
పోషకాల లోగుట్టు!
నేలతల్లిని నమ్ముకొని బతికే రైతన్న.. తాను బతుకుతూ నలుగురి ఆకలి తీర్చుతాడు! కానీ, రసాయనిక ఎరువులు, పురుగుమందులు భూమాత జవజీవాలను పీల్చి పిప్పిచేస్తుంటే.. ఏం చేస్తాడు? తిరిగి ఆ నేలతల్లినే శరణు కోరతాడు..! చింతల వెంకటరెడ్డి(63) అదే చేశారు! శ్రీరామ నామంలోని మాధుర్యాన్ని.. కమ్మని ఎండిన మట్టి వాసనలో దర్శించారు. భూమి లోపలి నుంచి తీసి ఎండబెట్టిన మట్టి (లోపలి మట్టి లేదా సబ్‌సాయిల్)ని ఎరువులకు బదులుగా వాడే వినూత్న సాగు పద్ధతిని ఆవిష్కరించిన అసాధారణ రైతు శాస్త్రవేత్త ఆయన. ఎండిన మట్టిలో పోషకాలను పంటలకు ఎప్పటికప్పుడు ఉగ్గు పడుతూ.. ఔషధ గుణాలు పొదిగిన బంగారు పంటల్నే పండిస్తున్నారు.
బహుళజాతి కంపెనీలు భారీ వ్యయంతో తయారుచేస్తున్న జన్యుమార్పిడి ‘గోల్డెన్ రైస్’కు దీటైన విటమిన్ ఏ, సీ ఉన్న బియ్యాన్ని పండిస్తూ.. రేచీకట్లను శాశ్వతంగా పారదోలే కాంతిరేఖలను ప్రసరింపజేస్తున్నారు! పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతులకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో.. 4 దశాబ్దాల సాగు అనుభవం ఉన్న వెంకటరెడ్డి సాధించిన విజయం అనితర సాధ్యమైనది. రసాయనాలు వాడకపోవడం, తక్కువ ఖర్చు, తక్కువ నీటి వినియోగం, భూసారాన్ని స్థిరంగా పెంపొందించుకోవడం ఈ పద్ధతి ప్రత్యేకత. అన్నీ తెలిసీ ఇన్నేళ్లూ మిన్నకున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం.. ఎట్టకేలకు పరిశోధనలకు సిద్ధమవుతుండడం ముదావహం. తన ఆవిష్కరణలు.. సాధక బాధకాల గురించి వెంకటరెడ్డి మాటల్లోనే..
అది 1980-85 మధ్యకాలం.. మోట బావుల కింద వ్యవసాయం జరుగుతున్న రోజులవి. రంగారెడ్డి జిల్లా కీసర మండలం కుందన్‌పల్లిలో మాకు ద్రాక్ష తోట ఉంది. బోర్లు, బిందు సేద్యం, క్రేన్లు లేవు. మోట బావి నుంచి ఇంజిన్లతో నీరు పారించేవారు. ఓ ఏడాది కరువు వల్ల వేసవికి ముందే బావి ఎండిపోయింది. మోట బావిలో పూడిక తీస్తూ.. లోతు తవ్వడం వల్ల ఊరే ఒండ్రు నీటిని ఎప్పటికప్పుడు తోడి ద్రాక్ష తోటకు పారించారు. పూడిక తీసిన నాలుగు నెలలపాటు అనేక దఫాలు తడులు పెట్టాం. ద్రాక్ష దిగుబడి రెట్టింపైంది. అంతకుముందు లేని తీపి, కరకరలాడే లక్షణం తోడై నాణ్యత అమాంతం పెరగడంతో ఆశ్చర్యపోయాం. ఎందువల్ల ఇట్లయిందో కొన్ని సంవత్సరాల తర్వాత గానీ అంతుబట్టలేదు. ఇది పన్నెండేళ్ల క్రితం ముచ్చట. నర్సరీ బెడ్‌లో పూల మొక్కల ఎదుగుదల నాసిగా ఉంది. వేరే చోట నుంచి తవ్వి తెచ్చిన మట్టిని వేస్తే మొక్కలు పెద్ద ఆకులతో భలే పెరిగాయి. భూమి లోపలి మట్టిలోని పోషకాల వల్లే ఈ మార్పు అని అర్థమైంది. అంతకుపూర్వం ద్రాక్ష దిగుబడి రెట్టింపవడానికీ ఇదే కారణమై ఉండొచ్చన్న ఆలోచన మెరిసింది!అప్పటి నుంచి ఎన్నో ప్రయోగాలు చేశాను.. చేస్తున్నాను. రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు వాడకుండా లోపలి మట్టిని తవ్వి ఎండబెట్టి ఎరువుగా వాడుతున్నాను. తొలుత వరి, గోధుమ, కూరగాయల పంటలు పండించి అధిక దిగుబడులు తీశాను. తర్వాత ద్రాక్షలోనూ అనుసరిస్తున్నాను.
మట్టితోనే పదేళ్లుగా వరి, గోధుమ.. నాలుగేళ్లుగా ద్రాక్ష సాగు
వరి, గోధుమల సాగుకు మట్టిని వాడితే ఇక రసాయనిక ఎరువులతోపాటు పురుగుమందులూ అవసరం లేదు. వరి (బీపీటీ 5204) పొలంలో 2003-2007 వరకు వరుసగా 5 పంటల దిగుబడులను వ్యవసాయ శాస్త్రవేత్తలు నమోదు చేశారు. హెక్టారు(రెండున్నర ఎకరాలకు) 10.8 టన్నుల (ఎకరానికి 4,320 కిలోల) ధాన్యం దిగుబడి వచ్చింది. గోధుమ (లోక్-1)పొలంలో 2004- 2009 మధ్యకాలంలో 6 పంటల దిగుబడులను శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. సగటున హెక్టారుకు 5.6 టన్నుల దిగుబడి వచ్చింది. వీటిలో ఏ, సీ విటమిన్లు అత్యధికంగా ఉండడం విశేషం. 2012-13లో హెక్టారుకు 73.22 టన్నుల ద్రాక్ష దిగుబడిని డా. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ద్రాక్ష పరిశోధన కేంద్రం నమోదు చేసింది. ద్రాక్షలో అధిక దిగుబడితోపాటు తీపి, పీచు పదార్థం, కరకరలాడే స్వభావం, నిల్వ సామర్థ్యం బ్రహ్మాండంగా ఉండడం విశేషం. 9 ఏళ్ల ద్రాక్ష తోట దిగుబడి రసాయనిక ఎరువులు వాడుతుండగా ఎకరానికి 15 టన్నులకు తగ్గింది.
అదేతోటకు రసాయనిక ఎరువులు అసలు వాడకుండా ఎండబెట్టిన లోపలి మట్టిని వేస్తుండడంతో గత నాలుగేళ్లలో దిగుబడి 25-30 టన్నులకు పెరిగింది. ద్రాక్షకు వర్షాకాలంలో పాదుకు 4 కిలోల పశువుల పేడ వేస్తున్నాను. శిలీంద్రనాశినులు చల్లక తప్పడం లేదు. ఎకరానికి రూ.3 లక్షల నికరాదాయం వస్తోంది. పర్యావరణానికి మేలు, తక్కువ ఖర్చు, అధిక దిగుబడులు ఈ పద్ధతి విశిష్టతలు. పంటల మార్పిడి అవసరమూ ఉండదు. ఎండబెట్టిన పై మట్టికన్నా.. ఎండబెట్టిన లోపలి మట్టిని ఎక్కువ వాడితే పంటలకు చీడపీడల బెడద బాగా తగ్గుతుంది.
మంచిని పంచాలి.. పెంచాలి..!
మంచిని పంచాలి.. పెంచాలి అన్న పెద్దల మాటలే నాకు ఆదర్శం. పరిజ్ఞానాన్ని రైతులకు అందించా. పేటెంట్‌తో నిమిత్తం లేకుండా రైతులు ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. మీరు మానవాళికి మేలు చేస్తున్నారంటూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సమక్షంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ నన్ను అభినందించారు. అంతకన్నా నాకు కావాల్సిందేముంది? వైస్ ఛాన్సలర్లు, సీనియర్ శాస్త్రవేత్తలెందరో మా పొలాలను సందర్శించినా.. ఈ పద్థతిపై పరిశోధనలు చేపట్టనే లేదు. రైతులే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. రైతుల బృందాలు కోరితే శిక్షణ ఇస్తా..
సంప్రదించాల్సిన చిరునామా: చింతల వెంకటరెడ్డి (98668 83336), 6-46/బి, ఓల్డు ఆల్వాల్, సికింద్రాబాద్
e-mail: cvreddyind@gmail.com
- పంతంగి రాంబాబు, ‘సాగుబడి’ డెస్క్, ఫొటోలు: వెంకట్, మోహన్
ఇది వాస్తవం.. ప్రయోజనకరం.. ఈ ఏడాదే పరిశోధనలు చేపడతాం!
భూమి లోపలి మట్టిని తీసి ఎండబెట్టి వెంకటరెడ్డి గారు సంప్రదాయ విజ్ఞానంతో వరి, గోధుమ పంటలకు ఎరువుగా వాడుతున్నారు. ఇది కొత్త ఆవిష్కరణ. జాతి గర్వించదగిన విషయం. ఎండిన మట్టితోనే పంటలు పండించడం అనేది వాస్తవం.. ఉపయోగకరం. చెప్పడమే కాదు.. రికార్డు స్థాయి దిగుబడులు తీసి చూపిస్తున్నారు. ఐసీఏఆర్ శాస్త్రవేత్తల సహకారంతో రైతుగా ఆయన పేటెంట్ పొందడం చాలా సంతోషకరం. వెంకటరెడ్డి గారు పండించిన గోధుమ, బియ్యంలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంది.
ద్రాక్ష తోట ఇంత ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎకరానికి 100 కిలోల నత్రజని కావాలి. భూమి నుంచి 20-30 కిలోలు అందుతుంది. కానీ, మిగతా నత్రజని ఇంకా ఎక్కడి నుంచో పంటకు అందుతోంది. భూమిలోపలి నుంచి తీసి వేసిన మట్టిలోని సూక్ష్మజీవుల ద్వారానే కావచ్చు. చెలక (ఎర్ర) నేలల్లో మంచి ఫలితాలొస్తున్నాయి. ఇసుక నేలల్లో ఇబ్బంది ఉండకపోవచ్చు. ఫ్లోరైడ్, సున్నం, ఉప్పదనం ఎక్కువగా ఉండే నేలలు, బంక ఎక్కువగా ఉండే నల్లరేగడుల్లో ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. దీనిపై ఈ ఏడాదే పరిశోధనలు ప్రారంభిస్తాం. ఒకటి, రెండేళ్లు సీరియస్‌గా ఇంక్యుబేషన్ స్టడీస్ చేసి, ఏ నేలల్లో ఎలాంటి ఫలితాలొస్తున్నాయో చూడాల్సి ఉంది.
- డా.పద్మరాజు, వీసీ, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
ఇవీ వెంకటరెడ్డి ఆవిష్కరణలు..
కందకం తవ్విన మట్టితో సాగు- 2004:
05-01-2006 - ప్రపంచ మేధోహక్కుల సంస్థ (వైపో) అనుమతి
03-12-2008 - 28 ఐరోపా దేశాల పేటెంట్ మంజూరు
10-03-2010 - భారత్ సహా 70 దేశాల్లో పేటెంట్లు మంజూరు
ఏ,సీ విటమిన్లుండే ధాన్యం సాగు-2009
12-01-2011 - ఐరోపా దేశాల కూటమి పేటెంట్‌కు అనుమతి
19-09-2013 - వైపో అనుమతి మంజూరు (ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించి పేటెంట్లు పొందాల్సి ఉంది.)
విమ్‌టా లాబ్స్ టెస్ట్ రిపోర్టులు (09-04-2008):
బియ్యం (వంద గ్రా.): విటమిన్ ఏ - 1,242 ఇంటర్నేషనల్ యూనిట్లు (బియ్యంలో సాధారణంగా అసలుండదు), విటమిన్ సీ - 6 మైక్రోగ్రాములు
గోధుమ (వంద గ్రా.): విటమిన్ ఏ - 1,370 ఇంటర్నేషనల్ యూనిట్లు
విటమిన్ సీ - 6.10 మైక్రోగ్రాములు
ఇక ‘గోల్డెన్ రైస్’ ఎందుకు?
ఎండిన మట్టితో పండించిన బియ్యం, గోధుమల్లో ఆశ్చర్యకరమైన స్థాయిల్లో ఏ, సీ విటమిన్లున్నాయని విమ్‌టా ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఆ సంస్థలో సంబంధిత శాస్త్రవేత్తలను స్వయంగా కలిసి ఈ పరీక్షల ఫలితాలు కచ్చితమైనవేనని నిర్ధారిం చుకున్నాను.
అప్పటి నుంచి నేను ఈ బియ్యం, గోధుమలనే తింటున్నా. వెంకటరెడ్డి గారి పొలంలో పనిచేసే కూలీ కుమార్తె రేచీకటి, కళ్లు పొడిబారడం, మచ్చలు రావడం తదితర సమస్యలతో బాధపడుతుండేది. రోజూ ఈ అన్నమే తిన్నది. 6-9 నెలల్లో కంటి బాధలన్నీ పూర్తిగా తగ్గడాన్ని గుర్తించాం. బాలల్లో రేచీకటి పోగొట్టేందుకు ఈ బియ్యం చాలు.. జన్యుమార్పిడి ‘గోల్డెన్ రైస్’ అవసరమే లేదు. విటమిన్ ఏ, సీలతోపాటు ఈ బియ్యంలో ఇంకా ఏ యే పోషకాలున్నదీ శాస్త్రవేత్తలు శోధించాలి.
- ప్రొ. జి. నరేంద్రరెడ్డి, మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్
అన్ని పంటలూ పండించొచ్చు..!
రసాయనిక ఎరువుగా, వర్మీ కంపోస్టుగా ఎండు మట్టినే వేసుకుంటూ.. ఏ పోషక లోపమూ లేకుండా పంట పండించడం ప్రపంచంలోనే ప్రప్రథమం. ద్రాక్ష తోటకు సూక్ష్మపోషకాల లోపం లేదు. ఖరీదైన జన్యుమార్పిడి గోల్డెన్ రైస్‌లో కన్నా ఈ పద్ధతిలో పండించిన బియ్యంలో ఎక్కువ ఏ విటమిన్ ఉంది. నల్లగొండ జిల్లా గడ్డిపల్లి కేవీకేలో మేం వరి సాగు చేశాం. అంజిరెడ్డి అనే రైతు ఆరెకరాల ద్రాక్ష తోట సాగు చేస్తూ.. చక్కని ఫలితాలు సాధిస్తున్నారు. ఏ ప్రాంత రైతులైనా సులభంగా అన్ని పంటల్లోనూ అనుసరించదగిన పద్ధతి ఇది.
- డా. జి. సత్యనారాయణ (98662 55061),
విశ్రాంత సీనియర్ శాస్త్రవేత్త, ద్రాక్ష పరిశోధన కేంద్రం(హైదరాబాద్)