
దావూద్ ఇబ్రహీంకు సహాయం చేస్తారా?
న్యూఢిల్లీ: అభ్యర్థిస్తే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సహాయం చేస్తారా అని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. వాంటెడ్ జాబితాలో ఉన్న ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీకి మానవతా దృక్పథంతోనే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సాయం చేశారని బీజేపీ వెనకేసుకురావడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది.
మోడీకి మోదీ సాయం చేస్తున్నట్టుగా కనబడుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సుజ్రీవాలా ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు లలిత్ మోడీ సన్నిహితుడన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. పలువురు బీజేపీ నాయకులతోనూ లలిత్ కు సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ఇటీవలే గుజరాత్ లో రూ.1000 కోట్ల అక్రమ బెట్టింగ్ రాకెట్ వెలుగు చూసిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు.
మానవతా కోణంలో లలిత్ మోడీకి సహాయం చేశామని బీజేపీ సమర్థించుకోవడాన్ని తప్పుపట్టారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు దేశం విడిచి పారిపోయేందుకు సహకరించడమే మోదీ ప్రభుత్వ విధానం అన్నట్టుగా కమలనాథులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.