అక్కడ దూకుడెందుకు చూపలేదు?
రాజీవ్ హంతకుల అంశంపై
పణజి: యాకూబ్ మెమన్ కేసులో చూపించిన అత్యవసరతను.. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా నిర్ధారితులైన వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు చూపించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ప్రశ్నించారు. రాజీవ్ హత్య కేసులో ముగ్గురికి విధించిన మరణశిక్షను తగ్గించి, వారికి కొత్త జీవితాన్ని అందించటాన్ని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత వారంలో కొట్టివేసింది. దిగ్విజయ్ శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ..
‘యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీంకోర్టు ఒక అడుగు ముందుకువేయటాన్ని హర్షిస్తున్నాం. కానీ.. మరోవైపు హిందూ అతివాదుల ప్రమేయం ఉన్న ఉగ్రవాద కేసుల్లో మందకొడిగా వ్యవహరించాలని ఎన్‌ఏఐ ఒక సీనియర్ న్యాయవాదికి చెప్పింది’’ అంటూ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి సలైన్ ఆరోపణలను ప్రస్తావించారు. యాకూబ్ కేసులో చూపిన అత్యవసరతను రాజీవ్ హంతకుల విషయంలో కానీ, సిక్కు ఉగ్రవాది భుల్లార్ విషయంలో కానీ ఎందుకు చూపలేదని ప్రశ్నించారు.
మానవీయంగా నడుచుకుంది: ఆరెస్సెస్
న్యూఢిల్లీ: యాకూబ్‌ను ఉరితీసిన తర్వాత ఆయన మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందించే విషయంలో కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మానవీయంగా వ్యవహరించిందని ఆరెస్సెస్ కితాబునిచ్చింది.
వారు దేశద్రోహులు: సాక్షి మహరాజ్
రిషికేష్: యాకూబ్ మరణం పట్ల విచారిస్తున్న వారు జాతివ్యతిరేకులని, దేశద్రోహులని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ అభివర్ణించారు. రాజ్యాంగంపై నమ్మకం లేని వారు పాకిస్తాన్‌కు వెళ్లాలని సూచించారు.