సేంద్రియ పాల విప్లవానికి బాటలు..! | The path to the Organic Milk Revolution ..! | Sakshi
Sakshi News home page

సేంద్రియ పాల విప్లవానికి బాటలు..!

Published Mon, Sep 4 2017 11:07 PM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM

సేంద్రియ పాల విప్లవానికి బాటలు..!

సేంద్రియ పాల విప్లవానికి బాటలు..!

‘అక్షయకల్ప’ వ్యవస్థాపకుడు డా. జి.ఎన్‌.ఎస్‌. రెడ్డితో ‘సాగుబడి’ ముఖాముఖి

పాడి రైతులు మార్కెట్‌లో పెరుగుతున్న పోటీని తట్టుకొని నిలబడాలంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు కొత్త పోకడలను అనుసరించాల్సి ఉంటుంది. అయితే, పాడిని నమ్ముకొని జీవిస్తున్న లేదా పాడి రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్న చిన్న, సన్నకారు రైతులు ఎవరికి వారు తమంతట తాము అత్యాధునిక సాంకేతికతలను, కొత్త పోకడలను అందిపుచ్చుకోవడం చాలా కష్టసాధ్యమైన విషయం.ఒంటరిగా చేయలేనిది కలసికట్టుగా కదిలితే అసాధ్యం కాబోదు.  ముఖ్యంగా.. ఉత్తమ ప్రమాణాలతో కూడిన సేంద్రియ పాల ఉత్పత్తిని చేపట్టగలిగితే చిన్న, సన్నకారు పాడి రైతుల భవితకు ఎటువంటి ఢోకా ఉండబోదని నిపుణులు, కర్ణాటకకు చెందిన డాక్టర్‌ గుడ్డహట్టి నంజుండ శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు.
 
స్వావలంబనే ప్రాతిపదికగా సేంద్రియ ఆవు పాల ఉత్పత్తిని చేపట్టి స్థిరమైన అధిక నికరాదాయాన్నిచ్చే దిశగా చిన్న, సన్నకారు రైతులకు ఆయన మార్గదర్శకంగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంకేతికతలను, నిర్వహణ సామర్ధ్యాన్ని, మార్కెటింగ్‌కు సంబంధించిన మద్దతు వ్యవస్థలను ఏర్పాటు చేశారు. డా. జి.ఎన్‌.ఎస్‌. రెడ్డి పశువైద్యంలో పట్టా పొందాక భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్‌ ఫౌండేషన్‌(బి.ఎ.ఐ.ఎఫ్‌.)లో 30 ఏళ్లపాటు సేవలందించి ఉపాధ్యక్షుడి హోదాకు ఎదిగి.. 2010లో బయటకు వచ్చారు.

ఆ తర్వాత తుమ్‌కూర్‌ జిల్లా తిప్తూరులో ‘అక్షయకల్ప’ సంస్థను నెలకొల్పారు. ఇప్పటికే 150 మంది గ్రామీణ సేంద్రియ పాడి రైతాంగానికి వెలుగుబాట చూపారు. వికేంద్రీకృత పద్ధతిలో చిన్న, సన్నకారు రైతుల చేత సేంద్రియ ఆవు పాల ఉత్పత్తిని ప్రోత్సహించే ఈ సంస్థ దేశంలోనే మొట్టమొదటిది కావడం విశేషం. ఆయన విశేష కృషికి గుర్తింపుగా 2013లో ప్రతిష్టాత్మకమైన అశోక ఫెలోషిప్‌నకు ఎంపికయ్యారు. సేంద్రియ పాల వినియోగంపై  నగరవాసుల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో డా. జి.ఎన్‌.ఎస్‌. రెడ్డితో ‘సాగుబడి’ ముఖాముఖిలో ముఖ్యాంశాలు..


►  సేంద్రియ పాల ప్రత్యేకత, ఆవశ్యకత ఏమిటి? పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలేమిటి?
సేంద్రియ పాలే అసలైన పాలు. సేంద్రియ పద్ధతుల్లో పెరిగిన పశుగ్రాసాన్ని తింటూ.. స్వేచ్ఛగా తిరుగాడుతూ, వత్తిడి లేని వాతావరణంలో పెరిగే ఆవుల నుంచి పరిశుభ్రమైన పద్ధతుల్లో సేకరించే యాంటీబయోటిక్స్, హార్మోన్లు, రసాయనిక అవశేషాల్లేని స్వచ్ఛమైన పాలే సేంద్రియ పాలు. పాలల్లో యాంటీబయోటిక్స్‌ అవశేషాలు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. హార్మోన్ల వల్ల బాలికలు ముందుగానే రజస్వల అవుతున్నారు. పశువులకు మేపుతున్న కృత్రిమ దాణా ద్వారా అఫ్లోటాక్సిన్లు పాలలోకి చేరి వినియోగదారుల కాలేయాన్ని దెబ్బతీస్తున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవశేషాల్లేకుండా.. సబ్బు, డిటర్జెంట్, ఆయిల్స్, సోడా తదితరాలతో కలుషితం కానివే అసలైన అర్థంలో సేంద్రియ పాలు.
     
►  పరిమిత వనరులు కలిగిన చిన్న, సన్నకారు రైతులు ఈ ప్రమాణాలను అందిపుచ్చుకోగలుగుతారా?
గ్రామీణ చిన్న, సన్నకారు రైతులు తమంతట తాము ఒంటరిగా సుస్థిరమైన సేంద్రియ పాల ఉత్పత్తిని చేపట్టడం.. డెయిరీ నిర్వహణ నుంచి మార్కెటింగ్‌ వరకు అన్ని పనులూ ఒంటరిగా, సొంతంగా చక్కబెట్టుకొని నిలవగలగడం కష్టమే. ఈ అవరోధాలను అధిగమించడానికి దోహదపడే లక్ష్యంతోనే నేను బి.ఎ.ఐ.ఎఫ్‌.లో నుంచి బయటకు వచ్చి, 2010లో ‘అక్షయకల్ప’ను కర్ణాటకలోని తుమ్‌కూర్‌ జిల్లాలో స్థాపించాను. గాంధీజీ స్వావలంబన భావాలకు అనుగుణంగా గ్రామీణ చిన్న, సన్నకారు రైతులకు గౌరవప్రదమైన, స్థిరమైన ఆదాయాన్ని అందించే సేంద్రియ డెయిరీపై వినూత్న నమూనాను రూపొందించాను. ఇప్పటికే కర్ణాటకలోని 150 మంది పాడి రైతులు మా నమూనా ప్రకారం సేంద్రియ పాల ఉత్పత్తిని చేపట్టి, సుస్థిరమైన నికరాదాయం పొందుతున్నారు. 50 కిలోమీటర్ల పరిధిలో ఎంపికచేసిన రైతుల చేత బైబాక్‌ ఒప్పందం ద్వారా సేంద్రియ పాలను ఉత్పత్తి చేయించి.. లీటరు రూ. 35 చొప్పున రైతుకు చెల్లిస్తాం. పాలను మేమే సేకరించి.. బెంగళూరులో లీటరు రూ. 70కి విక్రయిస్తున్నాం.
     
►  సేంద్రియ పాలను రైతుల నుంచి కొని మీరే మార్కెట్‌ చేస్తారా?
అవును. చిన్న, సన్నకారు రైతు 25కు మించకుండా సంకరజాతి ఆవులతో సేంద్రియ డెయిరీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రైతుకు కనీసం 5 ఎకరాల సొంత పొలం ఉండాలి. బోర్లలో 3 ఇంచుల నీరుండాలి. 50% దేశీ లక్షణాలున్న నాణ్యమైన సంకరజాతి ఆవులను అందిస్తాం. ఇవి కనీసం 10 లీటర్ల పాలు ఇస్తాయి. 15 రకాల పశుగ్రాసాలను, పశుగ్రాసానికి పనికొచ్చే చెట్లను పూర్తి సేంద్రియ పద్ధతుల్లో ఆవుల పేడ, మూత్రం ద్వారా సాగు చేయిస్తాం. ఆవుకు రోజుకు 40 కిలోల పచ్చిమేత, కిలో ఎండుమేత వేస్తాం. కృత్రిమ దాణా వాడాల్సిన అవసరం లేదు.. రైతుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, పాలు పితికే యంత్రాలను, పాలను పితికిన వెంటనే నిల్వచేసే చిల్లింగ్‌ యంత్రాలను, బయోగ్యాస్‌ ఉత్పత్తి వ్యవస్థను ప్రతి రైతు క్షేత్రంలో ఏర్పాటు చేస్తాం. పరిశుభ్ర వాతావరణంలో యంత్రాలతో పితికినప్పుడు పాలను పాశ్చురైజ్‌ చేయనవసరం కూడా లేదు. అనుదిన కార్యక్రమాల నిర్వహణలోనూ మా నిపుణులు రైతులకు వెన్నుదన్నుగా ఉంటారు. రైతు స్వయంగా వ్యవసాయ క్షేత్రంతో మమేకమై ఉండి, ఆవులను ప్రత్యేక వ్యక్తిగత శ్రద్ధతో చూసుకోవాలన్నది ముఖ్యమైన నియమం. అప్పుడప్పుడూ వస్తూ పోతూ ఉండి పూర్తిగా పనివాళ్ల మీద ఆధారపడే రైతులను మేము ప్రోత్సహించం.

►  రైతు ఎంత పెట్టుబడి పెట్టాలి?
ప్రాజెక్టు వ్యయం రూ. 25 లక్షలు. రైతు తన సొంత డబ్బు రూ. 5 లక్షలు పెట్టుబడి ఉండాలి. మిగతా రూ. 20 లక్షలను బ్యాంకు నుంచి రుణం ఇప్పిస్తాం. త్రైపాక్షిక ఒప్పందం మేరకు.. నెల నెలా రుణం కిస్తీని మేమే బ్యాంకుకు చెల్లిస్తాం.

►  ఆవులపై వత్తిడి లేకుండా పెంచడం అంటే?
పశువులను కిక్కిరిసిన షెడ్లలో, చిత్తడిగా అపరిశుభ్ర వాతావరణంలో రోజంతా కట్టేసి ఉంచడం సాధారణంగా చూస్తూ ఉంటాం. అలాకాకుండా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా షెడ్‌ను డిజైన్‌ చేశాం. స్వేచ్ఛగా తిరగడానికి కొంత స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయిస్తాం. 25కు మించి ఎక్కువ ఆవులు ఒక డెయిరీలో పెట్టనివ్వం. కాబట్టి, ఆవులు ఒత్తిడి లేకుండా పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యదాయకంగా పెరుగుతాయి. పాలను చేతితో పితకటం ఉండదు కాబట్టి శుద్ధంగా ఉంటాయి. ఆవులకు వచ్చే వ్యాధులు కూడా 5%కి తగ్గిపోతాయి. సాధ్యమైనంత వరకు మూలికా వైద్యం మా సంస్థే చేయిస్తుంది.
     
►  మొలకగడ్డిని వాడరా?
మొలక గడ్డి ఆవుకు రోజుకు ఒకటి, రెండు కిలోలకు మించి పెట్టకూడదు. విత్తనాలు మొలిపించిన వారం రోజుల్లో మేతగా వేస్తాం కాబట్టి అందులో నీరు ఎక్కువ ఉంటుంది. పీచు నాసిరకంగా ఉంటుంది. ఎక్కువ వేస్తే పశువుకు జీర్ణం కాదు.
     
►  మీతో కలిసి పనిచేసే రైతులకు ఆదాయ భద్రత ఎలా ఉంటుంది?

రైతు స్థిమితంగా ఆవుల బాగోగులను చూసుకుంటే చాలు. మార్కెటింగ్‌కు సంబంధించిన ఒత్తిడి ఉండదు. బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసుకుంటాం కాబట్టి విద్యుత్‌ ఖర్చు చాలా తక్కువ. లీటరు సేంద్రియ పాల ఉత్పత్తి ఖర్చు రూ. 15కు దాటదు. రైతుకు మేం రూ. 35 చెల్లిస్తాం. సేంద్రియ డెయిరీ ప్రాంగణంలో పండ్ల చెట్లు, ఇతరత్రా మార్గాల ద్వారా కూడా అదనపు ఆదాయం సమకూర్చే ప్రయత్నాలు చేస్తున్నాం. 5 ఎకరాల భూమిలో 25 ఆవులు పెట్టుకున్న రైతుకు నెలకు అన్ని ఖర్చులూ పోను రూ. లక్ష నికరాదాయం స్థిరంగా ఏడాది పొడవునా వచ్చేలా ప్రణాళికలను అమలు చేస్తున్నాం. సాధారణంగా పాడి రైతులు కృత్రిమ దాణా కొనుగోళ్లకే ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతుంటారు. అందువల్ల నిజానికి చిన్న, సన్నకారు పాడి రైతులకు చేకూరే ఆదాయం కన్నా ఖర్చే ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఈ దుస్థితి నుంచి బయటపడి, స్థిరంగా గౌరవప్రదమైన నికరాదాయం పొందే అత్యుత్తమ మార్గాన్ని పాడి రైతులకు మేం చూపిస్తున్నాం.
     
►  మీరు చెప్పేదాన్ని బట్టి.. దగ్గరి ప్రాంతాల్లో ఉండే  రైతులే సేంద్రియ పాల ఉత్పత్తిని చేపట్టి.. ఒకే సంస్థ ద్వారా మార్కెటింగ్‌ చేయాలి. విడిగా ఒక రైతు సేంద్రియ పాల ఉత్పత్తి చేపట్టాలంటే ఎలా?
మేం అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను రైతుల చేత అమలు చేయిస్తాం. ఆవుల ఎంపిక, పోషణ, యంత్రాల నిర్వహణ, పాల నాణ్యత.. తదితర అంశాలన్నిటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాం. ఒంటరిగా ఒకే రైతు ఇవన్నీ చూసుకోవడం కష్టం. అందుకే బెంగళూరు పరిసరాల్లోని 50 కిలోమీటర్ల పరిధిలోని పాడి రైతులతోనే మేం ఒప్పందం చేసుకొని, సేంద్రియ పాలు ఉత్పత్తి చేయిస్తున్నాం. పాలతోపాటు ఇతరత్రా పాల ఉత్పత్తులను కూడా అమ్ముతున్నాం. కాబట్టే, రైతుకు లీటరు పాలకు రూ. 35 చెల్లిస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, చెన్నై నగరాలకు కూడా ‘కల్పసిరి’ పేరిట సేంద్రియ పాల ఉత్పత్తిని చేపట్టబోతున్నాం. ఒకవేళ ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు ఎవరైనా ముందుకొస్తే వాళ్లతో కలిసి పనిచేస్తాం. ఈ నగరాల పరిధిలో ఇప్పటికే డెయిరీ ఫామ్స్‌ నిర్వహిస్తున్న రైతులకు మాతో కలవాలని ఆసక్తి ఉంటే.. వారికి కూడా సేంద్రియ పాల ఉత్పత్తి పద్ధతులను అలవాటు చేస్తాం.  
     
►  ఈ 3 నగరాలకు దూరంగా ఉన్న ఇతర ప్రాంతాల రైతులకు కూడా సేంద్రియ పాల ఉత్పత్తిలో శిక్షణ ఇస్తారా?

మేం ఒప్పందం చేసుకున్న రైతులకు మాత్రమే తొలుత 8 రోజుల శిక్షణ ఇస్తాం. ఇతర రైతులు ఆసక్తి ఉంటే మా పరిధిలోని సేంద్రియ డెయిరీ ఫామ్స్‌ను సందర్శించి అవగాహన పెంచుకోవచ్చు. ఒత్తిడి లేని వాతావరణంలో ఆవుల పెంపకం, గ్రామీణ రైతుకు కూడా ఉద్యోగస్తుల మాదిరిగా స్థిరంగా గౌరవప్రదమైన నికరాదాయం పొందేందుకు సహాయపడటంతోపాటు.. అన్ని విధాలా ఆరోగ్యదాయకమైన సేంద్రియ పాలను చైతన్యవంతులైన వినియోగదారులకు అందించడమే మా అంతిమ లక్ష్యం.

►  ఎ2 మిల్క్‌ను అందించే దేశీ ఆవులను మీరెందుకని ప్రోత్సహించడం లేదు..?
దేశీ ఆవుల ద్వారా పాల దిగుబడి తక్కువగా ఉంటుంది. రైతుకు గిట్టుబాటు కాకపోవచ్చు. పాల దిగుబడి తగ్గినా పర్వాలేదని రైతు అనుకుంటే గిర్‌ వంటి దేశీ ఆవులను కూడా ఈ పద్ధతిలో పెంచుకోవచ్చు.
(డా. జి.ఎన్‌.ఎస్‌.రెడ్డిని 099000 92392 నంబరులో లేదా dr.gnsr@gmail.com
ద్వారా సంప్రదించవచ్చు. http://blog.akshayakalpa.org)
ఇంటర్వ్యూ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement