మెమన్ పిటిషన్ తిరస్కరణ సబబే: సుప్రీం
న్యూఢిల్లీ: ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ ను తిరస్కరించడం సబబేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. క్యూరేటివ్ పిటిషన్ విచారణలో చట్టపరంగా ఎలాంటి లోపాలు చోటుచేసుకోలేదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ విచారణలో న్యాయప్రక్రియ సజావుగా సాగిందని పేర్కొంది.
యాకుబ్ మెమన్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ పై వాదనలు త్రిసభ్య ఎదుట బుధవారం సాయంత్రం ముగిశాయి. క్యూరేటివ్ పిటిషన్ విచారణలో మెమన్ లేవనెత్తిన సాంకేతిక అంశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
క్యూరేటివ్ పిటిషన్ పై విచారణ చట్టబద్ధంగా జరగలేదని అంతకుముందు మెమన్ తరపు లాయర్ వాదించారు. జైల్లో మెమన్ సత్ప్రర్తనను దృష్టిలో పెట్టుకోవాలని త్రిసభ్య ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. మెమన్ స్కిజోఫ్రెనియాతో బాధ పడుతున్నారని తెలిపారు.