
దాడులు చేస్తే సహించం : ఆశోక్ బాబు
ఉద్యోగుల మీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని రాజకీయ నాయకులను ఏపీఎన్జీవోలు హెచ్చరించారు. సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఏపీఎన్జీవో నగర శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ,
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల మీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని రాజకీయ నాయకులను ఏపీఎన్జీవోలు హెచ్చరించారు. సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఏపీఎన్జీవో నగర శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ, ఆర్టీసీ ఈయూ నేత దామోదరరావు, మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ తదితరులతో కలిసి ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు శనివారం సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ప్రజల మానసిక స్థితిని రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలి. రాజకీయ నేతల మీద ప్రజలకు ఉన్న భావన ఏమిటో తెలుసుకోండి. మీ చేతగానితనం వల్లే రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చింది. మీ మీద దాడులు చేస్తున్నారని ఎదురు దాడులు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ప్రజలకు రాజకీయ నాయకులే ఊరట కల్పించాలి. రెచ్చగొట్టే విధంగా ఎదురు దాడులు చేస్తే.. సివిల్ వార్ వస్తుంది’ అని హెచ్చరించారు.
అధికార దాహంతో రాజకీయ నాయకులెవరైనా సమైక్యతకు తూట్లు పొడిస్తే.. వారి రాజకీయ జీవితానికి ప్రజలు సమాధి కడతారని హెచ్చరించారు. ‘ప్రజలు నాలుగు రోజులు ఆవేశంగా ఉంటారు. తర్వాత మర్చిపోతారనుకుంటే పొరపాటే. రాష్ట్ర సమైక్యతకు వ్యతిరేకంగా పనిచేసే వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. అలాంటి వారి రాజకీయ జీవితాలకు శుభం కార్డు వేస్తారు’ అన్నారు. బంద్‌ను ఆసరాగా చేసుకొని రాజకీయ పార్టీలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డాయన్నారు. పార్టీలకు అతీతంగా ఉద్యమం చేస్తున్నామని, రాజకీయ నాయకులు ఉన్న కార్యక్రమాల నుంచి ఉద్యోగులు బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాలు సొంతంగా ఉద్యమించాలన్నారు.
తీర్మానానికి వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పండి..
శాసనసభలో విభజన తీర్మానానికి వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పాలని అశోక్‌బాబు ఎమ్మెల్యేలను డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ ఈ మేరకు లేఖ రాయనున్నామని తెలిపారు. ‘ఎమ్మెల్యేలు రాష్ట్రానికి చేసే ఆఖరు సేవ ఏదైనా ఉందంటే అది తీర్మానాన్ని ఓడించడమే. ప్రజల రుణం తీర్చుకొనే అవకాశం ఇదే. తీర్మానం ఉన్న రోజున శాసనసభకు రాకపోయినా, పార్టీకి విధేయులమని చెప్పి తప్పించుకున్నా.. ప్రజలు క్షమించరు’ అని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. సీమాంధ్రలో ఆందోళనలు సహజమే అంటూ కేంద్ర హోం మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతా రహితంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో జరిగిన ఆందోళనలు కూడా సహజమే అనుకుంటే పరిస్థితి ఇక్కడదాకా వచ్చేది కాదు కదా? అని ప్రశ్నించారు. విజయనగరం ముట్టడికి పిలుపునిచ్చామంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. దాడులు చేసిన నేతలు ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాలని ఏపీ ఎన్జీవో నేతలు డిమాండ్ చేశారు.
నేడు కార్యాచరణ ఖరారు
ఢిల్లీలో వారం రోజుల పాటు ధర్నాలు చేయాలని, జాతీయ నేతలందరినీ కలిసి తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయించామని నేతలు తెలిపారు. ఢిల్లీ ఎప్పుడు వెళ్లాలి, ఎవరెవరు వెళ్లాలనే విషయాన్ని ఆదివారం జరిగే జేఏసీ సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. ఈ నెలాఖరులో ఢిల్లీ యాత్ర ఉండే అవకాశం ఉందన్నారు. 10న భీమవరంలో సభ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తిరుపతి, నెల్లూరు, గంటూరులలోనూ సభల తేదీలను ఇంకా ఖరారు చేయలేదన్నారు. దళిత ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేసి ఉద్యమించాలని మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ డిమాండ్ చేశారు.