సాక్షి, హైదరాబాద్: బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు మరింత వేగవంతం కావాలని, ఈ పరిశోధనలు కోవిడ్‌పై మానవాళి పోరాటంలో కీలకమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కరోనా నివారణకు వ్యాక్సిన్ అభివృద్ధికి, చికిత్సకు, ఔషధాల తయారీకి బయోటెక్నాలజీ, ఫార్మా, వైద్య రంగాల సమ్మిళిత పరిశోధనలు అత్యంతావశ్యం అని గవర్నర్ తెలిపారు. జేఎన్‌టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘ఫ్రాంటియర్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్–2020’అన్న అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్‌భవన్ నుండి ఆన్‌లైన్ ద్వారా గవర్నర్ ప్రసంగించారు.
కరోనా సమస్యను అధిగమించాలంటే బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్ ఇతర ఆధారిత అనుసంధాన రంగాలలో పరిశోధనలు, అభివృద్ధి మరింత వేగవంతం కావాలని, సైంటిస్టులు ఈ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం బయోటెక్నాలజీ రంగానికి, పరిశోధనలకు ఊతమిస్తున్న నేపథ్యంలో భారతదేశం బయోటెక్నాలజీ రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతున్నదన్నారు. భారతదేశం ప్రస్తుతం బయోటెక్నాలజీ రంగంలో ఐదో అతిపెద్ద దేశంగా ఉందని, త్వరలోనే గ్లోబల్ మార్కెట్‌లో 20 శాతం సాధిస్తుందని తమిళిసై వివరించారు. హైదరాబాద్ ‘బయోటెక్నాలజీ, జీవశాస్త్రాల హబ్’గా ఎదుగుతున్న తీరును గవర్నర్ ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment