కాల్చి చంపమన్న శునకం ఇదే
న్యూయార్క్: బొద్దుగా, ముద్దుగా ఉండే కుక్కను తుపాకీతో కాల్చి చంపమంటే ఎవరైనా చంపుతారా? ఎంతటి కఠినాత్ములైనా ఇలాంటి పని చేయలేరు. కానీ దిక్కుతోచని స్థితిలో తన కుక్కను చంపాలని అమెరికా మహిళ ఒకరు ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ను అభ్యర్థించింది. తన పెంపుడు శునకాన్ని సంరక్షణించే స్తోమత తనకు లేనందున దాన్ని చంపాలని ఆమె విజ్ఞప్తి చేసింది.
'నా కుక్కను కాల్చి చంపడానికి ఒకరు కావాలి. తుపాకీ నేనే ఇస్తా' అని టెక్సాస్ మహిళ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. వెంటనే స్పందించిన జంతు సంరక్షణ అధికారులు ఈ కుక్కను కాపాడారు. దీనికి వ్యాక్సిన్లు వేయించి మరొక మహిళకు సంరక్షణార్థం అప్పగించారు.
ఎవరైనా దీన్ని పెంచుకునేందుకు ముందుకు వస్తే వారికి ఈ కుక్కను అప్పగిస్తామని అధికారులు తెలిపారు. గోధుమ, తెలుపు రంగులో ఉన్న మూడున్నరేళ్ల ఈ శునకాన్ని పోషించలేక దాన్ని చంపాలని యజమానురాలు తన ఫేస్ బుక్ లో మిత్రులను కోరిందని చెప్పారు. భారమైన హృదయంతోనే ఆమె ఈ పనికి పూనుకుందన్నారు. ఆమెతో నేరుగా మాట్లాడేందుకు మీడియా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.