ఎవరేమన్నా, ఎన్ని ఆంక్షలు విధించినా రాజకీయ పక్షాల తీరుతెన్నులు మార బోవని తమిళనాడు అన్నా డీఎంకే, డీఎంకేలు పోటీపడి ఇస్తున్న హామీలు రుజువు చేస్తున్నాయి. గత నెలలో డీఎంకే విడుదల చేసిన మేనిఫెస్టోలో వాగ్దానాలు వరదై పారాయి. పేద కుటుంబాల విద్యార్థులకు విద్యా రుణాల మాఫీ...సబ్సిడీ ధరకు సెల్‌ఫోన్‌లు...10జీబీ డౌన్‌లోడ్‌కు వీలయ్యేలా 3జీ/4జీ కనెక్షన్‌తో ల్యాప్‌టాప్‌లు లేదా టాబ్లెట్లు ఇస్తామని ఆ మేనిఫెస్టో ఏకరువు పెట్టింది. బక్క రైతుల రుణాల రద్దు, సుప్రీంకోర్టు నిషేధించిన జల్లికట్టు పునరుద్ధరణ, సంపూర్ణ మద్య నిషేధం, కూదంకుళం ఆందోళనకారులపై కేసుల ఎత్తివేత వంటివి కూడా అందులో ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే మేనిఫెస్టో దీన్ని తలదన్నింది.
డీఎంకే సబ్సిడీతో సెల్‌ఫోన్‌లు ఇస్తామని చెబితే... అన్నాడీఎంకే వాటిని ఉచితంగా పంచిపెడతానని ప్రకటించింది. రేషన్‌కార్డు ఉండటమే ఇందుకు అర్హత. ఇంకా రైతు రుణాల మాఫీ, ఇంటర్మీడియెట్ విద్యా ర్థులకు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యంతో ల్యాప్‌టాప్‌లు, పెళ్లి చేసుకునే జంటలకిచ్చే బంగారు మంగళసూత్రాల బరువు ఇప్పుడున్న 4 గ్రాముల నుంచి 8 గ్రాములకు పెంపు, సంక్రాంతి పండుగకు చేనేత వస్త్రాల కొనుగోలు కోసం రూ. 500 విలువ చేసే ఉచిత కూపన్లు వగైరాలన్నీ అందులో ఉన్నాయి.
తమిళనాడు రాజకీయాలు విలక్షణమైనవి. అక్కడ గత 49 ఏళ్లుగా అన్నా డీఎంకే, డీఎంకేల మధ్యే అధికారం చేతులు మారుతోంది. జాతీయ పక్షాలకుగానీ, ఇతర ప్రాంతీయ పార్టీలకుగానీ అక్కడ చోటు లేదు. కక్ష సాధింపు రాజకీయాలు, ప్రత్యర్థులపై కేసులు పెట్టి జైళ్లపాలు చేయడం ఎక్కువ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లపై వరాలు కురిపించడమన్నది ఇటీవలి ధోరణి. 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే దీనికి అంకురార్పణ చేసింది. ఆ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఎలాంటి ‘ఉచిత’ వరాలూ ఇవ్వలేదు. డీఎంకే మాత్రం ఉచితంగా కలర్ టీవీలు, కిలో రూ. 2 బియ్యం వాగ్దానం చేసి అధికారం దక్కించుకుంది. 2011 అసెంబ్లీ ఎన్నికల నాటికి అన్నాడీఎంకేకు జ్ఞానోదయమైంది. లాప్‌టాప్‌లు, మిక్సర్లు, గ్రైండర్లు, ఫ్యాన్‌లు, పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు, కేబుల్ కనెక్షన్లు... అన్నీ ఉచితమే అని ప్రకటించింది. ఒక దశలో ఈ ‘ఉచిత’ పోటీ హద్దులు దాటింది. మేనిఫెస్టోలను కూడా పక్కనబెట్టి వేలంపాటలను తలపిస్తూ రెండు పార్టీలూ వాగ్దానాలు చేశాయి. 60 ఏళ్లున్నవారికి సిటీబస్సుల్లో ఉచిత ప్రయాణాలకు వీలుకల్పిస్తామని డీఎంకే చెప్పగానే...మేం 58 ఏళ్లనుంచే ఆ సౌకర్యం కల్పిస్తామని, అది అన్నిరకాల బస్సులకూ వర్తిస్తుందని అన్నా డీఎంకే వాగ్దానం చేసింది. పేద కుటుంబాలకు నెలకు కిలో ఒక రూపాయి చొప్పున నెలకు 35 కిలోలు ఇస్తామని డీఎంకే అంటే... అందులో 20 కిలోలు ఫ్రీ అని ఆ వెంటనే అన్నాడీఎంకే అందుకుంది.
ఇదంతా గమనించిన ఓ పౌరుడు గుండెలు బాదుకుంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. ఆ కేసులో మూడేళ్లక్రితం సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. ఓటర్లను ప్రలోభపెట్టేలా హామీలు గుప్పించడం స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలకు పాతరేయడమేనని వ్యాఖ్యానించింది. ఈ వేలంవెర్రిని నియంత్రించేలా మార్గదర్శ కాలు రూపొందించమని ఎన్నికల కమిషన్(ఈసీ)ను ఆదేశించింది. దాని పర్యవసా నంగానే 2014 సార్వత్రిక ఎన్నికల ముందు మేనిఫెస్టోలపై ఈసీ కొన్ని నిబంధనలు విధించింది. ప్రతి వాగ్దానానికీ రాజకీయపక్షాలు జవాబుదారీగా ఉండటం, వివరణ నివ్వడం తప్పనిసరిచేసింది. చేసిన వాగ్దానం నెరవేర్చడానికి అవసర మయ్యే ఆర్ధిక వనరులూ, వాటి సమీకరణకు అనుసరించే మార్గాలూ వివరించి తీరాలని ఆంక్షలు విధించింది. అయితే నయవంచకులను అదుపు చేయడం అంత సులభం కాదని 2014 ఎన్నికలు నిరూపించాయి. ఎడాపెడా వాగ్దానాలు చేసి అధికారంలోకొచ్చిన చంద్రబాబు వాటికి ఎలా పాతరేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఈ ఉచిత వేలంవెర్రికి ఈమధ్య స్వ డబ్బా తోడైంది. తమిళనాడులో ప్రతి పథకానికీ ముందు ‘అమ్మ’ తగిలించడం, జయలలిత బొమ్మ పెట్టడం ఆనవాయితీగా మారింది. గతంలో అన్ని పథకాలకూ ఎన్టీఆర్ పేరు తగిలించిన బాబు ఈసారి తమిళనాడును ఆదర్శంగా తీసుకున్నారు. ‘చంద్రన్న సంక్రాంతి కానుక’, ‘చంద్రన్న క్రిస్మస్ కానుక’, ‘వాడవాడలా చంద్రన్న’ అంటూ స్వకాముకతలో కొత్త పుంతలు తొక్కారు. సంక్షేమ రాజ్యంలో ప్రజలకు మేలు చేకూరే పథకాలను ప్రవేశపెట్టడంలో తప్పులేదు. అందులో ఉచితంగా ఇచ్చేవీ ఉండటం నేరం కాదు.
అయితే అలాంటి ‘ఉచిత’ పథకాలు వారి స్వావలంబనకు తోడ్పడాలి. ఆసరాగా నిలవాలి. వారి ఎదుగుదలకు ఉపకరణంగా ఉండాలి. అంతేతప్ప ఆ పేదలను బిచ్చగాళ్లుగా మార్చ కూడదు. ఏ వాగ్దానం వెనకైనా బాధ్యత, విజ్ఞత, విచక్షణ ఉండాలి. అవి లోపిస్తే సంక్షేమం భావన కాస్తా సంతర్పణగా మారుతుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికల్లో అధికారంలోకొచ్చాక అమలు చేసిన ఉచిత విద్యుత్, కిలో రెండు రూపాయల బియ్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుపేద వర్గాలకు గృహ నిర్మాణం, ఆరోగ్యశ్రీ, 108 సేవలు వంటి పథకాలు పేద వర్గాలను ఉద్ధరించేందుకు తోడ్పడ్డాయి. ఉత్పాదకత పెంచ డానికి దోహదపడ్డాయి. అంతక్రితం తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు ప్రపంచీ కరణ విధానాలు అమలు చేసి దేన్నయినా డబ్బు పెట్టి కొనుక్కోవాల్సిందేనంటూ పీడించుకుతిన్న నేపథ్యంలో ఇవి పేద జనం జీవనప్రమాణాలను గణనీయంగా పెంచాయి. అందువల్లే 2009 ఎన్నికల్లో 2.25 లక్షల కోట్ల విలువైన ‘ఆల్ ఫ్రీ’ వాగ్దానాలు చేసిన బాబును తిరస్కరించి... 9 గంటల నిరంతరాయ విద్యుత్ మినహా కొత్తగా ఏ వాగ్దానమూ చేయని వైఎస్‌కే ప్రజలు మళ్లీ పట్టంగట్టారు.
తమిళనాడు పారిశ్రామికంగా ఉన్నత స్థితిలో ఉంది. సర్వీస్ రంగంలోనూ ఆ రాష్ట్రం మెరుగ్గా ఉంది. ఇతర రంగాల్లోనూ ఆదాయం బాగానే ఉంది. వీటితోపాటు పుష్కలంగా అప్పులు చేయడమూ ఉంది. ఇవన్నీ ఉచిత వాగ్దానాల అమలుకు దోహదడుతున్నాయి. గత పదేళ్లలో ఆ రాష్ట్రంలో ఉచిత పథకాలకు రూ. 3.5 లక్షల కోట్లు ఖర్చయ్యాయని అంచనా. అయితే ఏ పథకాలైనా ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించేవిగా, మొత్తంగా సామాజికోన్నతికి దోహదపడేలా ఉండాలి. వారిని బద్ధకస్తులుగా మార్చకూడదు. రాజకీయ పక్షాలు తమ బాధ్యతను గుర్తెరిగేలా చేయడం తక్షణావసరమని ఈ ఉచిత వాగ్దానాల హోరు రుజువు చేస్తోంది.