
పసుపు పార్టీ ‘నల్ల’ న్యాయం
డేట్‌లైన్ హైదరాబాద్
తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యుడు శేఖరరెడ్డి దగ్గర నూట ఇరవై కోట్ల రూపాయల నల్లధనం, వంద కిలోలకు మించి బంగారు కడ్డీలు దొరికాయి. కేసు నమోదైంది. దొరికిన నగదులో చాలావరకు కొత్త నోట్లు. అవి రిజర్వు బ్యాంక్ నుంచి నేరుగా శేఖరరెడ్డి ఇంటికి తరలి వచ్చాయా? అన్న అనుమానం మొదట్లో కలిగినా, విచారణ తరువాత రెండు బ్యాంక్‌ల శాఖల నుంచి ఆ డబ్బు వచ్చిందని వెల్లడైంది. సరే, బ్యాంకుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఆలోచించుకుంటుంది. శేఖరరెడ్డికి ఎలాంటి శిక్ష పడుతుందో భవిష్యత్తులో తెలుస్తుంది. దేశమంతటా ఇటువంటి కొందరు ‘నల్ల’దొరలు ఈ ఐదువారాలలో దొరికారు. వారి వారి సామర్థ్యాన్ని బట్టి డబ్బు కూడా దొరికింది. ఈ మొత్తం కొత్త నోట్లు వాళ్లకు ఎట్లా వస్తున్నాయన్నది ప్రశ్న. కచ్చితంగా ఈ నేరం బ్యాంకు అధికారులదే అనడంలో సందేహం లేదు. శేఖరరెడ్డి బడా కాంట్రాక్టర్. వేల కోట్ల రూపాయలలోనే ఉంటుందట కాంట్రాక్టుల వ్యవహారం.
తమిళనాడులో అధికార పక్షం అన్నా డీఎంకేకి అత్యంత సన్నిహితుడు, దివంగత ముఖ్యమంత్రి జయలలితకూ, ఆమె ప్రియసఖి శశికళకూ, కొత్త ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకూ కూడా శేఖరరెడ్డి అత్యంత సన్నిహితుడనే వార్తలు వచ్చాయి. జయ భవనంలోకి అలవోకగా వెళ్లగల పలుకుబడి కలవాడని సమాచారం. శేఖరరెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించాల్సిందిగా తమిళనాడు అధికారపక్షం నుంచి ఒత్తిడి వచ్చిందని ఆయన నల్లధనం బయటపడిన తరువాత ఆంధ్రప్రదేశ్ అధికారపక్షం వాదించడం ఆరంభించింది. ఎవరో చెబితే ఆయనను బోర్డు సభ్యుడిగా నియమించాల్సి వచ్చిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. టీటీడీ బోర్డులో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఒక్కొక్క సభ్యుడిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సుల మేరకు నియమిస్తారు, కాబట్టి మాకేం సంబంధం? అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పించుకోజూస్తున్నది. సరే, ఆయనను బోర్డు నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఇంతటితో చంద్రబాబు బాధ్యత తీరినట్టేనా? శేఖరరెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా తొలగించి చేతులు దులుపుకుంటే సరిపోతుందా?
ఇది బాధ్యతా రాహిత్యం కాదా?
వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్‌ల అధ్యక్షులుగా, బోర్డుల సభ్యులుగా తమ వారిని నియమించుకునే అధికారం ప్రభుత్వ పక్షానికి ఎప్పుడూ ఉంటుంది. అయితే ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రభుత్వ అధినేత ఇటువంటి నియామకాలు చేసేటప్పుడు సదరు అభ్యర్థుల నేపథ్యం గురించి కొంతైనా ఆలోచించకుండా, రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు తీసుకోవడం సాధారణమైపోయింది. ఆర్థికబలం, రాజకీయ పలుకుబడి కలిగినవారే ఎక్కువ భాగం ఈ నామినేటెడ్ పదవులను దక్కించుకుంటూ ఉంటారు. అయితే ధార్మిక కార్యకలాపాలకు సంబంధించిన టీటీడీ బోర్డు వంటి వాటిల్లో నియామకాలనైనా రాజకీయాలకూ, అవినీతికీ దూరంగా ఉంచితే బాగుండేది. అలాంటిదేమీ జరగకపోగా, ‘ఎవరో చెప్పారు నేను నియమించాను!’ అని ముఖ్యమంత్రే చెప్పడం బాధ్యతారాహిత్యం. శేఖరరెడ్డి వంటి వారిని టీటీడీ బోర్డు వంటి సంస్థలలో సభ్యులుగా నియమించేటప్పుడు వారి గత చరిత్ర ఏమిటో చూసుకోవాల్సిన అవసరం లేదని భావించేంతగా చంద్రబాబు మీద ఏ రకమయిన ఒత్తిడి వచ్చిందో ఆయన స్వయంగా ప్రకటిస్తేనే బాగుంటుంది. శేఖరరెడ్డి నేపథ్యం ఎలాంటిదో చంద్రబాబునాయుడుకు తెలియకుండానే ఈ నియామకం జరిగిందంటే మాత్రం ఎవరూ నమ్మరు. ఈ అవినీతి వ్యవహారం బయటపడ్డాక ఆయనను బోర్డు నుంచి తొలగించి చేతులు దులుపుకున్నానని భావిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చిన్నదో పెద్దదో ఇంకో అవినీతి బురద పూసుకున్న తెలంగాణ టీడీపీ శాసనసభ్యుడు వెంకటవీరయ్యను అదే టీటీడీ బోర్డులో సభ్యుడిగా ఎందుకు కొనసాగిస్తున్నట్టు?
సండ్రను ఎందుకు ఉపేక్షిస్తున్నట్టు?
తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికలలో ఒక శాసనసభ్యుడిని డబ్బుతో కొనేందుకు ప్రయత్నించిన కేసులో మరో శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి సహ నిందితుడు సండ్ర వెంకటవీరయ్య. ఆ కేసులో ఆయన కూడా కొద్దిరోజులు జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకొచ్చారు. మరి శేఖరరెడ్డిని బోర్డు నుంచి తొలగించిన తెలుగుదేశం ప్రభుత్వం వెంకటవీరయ్యను ఎందుకు ఉపేక్షిస్తున్నట్టు? రెండు రోజులక్రితం ఢిల్లీలో ఓటుకు కోట్లు కేసు విషయంలో విలే కరులు అడిగిన ప్రశ్నకు ఇందులో మాట్లాడటానికి ఏముందని చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో ఏమీలేదని చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అక్కడి అధికార పక్షం వారి వారి కారణాల వల్ల భావించుకోవచ్చు కానీ, జరిగిన బాగోతం అంతా చరిత్రలో రికార్డు అయ్యే ఉంది. బహుశా అందులో ఏమీ లేదనుకున్నారు కాబట్టే వెంకటవీరయ్యను టీటీడీ బోర్డు నుంచి తొలగించకుండా ఉంచేసుకున్నట్టున్నారు చంద్రబాబు. బహుశా తన ప్రోద్బలం మీదనే ఓటుకు కోట్లు వ్యవహారం నడిచింది కాబట్టి వెంకటవీరయ్య విషయంలో చూసీచూడనట్టు ఉండిపోయారేమో! ఇటువంటి వారా దేవుడి వ్యవహారాలు చక్కబెట్టేది అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
విపక్షనేతను లాగడం ఎందుకు?
‘తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు’ అన్న రీతిలో నడుస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడానికి కొద్దిమాసాల ముందు స్వచ్ఛందంగా సంపద ప్రకటించే ఒక పథకాన్ని తెచ్చింది. ఆ పథకం కింద ఆదాయాన్ని ప్రకటించే వారి పేర్లు గోప్యంగా ఉంటాయి. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి ఒకరు రూ. 10 వేల కోట్లు ప్రకటించినట్టు వార్తలు వెలువడ్డాయి. వెంటనే చంద్రబాబునాయుడు విలేకరులను సమావేశపరచి, ఆ 10 వేల కోట్ల రూపాయల ప్రకటన వెనుక ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారన్నట్టు ధ్వనించే రీతిలో మాట్లాడారు. ఆయన మాటల నుంచి స్ఫూర్తి పొందిన ఆయన మంత్రివర్గ సభ్యుడొకరు పేరుతో సహా ప్రతిపక్ష నాయకుడి మీద ఆరోపణ చేశారు. ఈ వ్యవహారం మొన్న బయటపడింది. ఆ వ్యక్తి పేరు లక్ష్మణరావు. ఆ లక్ష్మణరావు ఇంటి మీద ఆదాయ పన్ను శాఖ దాడులు చేస్తే ఆయనకు అంత సీన్ లేదనీ, అదంతా బోగస్ అనీ తేలింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, మంత్రుల స్థాయి వ్యక్తులూ ఇట్లా నిరాధారమైన ప్రకటనలు చేస్తుంటే ప్రజలు ఏమనుకుంటారు? ఇక ఇంకో అధికార పక్ష నేత, మంత్రి ఇంకో అడుగు ముందుకు వేసి ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలోని బంకర్‌లలో వేల కోట్లు దాచి ఉంచారని బాధ్యతారహితంగా మాట్లాడతారు. అధికారంలో ఉన్నదెవరు? చంద్రబాబు సీఎం కాదా? ఆయన పార్టీ అధికారంలో లేదా? నిజంగానే ఇడుపులపాయలో వేల కోట్లు దాచి ఉంటే మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అధికారికంగానే దాడి చేసి వాటిని బయటపెట్టి ఉండొచ్చు కదా! శేఖరరెడ్డి, సండ్ర వెంకటవీరయ్యల విషయంలో వ్యవహరించిన తీరు చూసినా, లక్ష్మణరావు విషయంలో నోళ్ళు జారిన విషయమైనా, ఇడుపులపాయ బంకర్‌ల గురించి అవాకులూ చవాకులూ పేలినా అందరికీ అర్థమవుతున్నది ఒక్కటే– అధికార పక్షం అయోమయంలో పడి దిక్కుతోచని మాటలు మాట్లాడుతున్నది.
వాళ్ల మైండ్‌సెట్ మారాల్సిందే...
మొన్న ఢిల్లీలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, ‘నా ప్రభుత్వమంతా నా కంప్యూటర్‌లోనే ఉంది, నేను దేన్నయినా మేనేజ్ చెయ్యగలను’ అన్నారు. ఆయన దేన్నయినా మేనేజ్ చెయ్యగలరేమో కొంతకాలం. కానీ, ప్రభుత్వం ఆయన కంప్యూటర్‌లో ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇవ్వాళ ఇట్లా ఉండేది కాదేమో! ఆ కంప్యూటర్ నుంచి కాస్త దృష్టి మళ్లించి చూస్తే వాస్తవ పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాదు, ప్రజల మైండ్‌సెట్ మారాలని తనకు చాలా ఇష్టమైన పాత డైలాగ్‌నే తిరిగి చెప్పారాయన. నిజమే, తాను మోదీకి లేఖ రాసి పెద్ద నోట్లు రద్దు చేయిస్తే దాని ఫలితంగా బ్యాంకుల ముందు బారులు తీరి, రోజుల తరబడి గడుపుతూ తమకు వచ్చిన కష్టానికి బాధ్యులు ఎవరా అని ఆలోచిస్తున్న ప్రజల మైండ్‌సెట్ మారాల్సిందే.
- దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com