
'అయినా చంద్రబాబుకు చీమకుట్టినట్టైనా లేదు'
హంద్రినీవా ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలంటూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి ఆందోళన ఉధృతం చేశారు.
అనంతపురం: హంద్రినీవా ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలంటూ ఆందోళనను ఉధృతం చేసినట్టు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రేపు ఉరవకొండలో అన్నిపార్టీల ముఖ్యనేతలతో ప్రత్యేక రైతు సదస్సును నిర్వహించనున్నట్టు చెప్పారు. 1.16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువల నిర్మాణం పక్కన పెట్టాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడం దుర్మార్గమని విమర్శించారు.
ఏడాదిలో 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ఇప్పటికే 4 లక్షల మంది వలసలు వెళ్లారని, అయినా చంద్రబాబుకు చీమకుట్టినట్టైనా లేదని వై విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. పట్టిసీమకు రూ. 1300 కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబుకు కరువుజిల్లాపై జాలి లేదా? అని సూటిగా ప్రశ్నించారు. అనంతరపురం ఆయకట్టుకు నీరు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు నీరిస్తే ఊరుకోమన్నారు. జిల్లాకు ద్రోహం చేస్తున్న చంద్రబాబును టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదని వై.విశ్వేశ్వ రెడ్డి విమర్శించారు.