
సంక్షోభంలో సైబర్ ప్రపంచం
సజావుగా, చురుగ్గా సాగిపోయే సైబర్ ప్రపంచం దుండగుల చేజిక్కితే ఎలా అట్టు డుకుతుందో, ఎంతటి నష్టం వాటిల్లుతుందో అందరికీ అర్ధమైంది.
సజావుగా, చురుగ్గా సాగిపోయే సైబర్ ప్రపంచం దుండగుల చేజిక్కితే ఎలా అట్టు డుకుతుందో, ఎంతటి నష్టం వాటిల్లుతుందో అందరికీ అర్ధమైంది. ఆ దుండగు లెవరో, వారు ఈ భూగోళంపై ఏమూలనున్నారో 48 గంటలుదాటినా వెల్లడి కాలేదుగానీ... ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లోని లక్షలాది కంప్యూటర్లు మాత్రం హ్యాక్ అయ్యాయి. వాటిల్లోని విలువైన సమాచారాన్ని దుండగులు గుప్పిట బంధిం చారు. వెనక్కి ఇవ్వాలంటే 300 డాలర్ల చొప్పున చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్నిబిట్ కాయిన్ల రూపంలో తమకు చేర్చాలంటూ చిరునామాలు కూడా ఇచ్చారు. వారడిగినట్టే ఇప్పటికి దాదాపు 50,000 డాలర్లమేర చెల్లింపులు కూడా అయ్యాయని చెబుతున్నారు. ఈ సంక్షోభం పర్యవసానాలు సామాన్యంగా లేవు. ప్రపంచ దేశాల్లో అనేకచోట్ల మౌలిక సదుపాయాలన్నీ మూలనబడ్డాయి.
బ్రిటన్‌లో జాతీయ ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. వివిధ రకాల వ్యాధులకు చికిత్స పొందుతున్నవారికీ, ఇప్పటికే శస్త్రచికిత్సలు పూర్తి చేసుకున్నవారికీ ఏం మందులివ్వాలో, ఎలాంటి సలహాలివ్వాలో తెలియక వైద్యులు తలలు పట్టుకున్నారు. ఆస్పత్రుల్లో ఉన్నవారి పరిస్థితి ఇదైతే కొత్తగా వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడం అసాధ్యమన్న నిర్ణయానికి వచ్చి తిప్పి పంపేశారు. జర్మనీలో రైల్వే వ్యవస్థ, వైమానిక వ్యవస్థ దెబ్బతిన్నాయి. మన దేశంతోపాటు అమెరికా, జపాన్, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా, స్వీడన్, చైనా, ఈజిప్టు తదితర దేశాల్లో అనేకానేక సమస్యలు తలెత్తాయి. ఐటీ, టెలికమ్యూనికేషన్లు, విద్యుత్, గ్యాస్ తదితర రంగాలు అస్తవ్యస్థమయ్యాయి. కంప్యూటర్ ఆన్ చేయగానే ఫైళ్లకు బదులు హెచ్చరిక కనబడేసరికి అందరూ అయోమయంలో పడ్డారు. ఆంధ్రప్రదే శ్‌లో చాలా పోలీస్‌స్టేషన్లలోని కంప్యూటర్లు స్తంభించాయి. బ్రిటన్‌లోని 22 ఏళ్ల సాఫ్ట్ వేర్ నిపుణుడొకరు యాదృచ్ఛికంగా అడ్డుకోనట్టయితే ‘వనా క్రై’ స్వైర విహారం మరింత నష్టం చేకూర్చేది.
కంప్యూటర్లను హ్యాక్ చేయడం ఇది మొదటిసారేమీ కాదు. దాదాపు 1989 మొదలుకొని ఈ దాడులు అడపా దడపా ప్రపంచంలో ఏదో మూల జరుగుతూనే ఉన్నాయి. తొలినాళ్లలో ఫ్లాపీ డిస్కుల ద్వారా మాల్‌వేర్‌ను జొప్పించడంతో మొదలై ఇప్పుడు ఈ–మెయిళ్ల వరకూ చేరుకుంది. ఏదో ఒక పేరు చెప్పి కొన్ని లింకులు ఇవ్వడం, వాటిని క్లిక్ చేయగానే ప్రమాదకరమైన వైరస్ చొరబడే ఏర్పాటు చేయడం సర్వసాధారణమైంది. స్మార్ట్ ఫోన్లు సైతం ఈ వైరస్‌ల బారిన పడి పనికిరాకుండా పోతున్నాయి.
ఇప్పుడు ‘వనా క్రై’ లేదా ‘వనా డిక్రప్టర్’ పేరిట ప్రపంచాన్ని వణికి స్తున్న ర్యాన్‌సమ్ వేర్ కంప్యూటర్‌లలో ఉండే మొత్తం సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి నిరుపయోగంగా మారుస్తోంది. ఏళ్ల తరబడి శ్రమకోర్చి ఫొటోలు, వీడియోలు, ఇతర రూపాల్లో సేకరించి పెట్టుకున్న విలువైన సమాచారం కావొచ్చు... సంస్థలు నిర్మించుకున్న వ్యవస్థలు కావొచ్చు ఒక్క దెబ్బతో నిరుపయోగంగా మారడం దిగ్భ్రాంతికలిగిస్తుంది. వ్యక్తుల బ్యాంక్ ఖాతాలు, ఇతర వ్యక్తిగత అంశాలు దుండ గుల పాలబడితే ఎటువంటి పర్యవసానాలు సంభవించవచ్చునో ఊహకందదు. భవిష్యత్తులో ఉగ్రవాదులు ఈ విద్యలో నిష్ణాతులైతే జరిగే ముప్పు అంతా ఇంతా కాదు.
మన దేశంలో ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో అక్కడక్కడ ఈ మాల్ వైరస్ ప్రభావం కనబడినా మొత్తం మీద అంతా సజావుగా ఉన్నదని కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెబుతున్నారు. వచ్చే నెల నుంచి సైబర్ సమన్వయ కేంద్రం ప్రారంభం కాబోతున్నది గనుక ఇక భయంలేదంటున్నారు. కానీ సైబర్ ప్రపంచం ఎలా చూసినా సురక్షితం కాదు. ఏ ఏ దేశాల్లో ఎలాంటి రక్షణ వ్యవస్థలున్నాయో చూసి, వాటిని అధిగమించడమెలాగో లెక్కలేసుకుని ర్యాన్‌సమ్‌వేర్‌ను కనిపెట్టడం దుండగులకు నిత్యకృత్యం. అసలు ఈ వైరస్‌లను ఎవరో గుర్తు తెలియని దుండగులు మాత్రమే ప్రపంచం మీదకు వదులుతారని అనుకోవడం కూడా అమాయకత్వం. సాక్షాత్తూ అమెరికా, రష్యాలాంటి దేశాలే ఈ దుర్మార్గానికి ఒడిగడుతున్నాయి. భవిష్యత్తులో దుండగుల నుంచి ఎలాంటి ముప్పు ఎదు రుకానున్నదో అంచనా వేయడానికి, వాటిని అధిగమించాలంటే ఏంచేయాలో తెలుసుకోవడానికి ఈ వైరస్‌ల రూపకల్పన అవసరమని అవి చెబుతున్నాయి.
ప్రస్తుత ర్యాన్‌సమ్‌వేర్ సైతం అమెరికా జాతీయ భద్రతా సంస్థ(ఎన్‌ఎస్‌ఏ) సృష్టే. ఈ వైరస్‌ను ఎవరో తస్కరించారని ఎన్‌ఎస్‌ఏ చెబుతున్నదాంట్లో నిజమెంతో ఎవరికీ తెలియదు. నష్టం మొదలయ్యాక తస్కరించారని చెప్పడానికి బదులు ముందే అప్రమత్తం ఎందుకు చేయలేదో అర్ధంకాదు. గతంలో ఇరాన్ అణు కార్యక్రమానికి అవరోధం సృష్టించడానికి వారి కంప్యూటర్ పోగ్రాంలను తారుమారు చేయడం మొదలుకొని అందులో పాలుపంచుకుంటున్న శాస్త్రవేత్తలను హతమార్చడం వరకూ అమెరికా అనేక రకాలైన ఎత్తుగడలను అమలు చేసింది. మొన్నటికి మొన్న ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం విఫలం కావడంలోనూ దాని పాత్ర ఉన్నదని వార్తలొచ్చాయి. కనుక అమెరికా సంజాయిషీని సంపూర్ణంగా విశ్వసించలేం.
సైబర్ ప్రపంచం రూపకల్పన జరిగిపోయి మూడు దశాబ్దాలు గడిచిపోయింది. అది ఏ ప్రాతిపదికన పనిచేయాలో, దాన్ని కావాలని లేదా యాదృ చ్ఛికంగా ఉల్లంఘించిన దేశాలు, సంస్థలు ఎలాంటి శిక్షకు పాత్రులు కావాలో నిర్దేశించే అంతర్జాతీయ చట్టాలు లేవు. ఆ నిబంధనలే ఉంటే ప్రపంచ దేశాలకు ప్రస్తుతం జరిగిన నష్టానికి అమెరికా కోట్లాది డాలర్ల పరిహారం చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు తలెత్తిన ఈ పరిస్థితులు చూశాకైనా తగిన నిబంధనల రూపకల్పన అవసరమని అన్ని దేశాలూ గుర్తించాలి. సర్వం ఆన్‌లైన్ చేసేయాలని తహతహ లాడుతున్న ప్రభుత్వాలు తమ ఆలోచనను పునస్సమీక్షించుకోవాలి. భద్రతలేని ప్రపంచంలో పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ఉంచి దాన్ని గాల్లో దీపంగా మార్చడం, వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టడం ఎంతవరకూ శ్రేయస్కరమో ఆలోచించాలి.