బాన్సువాడ(నిజామాబాద్): ఎస్సీల రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుంటే రానున్న ఎన్నికల్లో బిజెపిని ఓడిస్తామని ప్రతిజ్ఞ చేయాలని, అప్పుడే ఎస్సీల వర్గీకరణ సాధ్యమవుతుందని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. సోమవారం బాన్సువాడలోని రెడ్డి సంఘంలో నియోజకవర్గ స్థాయి మాదిగల మహాజన సభ జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. గత 20 సంవత్సరాల్లో మాదిగల రిజర్వేషన్ కోసం మందకృష్ణ చేసిన ఉద్యమాలు ఫలితం లేనివని, ఉద్యమ పంథాను మార్చుకొని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్యమాన్ని అనుసరించాలని అన్నారు.
కేసీఆర్ చేసిన ఉద్యమంలో హింసకు తావులేదని, రాజకీయంగా, శాంతియుతంగా పోరాడారని, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా రాజీనామాలు చేసి, ఉప ఎన్నికల్లో గెలిచి ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని నింపారని గుర్తు చేశారు. ఇకపై తాము కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్‌కు ఎస్సీల వర్గీకరణ ఆవశ్యకతను తెలియజేస్తూ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉందని అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా మాదిగలందరినీ ఏకతాటిపైకి తెచ్చి, త్వరలో హైదరాబాద్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని, అక్కడ బిజెపి సర్కార్ ఎస్సీల వర్గీకరణ బిల్లును ఆమోదించకుంటే వచ్చే నాలుగేళ్ళ తర్వాత జరిగే ఎన్నికల్లో ఓడించాలని ప్రతిజ్ఞ చేస్తామని పేర్కొన్నారు. గతంలో మందకృష్ణ మాదిగ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించి, భంగపాటుకు గురయ్యారని, తాము అలా చేసేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే తరుణంలో ఆయన టీఆర్‌ఎస్‌తో విభేదించి ఆంధ్ర రాష్ట్రంలోని చంద్రబాబుకు, బిజెపి పక్షాన చేరారని, వారు మోసం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపారని పేర్కొన్నారు. మాదిగల్లో ఐక్యత కోసం తాను అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. వర్గీకరణ ఉద్యమంలో రెడ్డీలను, వెల్మలను, మైనారిటీలను, బిసిలను అందరినీ కలుపుకొని తీసుకెళ్దామని, అందరి సహకారంతోనే ఉద్యమంలో విజయం సాధించగలుగుతామని రవి పేర్కొన్నారు. కాగా జిల్లా మాదిగ జెఎసి కన్వీనర్‌గా భీమన్నను, జిల్లా అధ్యక్షుడిగా రాజేశ్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు.
ఎస్సీలకు 50శాతం సబ్సిడీపై రుణాలు
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎస్సీలకు 50శాతం సబ్సిడీపై రుణాలు ఇస్తున్నట్లు పిడమర్తి రవి తెలిపారు. లక్ష లోపు రుణాలకు 80శాతం సబ్సిడీ, 5లక్షల లోపు రుణాలకు 70శాతం సబ్సిడీ, 10లక్షల లోపు రుణాలకు 50 శాతం సబ్సిడీ అందజేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకర్లు ఇబ్బందులకు గురి చేయకుండా ఆదేశాలిచ్చామని అన్నారు. 2013-14లో రుణాల కోసం రూ. 86కోట్లు, 2014-15లో రూ. 80కోట్లు మంజూరు చేశామని తెలిపారు. వచ్చే నెల నుంచి కొత్త రుణాలు అందజేస్తామని ఆయన తెలిపారు. ఎస్సీలకు నిరంతరాయంగా భూములను పంపిణీ చేస్తామని, రూ. 7లక్షల లోపు ఎకరం కొనుగోలుకు ప్రభుత్వ అనుమతి ఉందని, ఎవరైనా అమ్మదలిచిన వారుంటే తహసిల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జె.సాయిలు, సాయిలు, శంకర్, డాకయ్య తదితరులు పాల్గొన్నారు.
'వర్గీకరణ చేయకపోతే బీజేపీని ఓడిస్తాం'
Published Mon, Sep 21 2015 10:59 PM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM
Advertisement
Advertisement