
తాగేసి కారు నడిపి.. ఇద్దరిని చంపేసింది!
ఓ మహిళా న్యాయవాది మద్యం మత్తులో తన కారుతో ఓ టాక్సీని ఢీకొనడంతో టాక్సీలో ఉన్న ఇద్దరు మరణించారు. బాగా తాగి ఉన్న జాహ్నవి గడ్కర్ (35) అనే ఆ న్యాయవాది తన ఆడి క్యూ3 మోడల్ కారును రాంగ్ రూట్లో నడిపిస్తోందని పోలీసులు తెలిపారు. టాక్సీని ఢీకొట్టేందుకు కొద్ది ముందు ఆమె రెండు బైకులను కూడా ఢీకొట్టబోయి.. తృటిలో తప్పించింది. తాను మద్యం తాగినట్లు వైద్యుల వద్ద ఆమె అంగీకరించిందని డీసీపీ సంగ్రామ్ సింగ్ నిషాన్దార్ తెలిపారు.
టాక్సీలో వెళ్తున్న మహ్మద్ సలీం సాబూవాలా (50), మహ్మద్ హుస్సేన్ సయీద్ (57) అనే ఇద్దరు ఈ ప్రమాదంలో మరణించారు. ప్రమాదం కారణంగా టాక్సీ ముందు భాగం, కారు ముందు భాగం కూడా తుక్కుతుక్కుగా మారాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో వైస్ ప్రెసిడెంట్ (లీగల్)గా పనిచేస్తున్న గడ్కర్పై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.