హద్దులు మీరిన ఆత్మస్తుతి
విశ్లేషణ
ఈమధ్య ఆంధ్రప్రదేశ్‌లో సత్కారాలూ, సన్మానాలను చేయించుకుంటున్న జంటకవుల యుగళగీతాల ప్రహసనం నడుస్తున్నది. ఆ జంటకవులే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గార్లు. ఆ ‘ఇరువురు’ నాయుళ్లు (తెలుగు రాష్ట్రాల సీఎంలను ఇద్దరు చంద్రులు అంటున్నట్లుగా ప్రస్తావిస్తున్నాను) స్వ‘స్తుతి’ పర‘స్తుతి’, పరస్పర‘స్తుతు’లతో భేష్, శభాష్ అను కోవడంలో మునిగితేలుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఆవశ్యకత గూర్చి ఇంతకుముందు ఈ ఇరువురి వాగాడంబరం, ప్రస్తుతం అదే అంశంపై నరంలేని నాలుకతో ‘అబ్బే, ప్రత్యేకహోదాతో ఒరిగేదేముంది’? అంటూ అర్థసత్యాలు, అసత్యాలు నిరంతరం ప్రచారం చేయటం, పైగా కేంద్రం దానమిచ్చిన ప్యాకేజీయే మంచిదంటూ కొత్త పల్లవిని అందుకోవడం మన రాష్ట్ర ప్రజలు చూస్తున్నదే.
నిజమే! ప్రత్యేక హోదాతో ఏపీకి మేలు జరిగితే, ప్రత్యేక ప్యాకేజీతో ఆ ఇరువురు నేతలకు, వారి బంధు వర్గానికి, మేలు జరుగుతుంది. ఆ ఇద్దరు నాయుళ్ల ప్రాసస హిత, ప్రయాసపూరిత ప్రసంగాలకు వారి అనుచరగణం కరతాళధ్వనులు చేస్తుంటే అత్యవసర పరిస్థితి సమ యంలో ఇందిరాగాంధీని, ఆమె భజన బృందాన్ని గొల్ల న్నగా, గొర్రెల మందగా పోలుస్తూ, ‘తూర్పున సూర్యుణ్ణి తమ గొల్లన్నే మొలిపిస్తాడనుకుంటుంది గొర్రె’ అంటూ కాళోజీ రాసిన ‘గొర్రె’ కవిత గుర్తుకు వస్తోంది.
తమ ప్రతిష్ట నానాటికీ దిగజారుతుండగా తమ ఆత్మన్యూనతా భావాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలా ఆత్మ స్తుతిని ఆశ్రయిస్తారులే అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఆత్మ స్తుతి హద్దులు మీరి అమ్మపుట్టిల్లు మేనమామలకేం తెలుసు అనుకున్నట్లు, అదీ అనంతపురంలో, మన రాష్ట్రాన్ని కరువురహిత రాష్ట్రంగా మార్చానని చెప్పుకునే స్థాయికి చేరితే ఆంధ్ర ప్రజల శ్రేయోభిలాషిగా ఆందోళన పడాల్సివస్తోంది. ఆత్మస్తుతిలోనే కాదు ఈ నాయకు లిరివురూ పరనిందలో పీహెచ్‌డీ పొందినట్లుగా వ్యవహరి స్తున్నారు. అది మరీ ముదిరిన వ్యాధికి నిదర్శనం. వెంక య్యనాయుడు మరికొంత ముందుకెళ్లి ‘కమ్యూనిస్టులను నమ్ముకుంటే కుక్కతోక పట్టి గోదావరి ఈదినట్లే’ అని విమర్శించారు. ఇక శ్రీమాన్ చంద్రబాబుగారైతే ‘అవి ఖాళీ అయిన పార్టీలు, కాలం చెల్లిన పార్టీలు’ అని ఇంతకు ముందే కమ్యూనిస్టులను ఈసడించారు. కమ్యూనిస్టుల త్యాగాల రోజులు పోయాయి. భోగాల నాశించే తరం వచ్చిందని, ప్రపంచమంతా ముందుకుపోయినా కాలాను గుణంగా మారిపోకుండా, పనికిరాని పాతభావజాలాన్ని పట్టుకు వేలాడుతున్నారని మరో విమర్శ.
ప్రపంచం మారడం అటుంచి, మన సామాన్య జీవన ప్రమాణాలలో, సామాజిక జీవనంలో మౌలికమైన అంశాలలో గుణాత్మక మార్పు ఏదీ? సర్వసంపదాశ్రమ జన్యమే. ఆ శ్రమదోపిడీ వల్లనే సమాజంలో కుబేరులూ, కుచేలురూ ఉంటున్నారు. ఆ శ్రమదోపిడీ అంతరిం చిందా? లేదు. పైగా దోపిడీ రూపం మారి, ఆధునిక టెక్నాలజీ, ఆటోమేషన్ వల్ల శ్రమ తగ్గుతున్నట్లనిపించినా కష్టజీవి, కష్టార్జితం ఇంకా ఎక్కువగా దోపిడీకి గురవుతోంది.
ఒక కూలీకి వచ్చే దినసరి వేతనంలో పది నుంచి పాతిక రూపాయలు పెరిగితే, అదేసమయంలో శ్రమదో పిడీ చేసే పెట్టుబడిదారులకు దినసరి లాభాలు లక్షలు దాటి కోట్లలో వస్తున్నాయి. ఇక రైతు ఆత్మహత్యలు, నిరు ద్యోగం, అసంఘటిత కార్మికుల, గిరిజనుల దురవస్థలు చెప్పపనిలేదు. ప్రభుత్వం, పాలకులు మాత్రం స్వదేశీ, విదేశీ గుత్తాధిపతుల ఇనప్పెట్టెలకు సెక్యూరిటీ గార్డుల్లాగా వ్యవహరిస్తున్నారు. తిండి లేక చెంచుల జనాభా సగానికి సగం తగ్గిపోతూ, పోషకాహార లేమితో 70 శాతం పిల్లలు అల్లాడుతుంటే విమాన ప్రయాణాల సంఖ్య పెరిగిందని వెంకయ్యనాయుడు భజాయిస్తున్నారు.
కాంగ్రెస్ హయాంలో అయినా, నేటి బీజేపీ పాల నలో అయినా ఇదే ధనస్వామ్యం కొనసాగుతోంది. 2014 లో కాంగ్రెస్ ఓడిపోయి, బీజేపీ పాలనకొచ్చాక దేశంలో ప్రజాజీవితం పెనంలోనుంచి పొయ్యిలో పడే పరిస్థితి కనబడుతోంది.
ఒక వైపు ధనాడ్యుల దోపిడీతోపాటు మధ్యయుగాల మతతత్వం బలంగా వేళ్లూనుకుంటోంది. ప్రజల మధ్య సామరస్యం, సోదరభావం స్థానే విద్వేషం, శత్రుభావం పెరుగుతోంది. దేశచరిత్రలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో మానవత్వ రహిత పాలనను నగ్నంగా చూస్తున్నాం. ‘ముందు నన్ను చంపండి, తర్వాతే దళితుల జోలికి వెళ్లండి’ అని ప్రధాని నరేంద్రమోదీ నాట కీయ గర్జన చేసిన మర్నాడే గుజరాత్‌లో దళిత ఉద్యమ నేతలిరువురిని హత్యచేసి వారి స్త్రీలపై అత్యాచారం చేశారు. ప్రధాని గాండ్రింపులే హాస్యాస్పదమైపోయాయి. ఆధిపత్య కులాల అహంకారం, ధనస్వామ్య వ్యవస్థ నిరం కుశ ధోరణిని అరికట్టకపోతే మధ్యయుగాలనాటి అంధకా రంలోకి సమాజం దిగజారుతుంది.
మనిషి.. మనిషిగా ఆత్మగౌరవంతో, తన జీవితావసరాలను తీర్చుకుంటూ మనుగడ సాగించగల దిశగా సమాజ గమనంలో తమ వంతు పాత్ర పోషించవలసిన కమ్యూనిస్టులు సమాజం తిరోగమనంలోకి వెళ్లకుండా నిరోధించే ప్రయత్నం చేయ డమే నేటి కర్తవ్యం. ఎన్నికల పొత్తులూ, ఎత్తులూ అనేవి ఇప్పుడు అప్రస్తుతం. దేశ పురోగమనానికి, సామాన్య ప్రజల ఉన్నత జీవితానికి, కమ్యూనిస్టుల పునర్వైభవానికి, సమాజ పురోగమన దిశకు వీలునిచ్చేలా సకల వర్గాల, ప్రజారాశుల ఐక్య సంఘటన నేడు అనివార్య అవసరం.
వ్యాసకర్త మార్క్సిస్టు విమర్శకులు
మొబైల్ :98480 69720
- ఏపీ విఠల్