అమ్మాయి మిస్సయిందని.. కుర్రాడి లాకప్‌డెత్
అమ్మాయి మిస్సయిందని.. కుర్రాడి లాకప్‌డెత్
Published Thu, Mar 2 2017 8:42 AM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM
ఉత్తరాఖండ్‌లో ఓ అమ్మాయి ఇంట్లోంచి కనపడకుండా పోయింది. దాంతో పోలీసులు జియాయుద్దీన్ రజా (16) అనే ఓ కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. ఏమయిందో ఏమో తెలియదు గానీ.. రజా పోలీసు లాకప్‌లో ఉండగా ఉరికి వేలాడుతూ మరణించాడు. దీంతో ఒక్కసారిగా ఉత్తరాఖండ్ పోలీసులపై నిరసనలు వెల్లువెత్తాయి. నాలుగు రోజుల క్రితం కనపడలేదన్న ఆ అమ్మాయి ఆచూకీ చివరకు లక్నోలో తేలింది. దాంతో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలు తలెత్తాయి. పోలీసులు తమ కొడుకును తీసుకెళ్లేటప్పుడు అతడి దగ్గర ఏమీ లేవని.. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి అతడు తాడుతో ఉరేసుకున్నాడని చెప్పడంలో అర్థం ఏముందని బాలుడి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఈ కేసులో నలుగురు పోలీసులను సస్పెండ్ చేసిన సీనియర్ ఎస్పీ సెంథిల్ అబూదెయి మొత్తం వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించారు. ఒక ఎస్ఐ, ఒక విలేకరి, ఐదుగురు గుర్తుతెలియని పోలీసులు, మరో ఇద్దరు.. మొత్తం 9 మందిపై హత్యకేసు నమోదు చేశారు. రజా మరణానికి కారణమేంటో విచారించి 72 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఆదేశించింది. పదో తరగతి చదువుతున్న రజా ఇంటి సమీపంలో ఉండే ఓ అమ్మాయి ఇంట్లోంచి కనపడకుండా పోవడంతో.. అందుకు కారణం ఇతడే అయి ఉంటాడన్న అనుమానంతో పోలీసులు రజాను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఆ తర్వాత అతడు లాకప్ డెత్ కావడంతో అది తీవ్ర వివాదం అయ్యింది.
Advertisement