యాహూ వెల్లడించిన షాకింగ్ న్యూస్
వాషింగ్టన్: ఇంటర్నెట్ దిగ్గజం యాహూ షాకింగ్ న్యూస్ వెల్లడించింది. 50కోట్ల (500 మిలియన్) యూజర్ల అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు ప్రకటించింది. యాహూ చీఫ్ ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ బాబ్ లార్డ్ ఈ విషయాన్ని గురువారం ధృవీకరించారు. ఈ సమాచారాన్ని మొత్తాన్నీ కంపెనీ నెట్ వర్క్ నుంచి 2014లో దొంగిలించారని ఒక ప్రకటనలో తెలిపారు. యాహూ ఆన్ లైన్ ఖాతాదారులు తమ పాస్ వర్డ్ లను మార్చుకోవాలని యాహూ ఒక ప్రకటనలో కోరింది. భద్రతా ప్రశ్నలకు సమాధానాలివ్వాలని సూచించింది. అనుమానాస్పద లింక్ లపై క్లిక్ చేయొద్దని, డోన్ లోడ్లు చేయొద్దని హెచ్చరించింది.
పేర్లు, ఈ మెయిల్ చిరునామాలు, టెలిఫోన్ నెంబర్లు, పుట్టిన తేదీలు, పాస్‌వర్డ్‌లతో పాటు ఎన్‌క్రిప్ట్, అన్ ఎన్‌క్రిప్డ్ ప్రశ్నలు, సమాధానాలు కూడా హ్యాకింగ్‌కు గురైన వాటిలో ఉన్నాయని బాబ్ లార్డ్ చెప్పారు. దీనిని స్టేట్ స్పాన్సర్డ్ అటాక్ అని ఆరోపించిన ఆయన, హ్యాకింగ్‌కు సంబంధించి విచారణ కొనసాగుతోందన్నారు. అలాగే విచారణలో వెల్లడైన సమాచారం మేరకు.. హ్యాకింగ్‌కు గురైన వాటిలో అన్‌ప్రొటెక్టెడ్ పాస్‌వర్డ్‌లు, పేమెంట్ కార్డ్ డాటా, బ్యాంకు అకౌంట్ సమాచారం తదితరాలు లేవని స్పష్టం చేశారు. పేమెంట్ కార్డ్ డేటా, బ్యాంక్ అకౌంటులకు సంబంధించిన సమాచారాన్ని హ్యాకింగ్‌కు గురైన సిస్టంలో భద్ర పరచలేదని చెప్పారు. హ్యాకింగ్ చేసిన వారు యాహూ నెట్ వర్క్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్న వారు కాదని తమ విచారణలో వెల్లడైందన్నారు.
మరోవైపు ఇదే అతి పెద్ద సైబర్ ఉల్లంఘనగా టెక్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే 2014 నుంచి పాస్ వర్డ్ లను మార్చని యూజర్లను మార్చుకోవాల్సిందిగా కోరుతోందని షేప్ సెక్యూరిటీ అధికారి తెలిపారు. సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ లో ఆధునిక ఆటోమేటెడ్ టూల్స్ ఉపయోగించే అవకాశ ఉందనీ, ఈనేపథ్యంలో 4.8 బిలియన్ డాలర్ల యాహూ వెరిజోన్ కీలక అమ్మకంపై ప్రభావితం చేసే అవకాశం ఉందని మరో టెక్ నిపుణుడు హెచ్చరిచారు.
కాగా ప్రపంచవ్యాప్తంగా మూడు వందల మిలియన్ల ఈ మెయిల్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయని, హ్యాకర్లు జీమెయిల్, హాట్ మెయిల్, యాహూ అకౌంట్లు హ్యాక్ చేసి పాస్ వర్డ్స్, ఇతర సమాచారం దొంగిలించారని, ఈ సమాచారాన్ని రష్యాలోని క్రిమినల్ అండర్ వరల్డ్‌కు విక్రయించినట్లుగా గతంలో అందోళను చెలరేగిన సంగతి తెలిసిందే.