ఈ ఘోరకలికి బాధ్యులెవరు?
‘దేవతల సొంత గడ్డ’గా పేరున్న కేరళలో మానవ తప్పిదం ఘోర విపత్తుకు దారి తీసింది. వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. కొల్లాంలో ఉన్న పుట్టింగల్ ఆలయంలో జరిగే కాళికా దేవి ఉత్సవాల్లో ఆదివారం నిర్వహించిన బాణసంచా వేడుక వికటించి 109మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 383మంది తీవ్రగాయాలతో ఆసుపత్రులపాలయ్యారు. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చుట్టుపక్కలున్న అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. బాణసంచా కాల్చే ప్రాంతానికి సమీపంలో ఉన్నవారు మాత్రమే కాదు...ఎక్కడో దూరంనుంచి ఆసక్తిగా గమనిస్తున్నవారిపై సైతం పెద్ద పెద్ద సిమెంటు దిమ్మలు వచ్చిపడి ప్రాణాలు తీశాయి.
పుట్టింగల్ ఆలయానికి వందేళ్ల చరిత్ర ఉంది. ఏటా మార్చి/ఏప్రిల్ నెలల్లో వచ్చే మీనా భరిణి వేడుకల కోసం వేలాదిమంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. కేరళ ప్రార్థనాలయాల్లో ఉత్సవాలకు బాణసంచా పోటీలు నిర్వహించడం, బహుమతులివ్వడం సంప్రదాయంగా వస్తోంది. వీటిని వీక్షించడానికి వేలాదిమంది గుమిగూడతారు. ఇలాంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, ఎంత మెలకువతో వ్యవహరించాలో ఎవరూ చెప్పనవసరం లేదు. కానీ ఆ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నదని రుజువవుతూ వస్తోంది. నాలుగేళ్లక్రితం ఈ పోటీలు శ్రుతిమించడం, ప్రాణాలకు ముప్పుగా పరిణమించడం గమనించి పంకజాక్షమ్మ అనే ఎనభైయ్యేళ్ల వృద్ధురాలు అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచీ చేస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.
ఈసారి కూడా ఆమె జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం, కలెక్టర్ కింది అధికారులనుంచి నివేదిక తెప్పించుకోవడం పూర్తయింది. దాని ఆధారంగా బాణసంచా పోటీలపై మూడురోజుల క్రితమే నిషేధం విధించామని కలెక్టర్ చెబుతుంటే పోటీలు ప్రారంభం కావడానికి ముందు దాన్ని ఎత్తేశారని నిర్వాహకులు అంటున్నారు. ఇందులో ఎవరు బుకాయిస్తున్నారో న్యాయ విచారణలో తేలుతుంది. అయితే నిషేధం విధించడంతోనే ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత పూర్తయినట్టేనా? అది ఎలా అమలు జరుగుతున్నదో, దానికి ఏర్పడుతున్న అడ్డంకులేమిటో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? పోటీలు జరిగే ప్రాంతానికి చాలా ముందుగానే టన్నులకొద్దీ బాణసంచా వచ్చి చేరింది. అలాగే ఎప్పటిలా భారీయెత్తున పోటీలు జరగబోతున్నాయంటూ కరపత్రాలు కూడా పంచారు.
ఇంత బహిరంగంగా అన్నీ జరుగుతున్నప్పుడు, తమ విధినిషేధాలు అపహాస్యం పాలవుతున్నప్పుడు ప్రభుత్వాధికారులు చేయాల్సిన పనేమిటి? బాణసంచా నిల్వలను స్వాధీనం చేసుకోవడం... అందుకెవరైనా అవరోధాలు కల్పిస్తే అరెస్టు చేయడం. కానీ కొల్లాంలో అలాంటి చర్యల జాడ లేదు. సంప్రదాయంగా వస్తున్న పోటీలపై పట్టుదలకు పోతే జనం ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందనుకున్నారో, ఎన్నికల సమయంలో ఇలాంటి తలనొప్పులు ఎందుకునుకున్నారో...మొత్తానికి అధికార యంత్రాంగం అక్కడ కళ్లుమూసుకుంది.
ఇది ఒక్క కేరళకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. బాణసంచా తయారీ పరిశ్రమల విషయంలోగానీ, ఆ బాణసంచా ఉపయోగించేటపుడు పాటించాల్సిన నిబంధనల విషయంలోగానీ దాదాపు అన్ని ప్రభుత్వాలదీ ఒకటే కథ. అందువల్లే ఏడాదికో, రెండేళ్లకో దేశంలో ఏదో ఒక మూల ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. బాణసంచా, టపాసుల తయారీ అన్నా, వాటి వినియోగమన్నా నిప్పుతో చెలగాటం లాంటిది. అందుకు ఎన్నో నియంత్రణలు, జాగ్రత్తలు అవసరమవుతాయి. తగిన నైపుణ్యమూ, అనుభవమూ లేనివారు వీటి జోలికొస్తే పెను ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది.
బాణసంచా కాల్చేటపుడు ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలో ఏకరువుపెట్టే ఎన్నో నిబంధనలున్నాయి. అగ్నిమాపక విభాగంనుంచి, పోలీసు శాఖనుంచి, కాలుష్య నియంత్రణ బోర్డునుంచి నిర్వాహకులు ముందస్తు అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. విశాలమైన బహిరంగ ప్రదేశంలో మాత్రమే బాణసంచా, పటాసులు కాల్చాల్సి ఉంటుంది. అలా కాల్చేవారికి కనీసం వంద మీటర్ల దరిదాపుల్లో ఎవరూ ఉండకూడదు. దగ్గర్లో ఆసుపత్రులు, పాఠశాలలు, జనావాసాలు ఉండరాదని కూడా నిబంధనలంటున్నాయి. టపాసుల నిల్వ ఉంచే ప్రదేశం అక్కడికి దూరంగా ఉండాలని ఆ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అంతేకాదు...‘మీరు వినియోగించే టపాసుల ధ్వని ఇన్ని డెసిబుల్స్ లోపు ఉండాలనీ...ఇంత పరిమాణానికి మించి కాల్చకూడదనీ కూడా ఆ నిబంధనలు చెబుతాయి. కేరళ లోని దేవాలయాలన్నిటికీ ఏటా పోలీసులు తాఖీదులు పంపి నిబంధనలు గుర్తు చేస్తుంటారు. ఆలయాల నిర్వాహకులు వాటిని యథాప్రకారం బుట్టదాఖలా చేస్తారు. ఏదో జరగరాని ఘోరం జరిగినప్పుడు మాత్రమే ఇందులోని డొల్లతనమంతా బయటపడుతుంది.
బాణసంచా తయారీ పరిశ్రమల విషయంలోనూ ప్రభుత్వాలు కళ్లు మూసుకుంటున్నాయి. ఫైర్‌సేఫ్టీ నిబంధనల్ని గాలికొదిలేస్తున్నా అధికార యంత్రాంగానికి పట్టడంలేదు. బాణసంచా తయారీ పరిశ్రమల్లో మంటలు ఆర్పే పరికరాలు, నీరు అందుబాటులో ఉండాలని నిబంధనలంటున్నాయి. ప్రమాదాలు సంభవించినపక్షంలో తీసుకోవాల్సిన ప్రాథమిక వైద్య చర్యలు, అందుకవసరమైన సదుపాయాల గురించి కూడా ఆ నిబంధనల్లో పొందుపరిచారు. ముఖ్యంగా పిల్లలను బాణసంచా తయారీ పనుల్లోకి తీసుకోకూడదు. ఇవి ఏమేరకు అమలవుతున్నాయో ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీ చేస్తుండాలి. కానీ అన్నీ మొక్కుబడిగానే సాగుతున్నాయని పలు సంఘాలు పదే పదే ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు కొల్లాం ఘటనలో పోలీసులు వెంటనే కదిలి అయిదుగురు కాంట్రాక్టర్లనూ, ఆలయ నిర్వాహకులు కొందరినీ అరెస్టు చేశారు. మరికొందరు ఘటన జరిగిందని తెలిసిన వెంటనే అజ్ఞాతంలోకి పోయారు.
పోలీసులు ఈ చురుకుదనాన్ని ముందు ప్రదర్శించి ఉంటే ఇంత ఘోరకలి జరిగేది కాదు. ప్రజల మనోభావాలు దెబ్బతింటాయన్న పేరిట కొన్ని సంప్రదాయాల విషయంలో చూసీచూడనట్టు పోవడం మన దేశంలో ప్రభుత్వాలకు అలవాటైంది. ప్రమాదాలు ఇమిడి ఉన్న అంశాల్లో ప్రజలకు నచ్చజెప్పి ఒప్పించడం పెద్ద కష్టమేమీ కాదు. అసలలాంటి ప్రయత్నం చేయడానికి కూడా అధికార గణం ముందుకు రాకపోవడమే పెద్ద విషాదం. ఇప్పుడు జరిగిన దుస్సంఘటనైనా పాలకుల కళ్లు తెరిపిస్తుందని ఆశించాలి.