ఆదివాసీ వీరుల అమరత్వం | Indravelli carnage is a tragic event in the history of the Left parties Revolutionary | Sakshi
Sakshi News home page

ఆదివాసీ వీరుల అమరత్వం

Published Wed, Apr 19 2017 1:31 AM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM

ఆదివాసీ వీరుల అమరత్వం

ఆదివాసీ వీరుల అమరత్వం

36 ఏళ్ల కింద ఏప్రిల్‌ 20, 1981 నాడు జరిగిన ఇంద్రవెల్లి సంఘటన ఇంకా మనని వెంటాడుతున్నది. వామపక్ష విప్లవోద్యమం చరిత్రలో అది ఒక  విషాద ఘట్టం. బ్రిటిష్‌ పాలకుల కర్కశత్వానికి జలియన్‌ వాలాబాగ్‌ ఒక కొండగుర్తు అయితే స్వాతంత్య్రానంతరం ఇంద్రవెల్లి ఘటన అలాంటిదే. సంఖ్యలో కాదు. ఆ రెండు ఘటనల స్వభావంలో సారూప్యత భయపెడుతున్నది. ఇంద్రవెల్లి సంతకు తరలి రావడం గోండులకు అవసరం. వారానికి సరిపడా సరుకులు కొనుక్కోవడం అలవాటు. అక్కడ ఏదో మీటింగ్‌ జరుగుతుందని, ఆ మీటింగులో మాట్లాడేవారి మాటలు కూడా వినవచ్చని అక్కడికి చేరారు. సరుకులు కొనుక్కున్నవాళ్లు అంతా కలసి ఓ చోట పిచ్చాపాటిగా మాట్లాడుతూ కూర్చున్నారు. గూడేల నుండి ఈసారి సంతకు అనుకున్న దానికన్నా ఎక్కువమందే చేరుకోసాగారు. సంతని లూటీ చేస్తారని పుకారు పుట్టించి వాళ్లని అడ్డగించాలనుకున్నారు పోలీసులు. వారి కదలికలను ఏ మాత్రం గుర్తించకుండా పదుగురు కలసి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో చెట్లమీదకెక్కి తుపాకులతో కాల్చారు.

ప్రభుత్వం 13 మంది చనిపోయారన్నది. ఆ ఒక్కరోజే కూలిపోయిన వాళ్లు 60 మంది అని అంటారు. కాదు 400 మంది అని గోండు పెద్దలు చెబుతారు. వీరిలో తూటాలవల్ల గాయాలపాలైనవారి సంఖ్య ఎంతో ఎక్కడా అంచనా లేదు. ఒక సామూహిక హననం జరిగింది. అమాయకులైన గోండు ఆదివాసీలపై, వారి మంచితనంపై దాడి చేశారు. భూమి, భుక్తి కోసం, పీడన నుండి విముక్తి కోసం నాలుగు ఆలోచనలు చేస్తే నాలుగు తరాల వేధింపులు మిగిలాయి.

‘ఇంద్రవెల్లి అమర వీరుల స్మారక స్థూపం పరిరక్షణ కమిటీ’ సభ్యులు మొన్న ఇంద్రవెల్లి పరిసర గ్రామాలలో తిరిగి పర్యటించారు. అప్పుడు గాయపడిన కొందరు బయటకు వచ్చి మాట్లాడడానికి కూడా భయపడ్డారు. ఇంట్లో ఉండికూడా లేరని చెప్పడం విచారకరం. మరణించిన కుటుంబాలవారు, గాయపడినవారి హృదయాలు భయంతో ఇప్పటికీ వణికి పోతుం డటం మన  సమాజానికి అంత మంచిది కాదు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఎందరో మహనీ యుల జయంతులు, వర్ధం తులు జరుపుకుంటున్నాం. అలాగే ఆదివాసీ మృతవీరులను స్మరించుకోవటం సంప్రదాయం. మరణించిన కుటుంబీకులే రహస్యంగా వారి ఆత్మలకు శాంతి చేకూర్చడం, కర్మకాండలకే పరి మితం చేయడం బాధాకరం.

మరణించిన వారిని తలచుకోవడం మానవ ధర్మం. అదీ వీరోచిత పోరాటంలో అసువులు బాసిన వారి స్మరణ కోసం ప్రజలు తపించిపోతారు. ఈ  మానవ ధర్మాన్ని విజ్ఞతతో అర్థం చేసుకుంటేనే సమాజంలో సౌహార్ద్రత పెరుగుతుంది. కొత్త రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితిని నెలకొల్పడం అవసరం. కాంగ్రెస్‌ హయాంలో ఇంద్రవెల్లి సంఘటన జరిగింది. కానీ అక్కడ మూడు దశాబ్దాలకుపైగా కుంటి సాకుపెట్టి నిషేధాజ్ఞలు విధిస్తున్నారు. తెలంగాణ ఏర్పడి రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీ ఆధ్వర్యంలో స్వపరిపాలన ఏర్పడింది. అయినా గత రెండే ళ్లలో ఈ నిషేధాజ్ఞలు కొనసాగాయి. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని అమరవీరుల స్థూపాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దాలనే ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకుంటారని ఆశ. ముఖ్యంగా ఆనాడు తూటాల దెబ్బలు తిని గాయాలపాలై, అంగవైకల్యంతో బాధపడేవారికి ఏదో ఒక రూపంలో సహకారం అందించే యోచన చేయాలి.

ఇంతకాలం గోండులమీద జరుగుతున్న ఒకరకమైన అణచివేత వారి మానసిక, ఆర్థిక, సామాజిక అభివృద్ధిని తప్పక కుంటుపరుస్తుంది. రాష్ట్రంలోని ఒక అతిపెద్ద ఆదివాసీ సమాజం నెత్తిపై ఆంక్షల బరువుని తరతరాలుగా మోపడం సరికాదు. ఇంతకాలం వారు కనబడని చెరసాలలో మగ్గిపోయారు. వారి సంస్కృతిని గుర్తించి గౌరవించడం, ఇటీవల లభించిన గుంజాల గోండీ లిపిని పాలసీగా గుర్తించి అభివృద్ధి పరచడం  కూడా అత్యవసరం. ఆనాడు రాజ్యాలు ఏలిన గోండు జాతి ప్రజలకు కనీస గౌరవం ఇవ్వడం  సంస్కారం.

20 ఏప్రిల్‌ నాడు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా అక్కడ అమరవీరులకు నివాళి అర్పించే అవకాశం కల్పిస్తే ప్రభుత్వ ప్రజాస్వామిక ధోరణికి అది అద్దం పడుతుంది. స్థానికులు, బయటివారు అనే కొత్త వివాదం.. అటు పోలీసులు, కొందరు స్వార్థపరులు ఈ సందర్భంగా తీసుకొస్తున్నారు. అది ఏమాత్రం మంచిది కాదు. అమర వీరుల త్యాగాలను కుదించే ప్రయత్నం చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. శాంతి భద్రతల పేరుతో కల్పిత కట్టు కథలను నమ్మకుండా గాయాలను మాన్పడం ప్రభుత్వం పని. ఆ దిశగా ఆలోచించడం ద్వారానే గోండుల నమ్మకాన్ని పొందగలం. స్వేచ్ఛా తెలంగాణకి అది అనివార్య సంకేతం కావాలి.
(20 ఏప్రిల్‌ 1981నాడు జరిగిన ఇంద్రవెల్లి కాల్పుల్లో మరణించిన అమర వీరుల జ్ఞాపకాలతో)

– చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement