ఇక కులం, కశ్మీర్ లాంటి సమస్యలు ఉండవు
- 2022 నాటికి న్యూఇండియా సాకారం
- అప్పటికి అన్ని సమస్యలను పరిష్కరిస్తాం: రాజ్‌నాథ్
- ఆసక్తికరంగా మారిన కేంద్ర హోం మంత్రి ప్రతిజ్ఞ
న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అన్నింటికీ 2022లోగా పరిష్కారం చూపుతామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఉగ్రవాదం మొదలుకొని కుల వ్యవస్థ దాకా మొత్తాన్ని మార్చేస్తామన్నారు. న్యూఇండియా ఉద్యమంలో భాగంగా శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ‘సంకల్ప్ సే సిద్ధి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేయించిన ప్రతిజ్ఞపై భిన్న స్పందనలు వస్తున్నాయి.
‘ఉగ్రవాదం, కశ్మీర్ సమస్య, నక్సలిజం.. ఇలా దేశంలో సమస్యలు చాలా ఉన్నాయి. అయితే, వాటన్నింటినీ 2022లోగా పరిష్కరిస్తామని నేను భరోసా ఇస్తున్నాను. న్యూఇండియాను నిర్మిద్దామని మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. రాబోయే నవభారతంలో సమస్యలకు తావులేదు’ అని రాజ్‌నాథ్ ఉద్ఘాటించారు. అనంతరం.. సభికుల చేత.. ‘పేదరికం లేని, అవినీతి లేని, ఉగ్రవాదరహిత, మతవిద్వేషరహిత, కులరహిత, స్వచ్ఛభారత్‌ను నిర్మించుకుందాం’ అనే ప్రమాణాన్ని చేయించారు.
‘స్వాతంత్ర్య సమరయోధులు 1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలుపెడితే 1947కు స్వాతంత్ర్యం సిద్ధించింది. అలానే న్యూఇండియా నిర్మాణం కోసం ఇప్పుడు(2017లో) ప్రతిజ్ఞచేసి.. 2022నాటికి సాకారం చేసుకుందాం’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
కాగా, రాజ్‌నాథ్ ప్రకటనపై భిన్న స్పందనలు వెలువడ్డాయి. 2018లోగా చొరబాట్లను శాశ్వతంగా నిరోధిస్తామని, ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కంచె వేస్తామని, నక్సల్స్ సమస్యకు ముగింపు పలుకుతామని గతంలో ప్రకటించినా, అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో తాజా ప్రకటన కూడా కేవలం ప్రకటనగానే మిగిలిపోతుందని విపక్షాల నేతలు పెదవి విరిచారు.