సాక్షి, హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వంటి స్వదేశీ సంస్థల ప్రగతి భారతీయులందరూ గర్వంగా తలెత్తుకుని తిరిగేలా చేస్తోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. అయితే పరిశోధనల ఫలితాలు సామాన్య ప్రజలకు కూడా చేరినప్పుడే వాటికి సార్థకత అని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని భూభౌతిక పరిశోధన కేంద్రం (ఎన్‌జీఆర్‌ఐ)లో ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ స్పేస్ సెక్టార్: న్యూ ఇండియా’ పేరిట జరిగిన ఒకరోజు సదస్సులో గవర్నర్ మాట్లాడారు.
అంతరిక్ష రంగంలో ఇస్రో ఘనతలను కొనియాడారు. అంతరిక్ష రంగంలో జరిగిన పరిశోధనలు వివిధ రూపాల్లో సామాన్యుడికి ఉపయోగపడ్డాయని వివరించారు. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌లు స్కైరూట్, ధ్రువ స్పేస్‌లు దేశంలోనే మొదటిసారి ప్రైవేటుగా రాకెట్, ఉపగ్రహాలను విజయవంతంగా పరీక్షించడాన్ని గవర్నర్ అభినందించారు.
2026 నాటికి అంగారకుడిపైకి మనిషి..
అంతరిక్ష రంగంలో వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటే.. ఇంకో మూడేళ్లలోనే మనిషి అంగారక గ్రహంపైకి అడుగుపెట్టినా ఆశ్చ ర్యం లేదని ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ చెప్పారు. ప్రపంచంలో పౌర అవసరాలు తీర్చేందుకు అంత రిక్ష ప్రయోగాలు చేపట్టిన తొలి దేశంగా భారత్‌కు రికార్డు ఉందని, స్పేస్ టెక్నాలజీని గరిష్టంగా ఉపయోగించుకున్నదీ మన మేనని తెలిపారు. ప్రస్తుతం సుమారు 50 ఉపగ్రహాలు దేశానికి సేవలు అందిస్తున్నాయని.. పెరుగుతు న్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటి సంఖ్య రెండు వందలకుపైగా ఉండాలని పేర్కొన్నారు.
అరగంటలో ఖండాలు దాటేయవచ్చు..
అంతరిక్ష రంగంలో రానున్న పదేళ్లు చాలా కీలకమని దేశంలో తొలి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సీఈవో పవన్‌కుమార్ చందన తెలిపారు. ప్రపంచంలోని 90కిపైగా దేశాలకు తమవైన ఉపగ్రహాలు లేవని, యాభై శాతం జనాభాకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో లేదని వివరించారు. మరో పది, ఇరవై ఏళ్లలో కేవలం అరగంట సమయంలోనే ఖండాలను దాటేసేందుకు రాకెట్లను ఉపయోగించే పరిస్థితి రానుందని చెప్పారు.
విమానాల మాదిరిగానే రాకెట్లను కూడా మళ్లీమళ్లీ వాడుకునే దిశగా స్కైరూట్ పరిశోధన చేపట్టిందని తెలిపారు. సెమినార్‌లో ధ్రువస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో నెక్కంటి సంజయ్, అకాడమీ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ సీహెచ్ మోహనరావు, ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ విభాగం కార్యదర్శి ఎం రవిచంద్రన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment