
అయినా.. కాంగ్రెస్‌తో మైత్రిని కొనసాగిస్తాం: ఫరూక్ అబ్దుల్లా
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం వెలుబడిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మట్టికరిచింది.
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం వెలుబడిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మట్టికరిచింది. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఎన్నికలను సెమీఫైనల్స్ భావించినా తరుణంలో బీజేపీ ప్రభావానికి కాంగ్రెస్ విలవిలలాడింది. మిజోరం మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఢిల్లీ, రాజస్థాన్‌లలో అధికారం కోల్పోయింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో వరుసగా మూడోసారీ కాంగ్రెస్ కు
ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికలపై బీజేపీ ప్రాబల్యం గట్టిగానే ఉందనే విషయం ఈ ఫలితాలతో ప్రస్పూటమైంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీతో తాము మునపటిలాగే మైత్రిని కొనసాగిస్తామంటూ కేంద్రమంత్రి ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలనుంచి ద్వేషభావము ఎదురుకావడం చేతనే ఓటమిపాలైందని ఆయన చెప్పారు. పార్లమెంటు ఆవరణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ యూపీఎ అధికారం కోల్పోయినప్పటికీ కూడా తామ మద్దతు ఎప్పటకీ ఉంటుందన్నారు. కాంగ్రెస్ ఓటమి, గెలుపులతో సంబంధం లేదని, ఓడినంతా మాత్రానా తాము కాంగ్రెస్ మైత్రిని ఈ గడ్డు పరిస్థితుల్లో వదులుకోవడం లేదని చెప్పారు. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరజయాన్ని మూటగట్టుకుందని తెలిపారు.
కాంగ్రెస్ ఓటమికి కారణలేంటి అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఫరూక్ సమాధానమిస్తూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలు కావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన అధిక ధరలేనన్నారు. అంతేకాకుండా అవినీతి ఆరోపణలు వంటి తదితర అంశాలు కూడా కాంగ్రెస్ పై ప్రజలలో తీవ్రదేషభావాన్ని రేపిందన్నారు. దాని ఫలితమే కాంగ్రెస్ ఓటమికి కారణమని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు.