
హోరెత్తిన యువతరంగం..
- జగన్‌కు మద్దతుగా తరలివచ్చిన యువతీయువకులు
- నిరవధిక నిరాహార దీక్షకు పోటెత్తిన జనసందోహం
సాక్షి, విజయవాడ బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు అపూర్వ స్పందన లభించింది. దీక్షకు మొదటి నుంచీ ప్రభుత్వం అడ్డంకులు కల్పించినా, భారీగా జనసందోహం తరలి వచ్చింది. ప్రత్యేకించి ఈ దీక్షలో యువత ఉత్సాహంగా పాలుపంచుకుంది. ప్రత్యేకహోదా ఆవశ్యకతపై అవగాహన ఉన్న యువతీయువకులు జగన్ దీక్షకు మద్దతుగా నిలిచారు. గుంటూరు నగరం బుధవారం ఉదయం నుంచే జనంతో నిండిపోయిం ది. బెజవాడలో కనకదుర్గమ్మ ఆశీర్వాదం తీసుకుని దీక్షాస్థలికి బయలుదేరిన జగన్‌కు గుంటూ రు జిల్లా పెదకాకాని వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీస్థాయిలో మోటార్ సైకిళ్లు, కార్ల ర్యాలీతో జగన్‌మోహన్‌రెడ్డిని దీక్షా ప్రాంగణం వరకూ తీసుకొచ్చారు. భారీగా జనం రావడంతో పెదకాకాని నుంచి గుంటూరులో దీక్ష జరిగే నల్లపాడు చేరుకోవడానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది.
ఆత్మార్పణ చేసుకున్న వారికీ నివాళులు
సరిగ్గా మధ్యాహ్నం 2.15 గంటలకు వేదికపైకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతిమకు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేక హోదా రాదనే ఆం దోళనతో ప్రాణ త్యాగం చేసిన నెల్లూరు జిల్లాకు చెందిన లక్ష్మయ్య, వల్లం రమణయ్య, తిరుపతికి చెందిన మునికోటి, కడపకు చెందిన ధనుముల లోకేశ్వరరావు, కృష్ణా జిల్లాకు చెందిన సిరిపురపు ఉదయభాను ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక హోదా ఆవశ్యకత, దానివల్ల వల్ల వచ్చే ప్రయోజనాలు, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలు హోదాతో ఎలా అభివృద్ధి చెందాయనే విషయాలను తన ప్రసంగంలో జగన్ వివరించారు.
హాజరైన ముఖ్యనేతలు...
దీక్షలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, ముఖ్యనాయకులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెనుమత్స సాంబశివరాజు, ఎంపీలు వై.వి.సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.