లండన్: కుక్కల్లో 11 వేల ఏళ్ల క్రితం ఏర్పడిన ఓ కేన్సర్ వ్యాధి నేటికీ కొనసాగుతూ వస్తోందని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. కుక్కల జననాంగాల్లో ఏర్పడే ‘సీటీవీటీ’ అనే కేన్సర్ ఒక కుక్క నుంచి మరో కుక్కకు నేరుగా సక్రమిస్తోందని వారు కనుగొన్నారు. 11 వేల ఏళ్ల క్రితం.. అలాస్కన్ మాలామూట్ జాతి కుక్కకు ఈ కేన్సర్ వచ్చి ఉంటుందని, అది వేరే కుక్కలతో జతకట్టడంతో వాటికి కేన్సర్ కణాలు సంక్రమించి ఉంటాయని భావిస్తున్నారు. సీటీవీటీ వ్యాధి జన్యుచరిత్ర(జీనోమ్)ను రూపొందించిన శాస్త్రవేత్తలు ఈ వ్యాధి జీనోమ్‌లో ఇంతవరకూ 20 లక్షల జన్యుమార్పులు జరిగాయని అంచనా వేశారు.
ఒక్కో జన్యుమార్పుకు ఎంతకాలం పట్టిందన్న దానిని బట్టి ఇది 11 వేల ఏళ్ల క్రితం ఏర్పడి ఉంటుందని నిర్ధారించారు. మనిషిలో వచ్చే కేన్సర్ వ్యాధులలో వెయ్యి నుంచి 5 వేల జన్యుమార్పులు మాత్రమే జరగడం గమనార్హం. సాధారణంగా కేన్సర్ కణాలు ఇతర జంతువులకు నేరుగా సంక్రమించవు. కానీ ఇప్పటిదాకా టాస్మానియన్ డెవిల్ (చిన్న కుక్కలాంటి అడవి జంతువు), కుక్కల్లో మాత్రమే సీటీవీటీ కేన్సర్‌ను గుర్తించారు. సీటీవీటీ జన్యు చరిత్రపై అధ్యయనం ద్వారా ఇలాంటి కేన్సర్ల సంక్రమణపై కొత్త విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు.