- వైఎస్ రాజశేఖరరెడ్డికి కుటుంబ సభ్యుల ఘన నివాళి
- ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ విజయమ్మ, జగన్, భారతిరెడ్డి, షర్మిలమ్మ తదితరులు
సాక్షి కడప/ వేంపల్లె : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 7వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 8.15 గంటలకు వారితో కలసి అక్కడికి చేరుకున్నారు. జగన్‌తో పాటు ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ జగన్ కుమార్తెలు హర్ష, వర్ష, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, వైఎస్ సుధీకర్‌రెడ్డి, వైఎస్ రవీంద్రనాథరెడ్డి, ఆయన సతీమణి అరుణమ్మ, వైఎస్ సోదరి విమలమ్మ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలత, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ మేనత్త కమలమ్మ, జగన్ మామ ఈసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి సుగుణమ్మ, వైఎస్ భాస్కర్‌రెడ్డి సతీమణి లక్షుమ్మ, పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్‌రెడ్డి, జోసెఫ్‌రెడ్డి, శివప్రకాష్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి తదితరులు నివాళులర్పించారు.
తొలుత జగన్‌తో పాటు కుటుంబసభ్యులు వైఎస్సార్ ఘాట్‌పై పుష్పగుచ్ఛాలు ఉంచి ప్రణమిల్లారు. కొద్దిసేపు అక్కడే మౌనంగా కూర్చున్న సందర్భంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మలు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం పాస్టర్లు రెవెరెండ్ ఫాదర్ నరేష్‌బాబు, మృత్యుం జయ, బెనహర్‌బాబులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్ మేనత్త కమలమ్మ, సోదరి విమలమ్మ భక్తిగీతాలు ఆలపించారు. ఘాట్ వద్ద ప్రార్థనల అనంతరం వైఎస్సార్ విగ్రహానికి కుటుంబసభ్యు లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి కొద్దిసేపు మౌనం పాటించారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా భారీసంఖ్యలో అభిమానులు వైఎస్సార్ ఘాట్‌కు పోటెత్తారు. వైఎస్సార్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. మరోవైపు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.