
రైతు సమస్యలపై అవసరమైతే నిరాహారదీక్ష
తెలంగాణ రాష్ట్రంలో రైతులు అనుభవిస్తున్న సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే నిరాహార దీక్షకు కూడా వెనకాడేది లేదని వైఎస్ఆర్సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే అంశంపై చర్చించామని ఆయన చెప్పారు.
తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులతో పాటు.. జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని కమిటీలు ఈనెల 15వ తేదీలోపు భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ వస్తే తమ జీవితాలు బాగుపడతాయనుకున్న ప్రజలు ఇప్పుడు నిరాశలో మునిగిపోయారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులకు కనీసం భరోసా ఇచ్చే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశాన్ని మరోసారి స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు.