పశువులకూ విటమిన్లు కావాలి | Vitamins should want for Cattell's vacation | Sakshi
Sakshi News home page

పశువులకూ విటమిన్లు కావాలి

Published Sat, Jul 19 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

పశువులకూ విటమిన్లు కావాలి

పశువులకూ విటమిన్లు కావాలి

 పాడి-పంటపాడి-పంట:  పశువులకు అన్ని పోషకాలను తగిన మోతాదులో అందించినప్పుడే ఉత్పాదకత బాగుంటుంది. పశువుకు ప్రొటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ఖనిజాలు, నీరు మొదలైనవే కాకుండా విటమిన్లు కూడా ఇవ్వాలి. పశువు శరీర సాధారణ జీవన ప్రక్రియకు ఇవి ఎంతో అవసరం. శరీర నిర్వహణ, పెరుగుదల, ఉత్పత్తి, ఆరోగ్య పరిరక్షణకు కూడా ఇవి అవసరమే. విటమిన్లు మేత పదార్థాలు కాకపోయినా వాటిలోని పోషకాలను పశువు శరీరం సమర్ధవంతంగా గ్రహించేందుకు దోహదపడతాయి. విటమిన్లను చాలా వరకూ మేత ద్వారానే అందించాలి. అయితే కొన్ని విటమిన్లు పశువు శరీరంలో నివసించే సూక్ష్మక్రిముల ద్వారా ఉత్పత్తి అవుతాయి. విటమిన్లలో ఏది లోపించినా దానికి సంబంధించిన జీవ రసాయన ప్రక్రియ ఆగిపోతుంది.

 విటమిన్లు రెండు రకాలు... కొవ్వులో కరిగేవి (విటమిన్-డి, ఇ, కె), నీటిలో కరిగేవి (బి-కాంప్లెక్స్, విటమిన్-సి). కొవ్వులో కరిగే విటమిన్లు చాలా వరకూ పశువుకు మేత ద్వారానే లభిస్తాయి. ఒకవేళ పశువు వీటిని ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ అవి కాలేయంలో నిల్వ ఉంటాయి. అయితే నీటిలో కరిగే విటమిన్లు మాత్రం నిల్వ ఉండవు. మూత్రం ద్వారా బయటికి పోతాయి. ఒక్క విటమిన్ బి-12 మాత్రమే పశువు శరీరంలో నిల్వ ఉంటుంది.
 
 శరీర కణాలు పనిచేయాలంటే...
 పశువుకు విటమిన్-ఎ ఎంతో అవసరం. ఇది కెరోటిన్ రూపంలో లభిస్తుంది. పసుపు, మొక్కజొన్న, పచ్చిమేతల్లో అధికంగా ఉంటుంది. పశు వు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కెరోటిన్ వి టమిన్-ఎగా మారుతుంది. ఇది 90% వరకూ కాలేయంలో నిల్వ ఉంటుంది. మిగిలినది మూ త్రపిండాలు, ఊపిరితిత్తుల్లో దాగి ఉంటుంది.
 
  శరీర కణాలు బాగా పనిచేయాలంటే విటమిన్-ఎ అవసరమవుతుంది. ఇది లోపిస్తే చర్మం గరుకుగా తయారవుతుంది. కంటి లోపలి పొర ఎండిపోయి, చూపు పోయే ప్రమాదం ఉంది. పశువులో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా అది సులువుగా వ్యాధుల బారిన పడుతుంది. విటమిన్-ఎ లోపిస్తే పశువుకు ఆకలి మందగిస్తుంది. కోళ్లకు అయితే కళ్లు, ముక్కు రంధ్రాల నుంచి ద్రవాలు కారుతుంటాయి. ఎముకల్లో పెరుగుదల ఆగిపోతుంది. వాటి ఆకారం కూడా మారుతుంది. విటమిన్-ఎ లోప నివారణ కోసం పశువుకు విధిగా పచ్చిమేతలు మేపాలి.
 
 కాల్షియంను అందిస్తుంది
 విటమిన్-డి చాలా వరకూ సూర్యరశ్మిలోని అల్ట్రా వయొలెట్ కిరణాల ద్వారా పశువు శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. ఎముకల నుంచి కాల్షియం విడుదల కావడానికి, అది శరీర భాగాలకు చేరడానికి విటమిన్-డి ఎంతో అవసరం. అంతేకాదు... పేగుల ద్వారా కాల్షియం-భాస్వరం పశువు శరీర భాగాలకు చేరడానికి, వాటిని ఎముకల్లో నిల్వ చేయడానికి కూడా ‘డి’ విటమిన్ అవసరమవుతుంది. ఎముకలకు కాల్షియం అందకపోతే పశువుకు ‘రికెట్స్’ వ్యాధి సోకుతుంది. పెద్ద పశువులకు ‘ఆస్టియో మలేసియా’ అనే స్థితి ఎదురవుతుంది. విటమిన్-డి లోపిస్తే ఎముకలకు సంబంధించిన వ్యాధులు రావడమే కాకుండా ఆకలి మందగించడం, పెరుగుదల సరిగా లేకపోవడం, బిగుసుకుపోవడం, కుంటడం, ఎక్కువగా లేదా తరచుగా ఎముకలు విరగడం, పక్కటెముకలు పూసల మాదిరిగా తయారవడం, కీళ్లు వాయడం వంటి లక్షణాలు కూడా కన్పిస్తాయి. కోళ్లలోనూ, దూడల్లోనూ రికెట్స్ లక్షణాలు బాగా కన్పిస్తాయి.
 
 పునరుత్పత్తికి దోహదపడుతుంది
 విటమిన్-ఇ పునరుత్పత్తికి దోహదపడుతుంది. మొలక వచ్చిన శనగలు, ఉలవలు వంటి వాటిలో ఇది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎదకు రాని పశువులకు మొలక వచ్చిన శనగలను మేపాలని చెబుతుంటారు. ‘ఇ’ విటమిన్ ఎక్కువ భాగం కాలేయంలో నిల్వ ఉంటుంది. కొవ్వు కణాలు చెదిరిపోకుండా కాపాడుతుంది. పశువులో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
 
 రక్తం గడ్డకట్టడానికి...
 రక్తం గడ్డకట్టడానికి విటమిన్-కె దోహదపడుతుంది. పశువు పేగుల్లో ఉన్న సూక్ష్మక్రిములు దీనిని తయారు చేస్తాయి. తీపి క్లోవర్ మొక్కలను పశువులకు మేపితే విటమిన్-కె లోపిస్తుంది. ఈ మొక్కల్లో డైకుమెరాల్ అనే విష పదార్థం ఉండడమే దీనికి కారణం. పశువు శరీర నిర్మాణానికి ఈ పదార్థం అవరోధంగా ఉంటుంది. పెద్ద పొట్ట పశువుల్లో రూమెన్‌లోని సూక్ష్మక్రిములు విటమిన్-కెను తయారు చేస్తాయి.
 
 లోపం కన్పించదు కానీ...
 బి-కాంప్లెక్స్ విటమిన్లు 12 రకాలు. సాధారణంగా పశువుల్లో వీటి లోపం కన్పించదు. ఎందుకంటే పశువు శరీరంలో ఉన్న సూక్ష్మక్రిములే వీటిని ఉత్పత్తి చేస్తుంటాయి. పశువుకు మనం అందించే పోషకాల నుంచి శక్తి విడుదల కావాలంటే ఎంజైములు అవసరమవుతాయి. ఆ ఎంజైముల్లో బి-కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ప్రొటీన్ల నుంచి శక్తి విడుదల కావడానికి బి-కాంప్లెక్స్ విటమిన్లు బాగా ఉపయోగపడతాయి. ఏ కారణం చేతనైనా ఇవి లోపిస్తే చర్మ సంబంధమైన వ్యాధులు వస్తాయి. పశువులో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. రక్తంలో గ్లూకోజ్ నిర్వహణ దెబ్బతింటుంది. రక్తహీనత ఏర్పడుతుంది. విటమిన్లలో ఏది లోపిస్తే దానికి సంబంధించిన వ్యాధి లక్షణాలు బయటపడతాయి.
 - డాక్టర్ ఎం.వి.ఎ.ఎన్.సూర్యనారాయణ
 సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి
 పశు పరిశోధనా స్థానం, గరివిడి
 విజయనగరం జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement