
రైతు దీక్షలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
⇒ సర్కారు కళ్లు తెరిపించేందుకే రైతు దీక్ష: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
⇒ ఈ దీక్షలు రాజకీయం, ఓట్ల కోసం కాదు
⇒ రైతుల ఆత్మహత్యలు పట్టని కేసీఆర్.. తాను రైతునని ఎలా చెప్పుకుంటారు?
⇒ మేనిఫెస్టో హామీలన్నీ అమలు చేసేదాకా ఉద్యమం.. కలిసొచ్చే అన్ని పార్టీలతో ఐక్య పోరాటాలు
⇒ సర్కారు కళ్లు తెరిపించేందుకే రైతు దీక్ష
⇒ వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘మేం రాజకీయాల కోసమో, ఓట్ల కోసమో రైతుదీక్షలు చేయడం లేదు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సమస్యలను పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ, మా పార్టీ రైతుల పక్షాన ఉందని తెలియజేసేందుకు దీక్ష చేస్తున్నాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రతి వాగ్దానాన్నీ ప్రభుత్వం అమలు చేసేదాకా, సమస్యలన్నీ పరిష్కారమయ్యేదాకా తమ పోరాటాలు ఆగవన్నారు. ‘‘అంతం కాదిది ఆరంభం మాత్రమే. పార్టీ ప్రజల, రైతుల పక్షాన నిలిచి, కలిసొచ్చే అన్ని పార్టీలను కలుపుకొని వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తుంది’’ అని ప్రకటించారు.
నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోఆదివారం పొంగులేటి ఒక్క రోజు రైతుదీక్ష నిర్వహించారు. సాయంత్రం రైతులు సంగెం వెంకటి, దేవానాయక్‌లు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్దపటోళ్ల సిద్ధార్థరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో రైతులు, ప్రజలనుద్దేశించి పొంగులేటి మాట్లాడారు. ఏడాదిగా రాష్ట్రాన్ని పాలిస్తున్న తెలంగాణ బిడ్డ కేసీఆర్ రైతుల ఆత్మహత్యలను, సమస్యలను పట్టించుకోవడం లేదని, పరిష్కరించడం లేదని ఆక్షేపించారు. ‘‘ఇది ైరెతు అనుకూల ప్రభుత్వం కాదు. రైతులు, బడుగు, పేద, బలహీన, దళిత, గిరిజన వ్యతిరేక ప్రభుత్వం’’ అంటూ విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తానున్నానంటూ రైతన్న భుజం తట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించారని గుర్తు చేశారు. తాము కూడా అండగా ఉండేందుకే దీక్ష చేపట్టామన్నారు.
రైతులు, బడుగు, పేద, బలహీన, దళిత, గిరిజన వ్యతిరేక ప్రభుత్వమిది. రైతుల ఆత్మహత్యలను, సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు తాను రైతునని ఎలా చెప్పుకుంటారు? ఎన్నికల వాగ్దానాలన్నీ నెరవేర్చేదాకా ప్రభుత్వంపై పోరాడతాం. కలిసొచ్చే పార్టీలతో ఐక్య ఉద్యమాలు చేస్తాం.
- కామారెడ్డి ‘రైతుదీక్ష’లో పొంగులేటి
పోడుభూములూ లాక్కుంటారా?
తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంటే కనీసం పట్టించుకోని కేసీఆర్, తాను రైతునని ఎలా చెప్పుకుంటారని పొంగులేటి ప్రశ్నించారు. ‘‘రైతుబిడ్డని, ఎకరాకు రూ.70 లక్షలు సంపాదిస్తున్నానని చెప్పుకుంటున్నారు. రైతుల కష్టాలు, బాధలు తెలిసుండి కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్న మీరు రైతునంటే ప్రజలెలా నమ్ముతారు?’’ అని ప్రశ్నించారు. వైఎస్ పోడు భూములకు పట్టాలిస్తే, నేటి ప్రభుత్వాలు ఆ పట్టాలను రద్దు చేసి రైతులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒకేసారి రూ.లక్ష రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి మాటతప్పారు. ఉచిత కరెం ట్ 9 గంటలి స్తామన్నా రెండు గంటలకు మించడం లేదు. దాంతో పొలాలెండి.. భార్యల పుస్తెలు తాకట్టు పెట్టి సాగు చేసిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి దాపురించింది. రెండో పంటకు కరెంటివ్వలేమంటూ చేతులెత్తేశారు’’ అంటూ ధ్వజమెత్తారు.
ఆర్టీసీ, విద్యుత్ సంస్థను కాపాడింది వైఎస్సే
కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా జరుగుతోంది. 2004లో వైఎస్ ఆధికారంలోకి వచ్చాక ఆర్టీసీకి అండగా నిలిచారు. నష్టాల నుంచి లాభాల బాట పట్టించారు. విద్యుత్, ఆర్టీసీ సంస్థలు నేటికీ క్షేమంగా ఉన్నాయంటే వైఎస్ చలవే’’ అన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చి సమ్మెను తక్షణం విరమింపజేయాలన్నారు.
వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు పింఛన్లు సరిగా ఇవ్వడం లేదన్నారు. ‘‘దళితులకు మూడెకరాల హామీనీ నెరవేర్చడం లేదు. ఖమ్మం జిల్లాలో 26 వేల మంది అర్హులుంటే కేవలం 15 మందికిచ్చి చేతులు దులుపుకున్నారు. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఫీజు రీరుుంబర్స్‌మెంట్, 104, 108... ఇలా ఏ పథకాన్నీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా వైఎస్ ముద్రను చెరిపేందుకు కుట్రలు చేస్తున్నారు. జలయజ్ఞం కింద తెలంగాణలో ఆయన చేపట్టిన 37 ప్రాజెక్టుల్లో 5 పూర్తయ్యే దశలో ఉన్నా ప్రభుత్వం ఒక్కదాన్నీ పూర్తి చేయలేదు’’ అని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల ఆత్మశాంతి కోసం దీక్షకు ముందు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
సీఎం నియోజకవర్గంలోనే ఆత్మహత్యలు: పాయం
ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, ఇందుకు సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో జరిగిన ఆత్మహత్యలే నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. రైతుదీక్షలో ఆయన మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని, కనీసం వారిని పరామర్శించలేదని మండిపడ్డారు. బాధిత రైతు కుటుంబాలను ఆదుకోవాలని, ఒక్కో కుటుంబానికి రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రే షియా చెల్లిచాలని అసెంబ్లీలో కోరినా ప్రభుత్వం స్పందించలేదన్నారు.
తమ దీక్షతోనైనా ప్రభుత్వం మేల్కొని తడిసిన ధాన్యానికి సైతం మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోడు రైతులను ప్రభుత్వం జైళ్లకు పంపుతోందని ఆరోపించారు. వారికి పట్టాలివ్వాలని కోరారు. రైతుదీక్షలో పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధులు కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎడ్మ కిష్టారెడ్డి, కె.శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాష్, గున్నం నాగిరెడ్డి, అధికార ప్రతినిధులు విజయచందర్, సత్యం శ్రీరంగం, ఆకుల మూర్తి, యువజన విభాగం నేత భీష్మ రవిందర్, రాష్ట్ర పార్టీ నాయకులు ఏలూరు వెంకటేశ్వర్‌రెడ్డి, సాధు రమేష్‌రెడ్డి, కేసర వెంకటేశ్వర్‌రెడ్డి, మేకల ప్రదీప్‌రెడ్డి, ముందడుపు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కష్టాల ఏకరువు
అన్నదాతల కష్టాలను ఏకరువు పెట్టేందుకు రైతుదీక్ష వేదికైంది. పంటలు నష్టపోయిన రైతులతో పాటు ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబసభ్యులు ఈ సందర్భంగా తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతుల కష్టాలను ఓపికగా విన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వారికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. రైతుల ఆవేదన వారి మాటల్లోనే..
పొలంకాడనే పురుగుల మందు తాగి సచ్చిండు
అప్పులతో నా మొగడు పొలంకాడ మందుతాగి సచ్చిపోయిండు. నాకు కొడుకు, బిడ్డ ఉన్నరు. సర్కారు పట్టించుకోలేదు. ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ సాయం చేయలేదు. నేనెట్ల బతకాలె. నా పిల్లల్నెట్ల బతికుంచుకోవాలె. అప్పులు అట్లనే ఉన్నయి. బతుకుదెరువు కూడా కరువైంది. పిల్లల కోసమే బతుకుతున్నా. నన్ను సర్కారే ఆదుకోవాలి.
- ఆత్మహత్యకు పాల్పడిన రైతు జెల్లె సుధాకర్ భార్య మణెమ్మ, నర్సాపూర్, మెదక్
పింఛన్ రావట్లేదు
నా భర్త చనిపోయి 20 ఏళ్లయింది. నాకు పింఛన్ రావట్లేదు. ఎవరి దగ్గరికి పోయినా పట్టించుకోవడం లేదు. దయసేసి పింఛన్ ఇప్పించండి.
- ఎనగుర్తి పోశవ్వ, లింగాపూర్, కామారెడ్డి, నిజామాబాద్
లోన్లు మాఫీ కాలేదు
గ్రూపుల లోన్లు మాఫీ అవుతాయని ఆశపడ్డం. మాఫీ కాలేదు. మిత్తీలు పెరిగి అప్పు భారంగా తయారైంది. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ప్రభుత్వం నమ్మించి మమ్మల్ని మోసం చేసింది. రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు మంచిగ ఉండె. గ్రూపుల లోన ్లన్నీ మాఫీ చెయ్యాలె. మహిళలను ఆదుకోవాలె.
- పుష్ప, కన్నాపూర్, లింగంపేట, నిజామాబాద్
ఉరేసుకుని సచ్చిపోయిండు
నా భర్త అప్పుల బాధతో ఉరేసుకుని సచ్చిపోయిండు. పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఎంతో గోస పడ్డం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రభుత్వమూ ఆదుకోలేదు. బతుకుడు కష్టంగా ఉంది. సర్కారు నుంచి సాయం ఇప్పించండి.
- ఆత్మహత్యకు పాల్పడిన శంకరయ్య భార్య లక్ష్మి, పుల్లూరు, మెదక్
రైతు దీక్షలో ఏడు తీర్మానాలు
పొంగులేటి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుదీక్షలో ఏడు ప్రధాన తీర్మానాలను ఆమోదిం చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి ఈ తీర్మానాలను ప్రవేశపెట్టగా సభకు హాజరైన రైతులు, నాయకులు, కార్యకర్తలు హర్షధ్వానాలతో ఆమోదించారు. ఆ తీర్మానాలివే..
⇒ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలి.
⇒ ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదైనందున తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి. రైతులకు కరువు సహాయం అందించాలి.
⇒ అకాలవర్షాలు, బలమైన ఈదురుగాలులు, వడగళ్లతో జరిగిన పంట నష్టానికి తగిన పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి.
⇒ రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి రూ.25 వేలు మాత్రమే మాఫీ చేశారు. మిగతా రూ.75 వేలను కూడా ఒకేసారి మాఫీ చేయూలి.
⇒ వచ్చే ఖరీఫ్‌లో ఉచితంగా విత్తనాలు, సగం ధరకే ఎరువులు అందించి తోడ్పడాలి.
⇒ కబేళాలకు తరలిపోకుండా పశువులకు ఉచితంగా మేత, పాడి పశువులకు దాణా అందించి పశుసంపదను కాపాడాలి.
⇒ రైతుల భూములను బలవంతంగా, వారికి ఇష్టం లేకుండా లాక్కోవద్దు.