గాడిమేత పద్ధతిలో.. మేకల పెంపకం లాభదాయకం | Income in Goats Breeding | Sakshi
Sakshi News home page

గాడిమేత పద్ధతిలో.. మేకల పెంపకం లాభదాయకం

Published Mon, Mar 24 2014 12:10 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

గాడిమేత పద్ధతిలో.. మేకల పెంపకం లాభదాయకం - Sakshi

గాడిమేత పద్ధతిలో.. మేకల పెంపకం లాభదాయకం

100 మేకల పెంపకం ద్వారా  ఏటా రూ. 6.3 లక్షల వరకు ఆదాయం  
 జీవాల అమ్మకంతోపాటు కంపోస్టు ఎరువు ద్వారా అదనపు ఆదాయం
 గాడిమేత పద్ధతిలో తలిచేరి మేకల పెంపకంలో   ఆదర్శంగా నిలిచిన తమిళనాడు యువ రైతు
 
 గొర్రెలు, మేకల పెంపకం అనాదిగా వ్యవసాయానికి అనుబంధంగానే కాకుండా ఉపవృత్తిగానూ కొనసాగుతున్నది. గొర్రెలు, మేకల పెంపకానికి గ్రామాలను ఆనుకొని ఉన్న బంజర్లు, బీడు భూములు, అటవీ భూములే ప్రధాన ఆధారంగా ఉండేవి. చిన్న పట్టణాలు, నగర పంచాయతీల శివారు భూముల్లో కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు మొలవడంతో గొర్రెలు, మేకలకు మేత కరువైంది. దీనికి తోడు వ్యవసాయ రంగాన్ని ఆవరించిన సంక్షోభం ధాటికి గ్రామీణులు వలస బాట పడుతుండడంతో కాపర్ల కొరత ఏర్పడి గొర్రెలు, మేకల పెంపకం కుంటుపడింది.
 
     అయితే, విస్తరిస్తున్న పట్టణీకరణ నేపథ్యంలో మాంసాహారానికి రోజు రోజుకూ గిరాకీ పెరుగుతూనే ఉంది. ఒక అంచనా ప్రకారం.. కేవలం హైదరాబాద్ నగరంలోనే రోజుకు 8 వేలకు పైగా గొర్రెలు, మేకలు, ఐదు లక్షల కోళ్ల వినియోగం జరుగుతున్నది. మాంసాహారానికి నానాటికీ పెరుగుతున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే వ్యవసాయానుబంధంగా గొర్రెలు, మేకల పెంపకం లాభదాయకమైన  వ్యవ హరమే. మరీ ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులకు అదనపు ఆదాయాన్నిచ్చే లాభసాటి వ్యాపకం ఇది. వ్యవసాయానికి అనుబంధం పాడి పరిశ్రమ నిర్వహించే రైతులు మేకలు లేదా గొర్రెల పెంపకాన్ని కూడా సులభంగా చేపట్టవచ్చు. ఒక సంకరజాతి గేదె లేదా ఆవు కొనుగోలుకయ్యే ఖర్చుతో పది మేకలు లేదా గొర్రెలను కొనుగోలు చేయవచ్చు.
 
 బీళ్లు కరువైన పరిస్థితిలో మేకల పెంపకం ఎలా సాధ్యమనే సందేహం వెన్నాడుతుంది. దీనికి పరిష్కారం మేకలు లేదా గొర్రెలను షెడ్డులో ఉంచి మేత వేసి పెంచడమే. పశుగణాభివృద్ధి శాఖ అధికారుల పరిభాషలో చెప్పాలంటే దీన్ని ‘స్టాల్ ఫీడింగ్’ పద్ధతి లేదా గాడి మేత పద్ధతి అంటారు. ఈ విధానంలో మెలకువలను తెలుసుకోవడం కోసం ఆచార్య ఎన్.జీ. రంగా విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం ఉప సంచాలకులు డాక్టర్ పున్నారావు ఆధ్వర్యంలో 18 మంది సృజనాత్మక రైతుల బృందం ఇటీవల తమిళనాడులో పర్యటించింది. వీరితోపాటు వెళ్లిన ‘సాగుబడి’ ప్రతినిధి కోయంబత్తూర్ జిల్లాలో నర్సింహ నాయకన్‌పాలెంలో వెంకటేశ్ నాయుడు అనే రైతు ఫారాన్ని సందర్శించి గాడి మేత విధానంలో గొర్రెలు, మేకల పెంపకపు పద్ధతులను అధ్యయనం చేశారు.
 
 తమిళనాడులోని అనేక జిల్లాల్లో రైతులు గొర్రెలు, మేకల పెంపకాన్ని, బ్రీడింగ్‌ను పరిశ్రమ స్థాయిలో సాగిస్తున్నారు. అభ్యుదయ యువ రైతు వెంకటేశ్ తలచేరి మేకల పోషణలో ఆదర్శంగా నిలిచాడు. తనకున్న ఎకరంన్నర పొలంలోని 50 సెంట్లలో తీపి సజ్జ(కో ఎఫ్‌ఎస్-29 రకం), మిగతా 75 సెంట్లలో కో-4 గడ్డిని సాగు చేశాడు. ఈ గడ్డి మడుల మధ్య మునగ, అవిసె చెట్లు అంతర పంటలుగా పెంచాడు. గడ్డికి నీరు పెట్టడానికి మొత్తం పొలాన్ని నాలుగు సమభాగాలుగా విభజించి.. నాలుగు ‘రెయిన్‌గన్’లు ఏర్పాటు చేశాడు. ఈ రెయిన్‌గన్‌ల వినియోగం వల్ల నీరు చాలా మేరకు ఆదా అవుతున్నదని వెంకటేశ్ నాయుడు చెప్పాడు.
 
 మిగతా పావు ఎకరం స్థలంలో మేకల పెంపకం కోసం నిర్మించిన దొడ్డిలో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో షెడ్డు నిర్మించాడు. ఈ షెడ్డులో ఐదడుగుల ఎత్తులో కొయ్య పలకలను ఒకదానికి ఒకటిని దగ్గరగా చేర్చి గొర్రెలు, మేకలు పడుకునేందుకు మంచెలాగా నిర్మించాడు. నేలపై కాకుండా దీనిపై విశ్రమిస్తాయి. మేకలు విసర్జించిన పెంటికలు, మూత్రం ఈ కొయ్య పలకల సందుల్లోంచి నేల మీద పడతాయి. పెంటికలను సేకరించి వర్మీ కంపోస్టు తయారీకి వినియోగిస్తారు.
 తలచేరి మేకలు ఈతకు రెండు పిల్లల్ని పెడతాయి. ఆరు నెలల్లో 20 కిలోల కనీస బరువు పెరుగుతాయి. మాంసానికైతే కిలో రూ. 300ల చొప్పున, బ్రీడింగ్ కోసమయితే కిలో రూ. 350ల చొప్పున అమ్ముతున్నట్లు వెంకటేశ్ నాయుడు చెప్పాడు. ఫారమ్ ప్రారంభించిన సంవత్సరం తరువాత నుంచి ఏటా కనీసం 80 మేకల చొప్పున అమ్మితే రూ. 4,80,000 ఆదాయం వస్తుంది. తల్లి మేకలు అలాగే ఉంటాయి. ఇవి కాకుండా మేకల ద్వారా కనీసం 60-80 టన్నుల ఎరువు వస్తుంది. దీన్ని వర్మీ కంపోస్టుగా చేసి కిలో రూ. 2.50కు అమ్మితే సుమారు రూ. లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు ఆదాయం వస్తుందని ఆయన వివరించారు.
     
 - జిట్టా బాల్‌రెడ్డి, ‘సాగుబడి’  డెస్క్
 (కోయంబత్తూరు నుంచి)
 
 వేయి అడుగుల్లో వంద మేకలు!
 
 ఎంసీఏ చదివాను. ఓ పేరున్న సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగిగా చేరాను. కొద్ది రోజుల తర్వాత విసుగొచ్చింది. ఉద్యోగం వదిలేశాను. తరువాత వ్యాపారం ప్రారంభించి సోని సంస్థ ఉత్పత్తుల పంపిణీ, గోదాము నిర్వహణ చేపట్టాను. వ్యాపారం లాభసాటిగానే ఉన్నా అందులోనూ సంతృప్తి లభించలేదు. పంపిణీ వ్యాపారం వదులుకున్నాను. నాకున్న పొలంలో స్వంతంగా ఏదైనా చేయాలని ఆలోచించి.. మేకల పెంపకం చేపట్టాను. రూ. 4 లక్షల పెట్టుబడి పెట్టాను. 80 తలచేరి మేకలు, కొన్ని జమునాపరి, బీటిల్ మేకలు కొనుగోలు చేశాను. కో-4తోపాటు ఎఫ్‌ఎస్ 29 తీపి సజ్జరకం సాగు చేశాను. వెయ్యి చదరపు అడుగుల స్థలంలో షెడ్డు నిర్మించాను. ఇందులో 100 జీవాలను పెంచవచ్చు. పచ్చి మేత కోసి చాప్ కట్టర్‌తో సన్నగా తరిగి వేస్తాను. సగటున మేకకు రోజుకు ఐదు నుంచి ఆరు కిలోల మేత అవసరం. పొలంలో అంతర పంటగా మునగ, అవిసె మొక్కలు వేశాను. పచ్చిమేతలో మునగ, అవిసె ఆకు చేర్చడం వలన బరువు పెరగడంతో పాటు జీవాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మేకల్లో సహజంగానే రోగనిరోధక శక్తి ఎక్కువ.
 మేము బ్రీడర్ ఫామ్‌ను కూడా నడుపుతున్నాం. మేకలను మాంసానికి అమ్మడమే కాకుండా పిల్లలను పెంచి పెంపకందార్లకు అమ్ముతున్నాం. పెంపకానికి ఆరు నుంచి ఎనిమిది నెలల మేక పిల్లలు అనువైనవి. మేక పిల్లలు ఆరు నెలల్లో దాదాపు 16 నుంచి 20 కిలోల బరువు పెరుగుతాయి.  పెంపకందార్లకు కిలో రూ. 350 చొప్పున, మాంసం వ్యాపారులకు కిలో రూ. 30 చొప్పున అమ్ముతున్నాం. ప్రధానంగా మేక పిల్లల ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకున్నాం. మేకల పెంపకం చేపట్టదలచిన వారు అందుబాటులో ఉన్న సామగ్రితో షెడ్డు వేసుకుంటే ఖర్చు తగ్గుతుంది. షెడ్డును శుభ్రంగా ఉంచుకోవడం మీద దృష్టి నిలిపితే జీవాలకు వ్యాధులు సోకవు. మాంసాహారానికి నిరంతరం డిమాండ్ పెరుగుతున్నందున రైతుకు నష్టం అనే ప్రశ్నే ఉండదు. రెండేళ్లుగా మేకల పెంపకం కొనసాగిస్తూ.. మంచి ఆదాయంతో పాటు ఆనందాన్నీ పొందుతున్నాను.
 ఆసక్తి కలిగిన రైతులు సంప్రదించాల్సిన చిరునామా:
 ఎన్ వెంకటేశ్ నాయుడు (098949 51264)
 నర్సింహనాయకన్ పాళ్యం, కోయంబత్తూర్ జిల్లా, తమిళనాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement