
తూటి కషాయంతో చీడ పీడలు దూరం
వ్యవసాయ పెట్టుబడిలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులదే సింహ భాగం.
శక్తిమంతమైన కీటకనాశినిగా గుర్తించిన విదర్భ కేవీకే
వ్యవసాయ పెట్టుబడిలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులదే సింహ భాగం. వాతావరణంలో విపరీత మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో పైరు పెట్టడం కంటే దాన్ని కాపాడుకోవడానికే ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతులు, వ్యవసాయ రంగంలోని సృజనశీలురు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలూ ఈ దిశగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తూటేరు (ఇంపోమియా ఫిస్టులోసా) లేదా తూటి ఆకుల కషాయం శక్తివంతమైన కీటకనాశినిగా గుర్తించారు.
తూటేరును లొట్టపీచు, కాంగ్రెస్ కంప, బేషరమ్ అని కూడా తూటి మొక్కను పిలుస్తారు. కంది, మినుము, పత్తి, క్యాబేజీ, క్యాలి ఫ్లవర్, వంగ తదితర పురుగుల బెడద ఎక్కువగా ఉండే అన్ని పంటల సస్యరక్షణకు ఈ కషాయం వాడుతూ సత్ఫలితాలను పొందుతున్నారు. క్యాబేజీ పంటను తీవ్రంగా నష్టపరిచే డైమండ్ బ్యాక్ మాత్‌పై తూటేరు కషాయం పిచికారీ చేస్తే పంట నష్టం కేవలం 2 నుండి 3 శాతం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.
అయితే, రసాయనిక పురుగు మందులు పిచికారీ చేసినప్పుడు పంట నష్టం దాదాపు 11 నుంచి 12 శాతం వరకు ఉన్నట్లు గుర్తించారు. దీంతో తూటేరు కషాయ వినియోగం విదర్భ ప్రాంతం అంతటా వ్యాపించింది. కూరగాయలు, పప్పుధాన్యాలు, పండ్ల తోటలు సాగుచేసే రైతులు దీన్ని వినియోగిస్తున్నారు. ఆ ప్రాంత రైతుల సామూహిక ప్రయోగాల ఫలితంగా తూటేరు కషాయం పత్తిలో కాయతొలిచే పురుగు, శనగపచ్చ పురుగు, తలనత్త పురుగు, పచ్చపురుగు, రాగిలద్దె పురుగు, డైమండ్ బ్యాక్ మాత్, గొంగళి పురుగు, ముక్కుపురుగులను కాండం తొలిచే పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులను నివారించడానికి శక్తివంతంగా పనిచేస్తోందని తేలింది.
తూటి కషాయం తయారీ విధానం: ఒక కిలో తూటేరు లేత ఆకులను సేకరించాలి. ఆకులను మెత్తటి ముద్దగా నూరి.. 10 లీటర్ల నీటిలో వేసి 5 లీటర్లకు తగ్గే వరకు మరిగించాలి. కుండలో మిగిలిన కషాయానికి మరో అర కిలో తూటేరు ఆకుల ముద్దను కలిపి.. కషాయం సగానికి తగ్గే వరకు మరిగించాలి. కుండలో మిగిలిన 2.5 లీటర్ల కషాయాన్ని చల్లారనిచ్చి వడకట్టుకోవాలి. 2.5 లీటర్ల కషాయాన్ని 200 లీటర్లలో కలపాలి. లీటరు కషాయానికి 0.5 మిల్లీ లీటర్ల చొప్పున ఎమల్సిఫయర్‌ను కలిపిన తర్వాత పిచికారీ చేసుకోవాలి.