చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్టే! | YS Jagan Mohan Reddy says Telangana bill should not be discussed | Sakshi
Sakshi News home page

చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్టే!

Published Thu, Jan 9 2014 1:05 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్టే! - Sakshi

చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్టే!

‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: సమైక్య రాష్ట్రం కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో తీర్మానం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.‘‘అసెంబ్లీలో తీర్మానం పెట్టి రాష్ట్రాన్ని విభజించండని శాసనసభ్యులంతా ప్రతిపాదిస్తేనే రాష్ట్ర విభజన జరగాలి. కానీ రాష్ట్రాన్ని విడగొట్టాలని కేంద్రం ఒక నిర్ణయం తీసుకొని, ఆ తరువాత చర్చించుకోండని బిల్లును అసెంబ్లీకి పంపితే దాని మీద అసెంబ్లీలో చర్చ జరిగితే మనం విభజనకు ఒప్పుకున్నట్టు కాదా?’’ అని ప్రశ్నించారు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో చరిత్ర హీనులుగా మిగిలిపోకుండా ఇప్పటికైనా చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ ముందుకు రావాలని కోరారు.
 
 
  ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి పిల్లాడూ ఉద్యోగాల కోసం మేం ఎక్కడికి వెళ్లాలని మీ కాలర్ పట్టుకొని అడగకుండా ఉండాలంటే ఇద్దరు కూడా  సమైక్య రాష్ట్రం కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, రాష్ర్టంలో జరుగుతున్న అన్యాయాన్ని దేశం మొత్తం చూసేలా చేయాలని సూచించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర చిత్తూరు జిల్లాలో మూడో విడత, నాలుగో రోజు బుధవారం పుంగనూరు నియోజకవర్గంలో సాగింది. సోమల మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 కిరణ్, చంద్రబాబులకు తెలియడం లేదు..
 రాష్ట్రంలో జరుగుతున్నది అన్యాయం అని చెప్పి దేశంలోని నాయకులంతా చెప్తున్నా.. మన ఖర్మ ఏమిటంటే కిరణ్, బాబులకు మాత్రం ఆ విషయం తెలియటం లేదు. చంద్రబాబు ఈ మధ్య రెండుమూడు మీటింగులు పెట్టారు. మీటింగుల్లో స..మై..క్యం అనే మాట ఆయన నోటి నుంచి వస్తుందేమోనని ఆశగా ఎదురు చూశాం. కానీ ఆ మీటింగుల్లో సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేలా ఆయన మాట్లాడిన మాటలు విన్నప్పుడు నవ్వొచ్చింది. వీళ్లా నాయకులు అనిపించింది.
 
 విశ్వసనీయతకు అర్థం తెలుసా చంద్రబాబూ?
 అధికారంలోకి వస్తే అది చేస్తాను, ఇది చేస్తాను అని చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టడానికి చూస్తున్నారు. చంద్రబాబు గారూ.. మీకు అసలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలుసా? మీరు ఎప్పుడైనా నిజం మాట్లాడారా? నిజం చెప్పకపోగా ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజమని ప్రజలను నమ్మించడానికి వెనుకాడని వ్యక్తి చంద్రబాబు. ఈయన ఇప్పుడు రైతులకు అది చేస్తాను, ఇది చేస్తాను అని హామీలు ఇస్తున్నారు. ఉచితంగా కరెంటు ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని నాడు అవహేళనగా మాట్లాడిన ఆయన.. ఈరోజు ఉచితంగా కరెంటు ఇస్తానంటున్నారు.
 
 
 చంద్రబాబు నాడు రైతన్నలను జైల్లో పెట్టించడానికి ప్రత్యేక పోలీసు స్టేషన్లు తెరిచారు, ఒక జీవోను తీసుకొచ్చి ప్రత్యేక కోర్టులు పెట్టించారు. రైతుల మీద అనేక అఘాయిత్యాలు చేయించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. తిన్నది అరక్క ప్రాణాలు తీసుకుంటున్నారని హేళనగా మాట్లాడారు. తొమ్మిదేళ్లలో రుణాలపై వడ్డీ మాఫీ చేయలేదుగాని.. ఇప్పుడు రుణాలే మాఫీ చేస్తానని చెప్తున్నారు. బాబు విశ్వసనీయత గురించి చెప్పాల్సి వస్తే .. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో పేదవాడికి ఇది చేశాను అని చెప్పుకోవడానికి ఒక్కటంటే.. ఒక్కటైనా ఉందా? సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఇక ప్రజలకు ఏం చేస్తాడు?
 
 అక్కడే ఉండీ.. అసెంబ్లీ సమావేశాలకు రారా?
 ఇవాళ రాష్ర్ట అసెంబ్లీ జరుగుతోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు అసెంబ్లీ వరకు వస్తారు. అక్కడ ఏసీ రూముల్లో కూర్చుంటారు. కానీ సమావేశాలకు మాత్రం రారు. చంద్రబాబు ఏం చేస్తున్నారు అంటే.. అసెంబ్లీ సమావేశాల్లో తన పార్టీ సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేల చేత సమైక్యం అనిపిస్తారు.. తెలంగాణ ఎమ్మెల్యేల చేత విడగొట్టండీ అనిపిస్తారు. ఈ గడ్డ మీద పుట్టినందుకు మీకు నిజంగా మా మీద ప్రేమ ఉందా? అని చంద్రబాబును అడగదలచుకున్నా. సోనియా గాంధీ రాష్ట్రాన్ని విడగొట్టాలని ఉబలాటపడుతున్నారని తెలిసిన వెంటనే ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎందుకు తీర్మానం చేయలేదని కిర ణ్‌కుమార్‌రెడ్డిని అడగదలుచుకున్నా.
 
 ఢిల్లీ అహంకారానికి, తెలుగు వారి ఆత్మ గౌరవానికి మధ్య ఎన్నికలు..
 ఎవరిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి? ఎవరిని తప్పించాలి? రాష్ట్రాన్ని ఎలా విడగొట్టాలి? ఎలా విడగొడితే ఎన్ని ఓట్లు వస్తాయనే దిక్కుమాలిన ఆలోచనతో ఈ రోజు రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఇవాళ చంద్రబాబుకు, మోసం చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్తున్నా.. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న సోనియాగాంధీకి కూడా చెప్తున్నా. వీళ్లంతా ఎన్ని కుట్రలు పన్నినా మరో నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరుగబోయే ఎన్నికలు. ఆ ఎన్నికల్లో మనందరం కలుద్దాం.. ఒక్కటవుదాం. ఒక్కటై 30 ఎంపీ స్థానాలను మనంతట మనమే తెచ్చుకుందాం. ఆ తరువాత ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతాం. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. ఢిల్లీ కోటను మనమే పునర్నిర్మిద్దాం.’’
 
 జగన్‌మోహన్‌రెడ్డి వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్.అమర్‌నాథ్‌రెడ్డి, గాంధీ, పార్టీ నేతలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డ్డి, రోజా తదితరులు ఉన్నారు.
 
 ‘‘చంద్రబాబు గారూ.. మీరు ప్రజలకు ఒక్క రూపాయి ఇస్తానని చెప్పినా కూడా ప్రజలు నమ్మరు. కారణం మీరు తొమ్మిదేళ్లు పరిపాలన చేసినపుడు రూపాయి ఇస్తానని వాగ్దానం చేస్తే.. ప్రజలకు కనీసం 10 పైసల మేలు కూడా చేయలేదు. అదే జగన్‌మోహన్‌రెడ్డి రూ.50 ఇస్తానని చెప్పినా ప్రజలంతా హర్షధ్వానాలతో నమ్మే పరిస్థితి ఉంది. విశ్వసనీయతకు అర్థం అదేనయ్యా చంద్రబాబూ! జగన్ మాట చెప్తే మాట తప్పడు, మడమ తిప్పడు, ఆ మాట కోసం ఎందాకైనా పోతాడు అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. నీలో లేనిది, నాలో ఉన్నది అదే చంద్రబాబూ. వైఎస్సార్ నుంచి నేను వారసత్వంగా తెచ్చుకున్నది విశ్వసనీయత అని గట్టిగా చెప్పగలుగుతాను.’’
 
 పల్లెలన్నీ జగన్ వెంటే..
 సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం కందూరు నుంచి బుధవారం ఉదయం సమైక్య శంఖారావం, ఓదార్పు
 యాత్రను ప్రారంభించిన జగన్‌మోహన్‌రెడ్డి ఆ గ్రామంలో మృతి చెందిన శెట్టి చిన్న రెడ్డెప్ప కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత కూడలిలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలు గ్రామాల మీదుగా సోమల మండల కేంద్రం చేరుకుని అక్కడ నాలుగు రోడ్ల జంక్షన్‌లో జరిగిన భారీ సభలో ప్రసంగించారు. వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పట్రపల్లెలో సాదం మునిస్వామి కుటుంబాన్ని ఓదార్చారు. మారుమూల ప్రాంతాల్లో సైతం భారీగా జనం రావడంతో, చలిలో కూడా గంటలపాటు వేచి ఉండడంతో రాత్రి ఏడు గంటలకు ముగియాల్సిన యాత్ర పదిన్నర గంటల వరకూ సాగింది. జగన్ యర్రాతివారిపల్లెలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట బస చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement