ విషయాలు చెప్పింది.
19వ శతాబ్దం తొలి రోజుల వరకు అయితే ఆరోగ్యకరమైన ఆహారం, మంచి అలవాట్లు ఉండటంతో మగవాళ్లలో కూడా మరణాల రేటు తక్కువగా ఉండేది. కానీ, తర్వాతి కాలంలో మహిళల ఆయుష్షు అలాగే ఉండగా.. మగాడిది మాత్రం తగ్గిపోతూ వచ్చింది. 13 అభివృద్ధి చెందిన దేశాలలో 1800 నుంచి 1935 వరకు పుట్టిన వారి జీవిత కాలాన్ని ఈ బృందం పరిశీలించింది. పొగతాగడం, తద్వారా వచ్చే గుండె జబ్బులు ఇలాంటివన్నీ మగాళ్ల మరణాలకు ప్రధాన కారణాలు అవుతున్నాయని పరిశోధనలో తేల్చారు.