యువతి పరువు హత్య, ఉరేసుకున్న ప్రేమికుడు
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో పరువుహత్య సంచలనం సృష్టించింది. తమకు ఇష్టం లేని వ్యక్తిని ప్రేమిస్తోందన్న కోపంతో అన్నలు చెల్లెలి గొంతు పిసికి చంపేశారు. ఈ వార్త తెలిసిన తరువాత ఆ అమ్మాయి ప్రేమికుడు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
ముజఫర్ నగర్ జిల్లాలోని బుఢానా నగరంలోని ఒక యువతి ముబారక్ హుసేన్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే ఆ యువతి అన్నలు అహసాన్, అశూలు ఆమెతో మంగళవారం పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగారు. అదే ఆవేశంలో ఇద్దరూ ఆమె గొంతును నులిమి చంపేశారు. ఆ తరువాత ఆమెను సీలింగ్ ఫ్యాన్ కి వేలాడ దీసి ఉరేసుకున్నట్టు చూపించే ప్రయత్నం చేశారు. ఇది తెలిసిన ప్రేమికుడు హుసేన్ అదే ఊళ్లో ఉరేసుకుని చనిపోయాడు.
పోస్ట్ మార్టమ్ రిపోర్టులో అమ్మాయి గొంతు పిసికి చంపేశారన్న సంగతి బయటపడటంతో అన్నలిద్దరూ పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేశారు.