గాలికి కులమేదీ!
జీవన కాలమ్
మనం రాష్ట్రపతులకీ, మంత్రులకీ, నాయకులకీ ఈ వాతావరణాన్ని పొదుపుగా కలుషితం చేసే మినహాయింపులను ఇస్తున్నాం. స్వీడన్‌లో మహారాజు కొడుకు రైలు కోసం అవతలి ప్లాట్‌ఫారం మీద నిలబడడం నేను చూశాను.
జనవరి ఒకటో తేదీ నుంచి ఢిల్లీ ప్రభుత్వం ఒక కొత్త ప్రయోగాన్ని చేపట్టింది. గాలిలో ప్రపంచంలోకల్లా భయంకరమైన కాలుష్యం ఉన్న కారణాన - ఆ కాలుష్యా నికి కారణమైన వాహనాలను నియంత్రించే చర్య. ఆనాటి నుంచీ బేసి సంఖ్యలో, సరి సంఖ్యలో వాహనాలు రోజు విడిచి రోజు నడుస్తాయి. ఈ ప్రయోగానికి మద్దతుదారులు ఎవరు? చిన్న పిల్లలు. ఇది చాలా మంచి ప్రయత్నం. విజయవంతం కావడం శుభసూచకం.
ఇందులో మళ్లీ చిన్న తిరకాసు ఉంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సుప్రీం కోర్టు జడ్జీలు, స్త్రీలు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహ నాలు, ఖైదీలను తీసుకెళ్లే వాహనాలు -ఇలా బోలెడు మంది వీరి వీరి కారణాలకు - వాతావరణాన్ని కాలు ష్యం చేయవచ్చు. అంటే పొదుపుగా కలుషితం చేయడా నికి కల్పించిన రాయితీలు. ఇస్తున్నది రాజకీయ నాయ కులు కనుక - ముందు ముందు వెనుకబడిన వారికీ, వెనుకబడినవారిలో ముందు పడుతున్నవారికీ, వెనుకప డాలనుకుంటున్నవారికీ, మంత్రుల భార్యలకు, చెంచా లకు, నాయకుల ఇంటి సిబ్బందికీ- ఇలా మినహాయిం పులు కొనసాగవచ్చు.
ఢిల్లీ శాసనసభలోనే తమకు ఈ మినహాయింపు ఇచ్చి తీరాలని చాలా మంది కుర్చీలతో కొట్టుకునే ఆవేశాలకు గురికావచ్చు. ఇంకా ముందు ముందు శుభ్రమైన ఆక్సిజన్‌ని నల్లబజారులో ధరకి కొనుక్కునే రోజులు రావచ్చు. డబ్బుకొద్దీ గాలి! మనం రాష్ట్రపతులకీ, మంత్రులకీ, నాయకులకీ ఈ వాతావరణాన్ని పొదుపుగా కలుషితం చేసే మినహా యింపులను ఇస్తున్నాం. జపాన్‌లో - ప్రపంచంలోకల్లా ఎక్కువ కార్లను తయారు చేసే దేశంలో ఒక కంపెనీ మేనేజింగ్ డెరైక్టరు సైకిలు మీద ఆఫీసుకు వెళ్లడం నేను చూశాను.
ఇలాంటి ప్రయత్నాలకు అప్పుడే వేళ మించిపో తోంది. మనం పరిశ్రుభమైన నీటిని డబ్బిచ్చి కొనుక్కో వడం ప్రారంభించి చాలా యేళ్లయింది. మన చిన్నత నంలో - ముఖం తెలీని మనిషి ఇంటి తలుపు తట్టితే చల్లని మంచినీరు ఇచ్చేవారని చదువుకున్నాం. ఇంకాస్త ముందు తరంలో చదువుకుంటున్నానని ఏ కుర్రాడ యినా వీధిలోకి వస్తే- అతని చదువు పూర్తయ్యే వరకూ వారంలో ఒక రోజు తిండి పెట్టేవారు. నా దగ్గర ఓ వీడియో ఉంది. అందులో 70 ఏళ్ల తర్వాత పుట్టిన వ్యక్తి, ఎందుకు పుట్టానా? అని వాపోవడం ఉంది. ఈ మాన వుడికి రోజూ స్నానం చేయడమంటే ఏమిటో తెలీదు. శరీరాన్ని తుడుచుకోవడమే తెలుసు (సింథటిక్ బాత్). తమ పూర్వీకులు హాయిగా స్నానాలు చేసేవారని విడ్డూ రంగా చెప్పుకుంటాడట. సుష్టుగా భోజనం తెలీదు. ఆర్గానిక్ ఆహారం తింటున్నాడు కనుక.
ఇప్పటి వాతావరణ కాలుష్యం కారణంగా ధృవాల లో 5 శాతం ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ భూమి మీద మూడువంతులు పైగా నీరు ఉంది. అందులో కనీసం సగం ధృవాలలో, మంచు పర్వతాలలో గడ్డకట్టి ఉంది. పర్యావరణాన్ని సమతులంగా ఉంచే ప్రకృతి ఏర్పాట్లలో సహజమైన ఏర్పాటు అది. అక్కడి మంచు - 5 డిగ్రీల వేడికారణంగా భయంకరమైన వేగంతో కరిగిపోతోంది. మానవుడు తట్టుకోలేనంత నీరు మీద పడితే ఏమవు తుంది? మొన్న చెన్నై అతి చిన్న నమూనా. ఇది కేవలం నీటికి సంబంధించిన ఉదాహరణ.
నేను ఐక్యరాజ్యసమతి ఆధ్వర్యంలో ఈ భూమిని పరిరక్షించే సపోర్ట్ సిస్టమ్స్ సంస్థ (EOLSS - Encyclpa edia of Life supporting systems) సంపాదకవర్గంలో ఒకడిని. అబుదాబి కేంద్రంగా ఉన్న ఈ సంస్థ 21 విజ్ఞాన సర్వస్వాలను ప్రచురిస్తోంది. అవన్నీ అపూర్వ విజ్ఞాన భాండాగారాలు. ఆ సంపాదకవర్గంలో ఉన్న ప్రొఫెసర్ గంటి ప్రసాదరావుగారు అబూదాబి నుంచి నాకొక ప్రసంగాన్ని పంపారు. 1992 జూన్ 14న రియో డిజని రోలో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన పర్యావరణ నిర్వ హణ సదస్సులో ఓ 12 ఏళ్ల పిల్ల కేవలం ఐదు నిమి షాలు మాట్లాడింది. తమ భవిష్యత్తుని కలుషితం చేసే హక్కు మీకెవరిచ్చారని సదస్సులో ఉన్న ప్రపంచ దేశాల ప్రతినిధుల్ని ఆమె నిలదీసింది. కేవలం ఐదు నిమిషాలు. ఆ పిల్ల మాటలు వింటూంటే నాకు గిర్రున కళ్ల నీళ్లు తిరిగాయి. (https://www.youtube.com/watch?v=SjXIbV0XY90)
ఈ కాలమ్ పేరు ‘ప్రపంచాన్ని 5 నిమిషాలు నోరుమూయించిన అమ్మాయి’. నేను స్వచ్ఛ భారత్ రాయబారిని. ఇది నా స్థాయిలో నేను చేయగల కృషి. మన తాతల కాలంలో ఈ అనర్థాలు లేవు. కారణం- వారు పాటించిన జీవన విధానం. ప్రకృతిని దేవతగా వారు భావించారు కనుక. చివరగా - ‘గాలికి కులమేదీ’ అన్నారు సినారె. నిజం. గాలికి కులం లేదు. కానీ ఈనాటి గాలిలో కావాల్సినంత ‘కిలుం’ ఉంది.
గొల్లపూడి మారుతీరావు