పాలకుల పాపం, ఓయూకు శాపం | G.Kishan reddy writes on Osmania university centenary | Sakshi
Sakshi News home page

పాలకుల పాపం, ఓయూకు శాపం

Published Sat, Mar 11 2017 1:31 AM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

పాలకుల పాపం, ఓయూకు శాపం

పాలకుల పాపం, ఓయూకు శాపం

సందర్భం
శత వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ ఆలస్యంగా మేల్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ తూతూ మంత్రంగా వేడుకలకు ఏర్పాట్లు చేయిస్తున్నారు. శతాబ్ది వేడుకలంటే భవంతులకు సున్నాలు కొట్టి, లైటింగ్‌ ఏర్పాటు చేస్తే చాలునని ఈ ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తుంది.

దేశంలోనే ఒకనాడు అత్యుత్తమ విశ్వవిద్యా లయం. అసంఖ్యాక విద్యా కుసుమాలు విర బూసిన క్షేత్రం. ప్రధానమంత్రి సహా, ఎందరో మేధావులను అందించిన చైతన్య నిలయం. ఉద్యమాలకు పురిటిగడ్డ. స్వాతంత్య్రోద్యమ కాలంలో నిజాంను ఎదిరించి వందేమాతరం నినాదంతో ప్రతిధ్వనించిన ప్రదేశం. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు. మలి దశ ఉద్యమానికి ఆలవాలం. ఇదంతా ఉస్మానియా విశ్వవిద్యాలయం గత వైభవం. శతాబ్ది ఉత్సవా లకు సిద్ధమవుతున్న ఈ మహా విద్యా కేంద్రం దుస్థితిని గమనిస్తే మాత్రం దుఃఖం కలుగుతుంది. ఇందుకు ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఎంత కారణమో, ప్రత్యేక రాష్ట్రం తరువాత గద్దెనెక్కిన ‘మన పాలకులు’ కూడా అంతే కారణం.

తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఉస్మానియాయే కేంద్ర స్థానం. విద్యార్థుల పోరాటం, అసమాన త్యాగం, లాఠీ దెబ్బలకు వెరవని ధీరత్వం, తుపాకీ గుళ్లకు సైతం చెదరని గుండె ధైర్యం కారణంగా తెలం గాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. అందుకే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఈ విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం వస్తుందని అంతా ఆశించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఆశల మీద నీళ్లు చల్లింది. అసలు విద్యా రంగాన్నే నిర్లక్ష్యం చేసింది. అన్ని విద్యాలయా లతో పాటు చరిత్రాత్మకమైన ఉస్మానియాను కూడా భ్రష్టు పట్టించింది. శత వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ ఆలస్యంగా మేల్కొన్న ముఖ్య మంత్రి కేసీఆర్‌ తూతూ మంత్రంగా వేడుకలకు ఏర్పాట్లు చేయిస్తు న్నారు. శతాబ్ది వేడుకలంటే భవంతులకు సున్నాలు కొట్టి, లైటింగ్‌ ఏర్పాటు చేస్తే చాలునని ఈ ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తుంది.

ఇక విశ్వవిద్యాలయం దుస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఓయూ న్యాక్‌ గుర్తింపును సాధించడంలో విఫలమైంది. దీనితో యూజీసీ నుంచి రావలసిన నిధులు ఆగిపోయాయి. మూడేళ్ల వరకు ఈ గుర్తింపు పునరుద్ధరణకు నోచుకోకపోవడం అంటే పడిపో తున్న ప్రమాణాలకు నిదర్శనమే. అయినా దిద్దుబాటు చర్యలు తీసుకో వాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోయింది. విశ్వవిద్యాలయాన్ని పర్యవేక్షించే వైస్‌చాన్స్‌లర్‌ను నియమించకుండా రెండేళ్లు గడపడం ఈ ధోరణికి పరాకాష్ట.  

రెండేళ్ల తరువాత వీసీని నియమించినా, ఆ ప్రక్రియను కూడా సక్రమంగా చేపట్టలేకపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. వీసీల నియామ కంలో యూజీసీ నిబంధనలను అతిక్రమించినందుకు హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకుంది. ఓయూ వీసీ సహా ఎనిమిది మంది వీసీల పరిస్థితి ఇప్పుడు డోలాయమానంగా ఉంది. విశ్వవిద్యాలయా లకు గవర్నర్‌ చాన్స్‌లర్‌గా ఉండడం సంప్రదాయం. రాష్ట్ర ప్రభుత్వం దీనిని కూడా తుంగలో తొక్కి తమకు అనుకూలురైన బయటి వ్యక్తులను చాన్‌ం్సలర్లుగా నియమించేందుకు జీవో జారీ చేసింది. ఈ విషయం లోనూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అయినా పద్ధతి మార్చుకోకుండా సుప్రీంకెళ్తే అక్కడా చుక్కెదురైంది. ఓయూకు గత 5 సంవత్సరాల నుంచీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ లేదు.
గత 26 ఏళ్లలో ఓయూలో రెండుసార్లు మాత్రమే నియామకాలు చేపట్టారు. 1990 తర్వాత 17 ఏళ్లకు 2007లో తొలిసారి రిక్రూట్‌ మెంట్‌లు చేపట్టారు.

అనంతరం 2013లో మరోసారి జరిగింది. రిటై ర్మెంట్లు మాత్రం యథావిధిగా ఉన్నాయి. గత రెండున్నర సంవత్సరా లుగా 125 మందికి పైగా ప్రొఫెసర్లు రిటైరయ్యారు. ఇతర రాష్ట్రాల్లో యూనివర్సిటీల టీచింగ్‌ ఫ్యాకల్టీ రిటైర్మెంట్‌ వయస్సు 65 సంవత్స రాలు.æ తెలంగాణలో మాత్రం 60 సంవత్సరాలే. దీంతో  మొత్తం 60 డిపార్ట్‌మెంట్లుంటే 56 డిపార్ట్‌మెంట్లలో సరిపోయినంత బోధనా సిబ్బంది లేదు. 8 డిపార్ట్‌మెంట్లలో బోధనా సిబ్బంది ఒక్కరు కూడా లేరు. ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, తమిళ్, థియేటర్‌ ఆర్ట్స్, బోటనీ, హోమ్‌ సైన్స్, ఆర్‌సీయూ అండ్‌ ఈఎస్‌ లాంటి డిపార్ట్‌మెంట్లు మూతపడినట్టే. 42 డిపార్ట్‌మెంట్లలో అసోసియేట్‌ ప్రొఫెసర్లే హెచ్‌ఓడీలు. ఇంజనీ రింగ్‌లో ఈసీఈ, బయో మెడికల్‌ ఇంజనీరింగ్, జియో ఫిజిక్స్, మైక్రో బయాలజీ లాంటి కీలకమైన విభాగాల్లోనూ ప్రొఫెసర్లు లేరు.

ఉస్మానియాలో ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 1,264 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం 560 మందే ఉన్నారు. 704 పోస్టులు ఖాళీ. 290 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్‌ టీచింగ్‌ స్టాఫ్‌ 10 శాతం మించరాదు. అయినా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో మొత్తం 1,524 పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారిలో 1,300 మందికి పైగా కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు.

ప్రొఫెసర్లు లేకపోవడంతో యూనివర్సిటీలో పరిశోధనలూ అటకె క్కాయి. పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం 2013లోనే ఇవ్వాల్సిన నోటిఫికేషన్‌ను 2014లో ప్రకటించి, 2015లో ప్రవేశ పరీక్ష నిర్వహించి, 2017లో ఇంట ర్వూ్యలు నిర్వహిస్తూ ఓయూలో పరిశోధనలంటేనే విద్యార్థులు విసుగెత్తే పరిస్థితి తెచ్చారు. విద్యార్థులకు సదుపాయాలు, మౌలిక వసతులూ అంతంత మాత్రమే ఉన్నాయి. ఆర్ట్స్‌ కాలేజీ నిర్వహణను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. బిల్డింగ్‌ కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు. వర్షం వస్తే చాలా గదుల్లో నీళ్లు కారే పరిస్థితి. ఆర్ట్స్‌ కాలేజీ ఇలా ఉంటే ఇతర భవనాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకోవడం కష్టమేమీ కాదు. హాస్టల్లో ఉండే విద్యార్థులకు రేకుల షెడ్డులే గతి. పూర్తి స్థాయి మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో విద్యార్థులు చెంబులు పట్టు కుని బహిర్భూమికి వెళ్తున్నారు. స్నానాలు బయటే చేయాల్సిన దుస్థితి.

సరైన బోధనా సిబ్బంది లేకుండా అత్యున్నత విద్యా ప్రమాణాలు ఎలా ఆశించగలం? ఇటీవల నిర్వహించిన కొన్ని సర్వే ఫలితాల్లో విస్తు పోయే విషయాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో ప్రొఫెషనల్‌ కోర్సు పూర్తి చేసిన వారిలో 70 శాతం పైగా అభ్యర్థులకు ఉద్యోగ సామర్థ్యం లేదని స్పష్టమైంది. పటిష్టమైన వ్యవస్థ, జవాబుదారీతనం గలిగిన సమర్థవంతమైన పాలనా సామర్థ్యం, మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య లేకుండా విద్యార్థుల సామర్థ్యం ఎలా పెంపొందుతుంది? వృత్తి ఉద్యోగాల్లో ఎలా రాణించగలరు?


- జి. కిషన్‌ రెడ్డి

వ్యాసకర్త ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నాయకులు, తెలంగాణ ‘  మొబైల్‌ : 99490 99997

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement