సోను నిగమ్... నివాన్... అజాన్...
సంవాదం
శిరోముండనం చేసుకున్న తన తండ్రి సోను నిగమ్‌ను చూసి అతని పదేళ్ల కుమారుడు నివాన్ ఏమని అనుకుని ఉంటాడా అనే ఆలోచన వచ్చింది. ‘వాడు హతాశుడయ్యాడు నిజమే. కాని చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో వాడికి తెలియాలి కదా’ అని సోను నిగమ్ శిరోముండనం తర్వాత తన కొడుకును ఉద్దేశించి పత్రికల వాళ్లతో అన్నాడు. ఇక్కడ ‘చుట్టుపక్కల’ అనే మాట దగ్గర ‘ముస్లిం’ అని ఆ పసివాడు ఎక్కడ పూరించుకుంటాడో అని నాకు బెంగ కలిగింది. ముస్లింలు ఇలా ఉంటారు... ముస్లింల వల్లే మా నాన్న ఇలాంటి పనికి ఒడిగట్టాడు అని వాడికి అనిపించి ఉంటే, ఆ దురభిప్రాయం ఎప్పటికి పోతుందా అనేది ప్రశ్న.
సోను నిగమ్ గాయకుడు. తెల్లవారి లేచి మైక్‌తోనే అతడి పని. కాని అతడికి ఆ మైక్ గురించే అభ్యంతరం వచ్చింది. ‘మసీదులు, గురుద్వారాలు, గుడులు లౌడ్ స్పీకర్ల ద్వారా చేసే అల్లరి గూండాగిరితో సమానం’ అని అర్థం వచ్చేలా ట్విట్టర్‌లో వ్యాఖ్య చేశాడు. అంతటితో ఆపి ఉంటే సరిపోయేది. కాని ‘నేను అజాన్‌తో బలవంతంగా ఎందుకు నిద్ర లేవాలి’ అని ప్రశ్నించాడు. ప్రవక్త కాలంలో కరెంటు లేదు... ఇప్పుడు మాత్రం ఎందుకు అని అన్నాడు. కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ దీనికి ఒక అడుగు ముందుకేసి ‘లౌడ్ స్పీకర్లు వాడి అజాన్ ఇవ్వమని ఖురాన్‌లో ఎక్కడా చెప్పలేదు’ అన్నారు.
మక్కా మీద అంతిమ విజయం సాధించాక కాబా గృహం వద్దకు చేరుకున్న మహమ్మద్ ప్రవక్త అందరికీ వినిపించేలా కాబా గృహం ఎక్కి మరీ అజాన్ ఇవ్వమని నల్ల బానిస బిలాల్‌కు ఆదేశం ఇచ్చారు. అతడు ఇనుమడించిన ఉత్సాహంతో కాబా గృహం మీద ఎగబాకి ‘అల్లాహో అక్బర్’ (గాడ్ ఈజ్ గ్రేట్) అంటూ అజాన్ ఇచ్చిన ఘటన చెరగక చరిత్రలో నమోదు అయి ఉంది. ఇస్లాంలో ఐదు పూటలా నమాజు చేయాలని తప్పనిసరి ఆదేశం. ఆ నమాజు వేళలను ప్రజలకు గుర్తు చేయడానికి అజాన్‌ను నియుక్తం చేశారు. పనీ పాటా చేసుకునే ప్రజలకు గడియారం, సమయం తెలియదు. వారు కొత్తగా ఇస్లాంలో చేరారు. వారి నమాజు వేళను గుర్తు చేయడానికి ఆ రోజుల్లో పెద్దగా అరిచి పిలవడానికి అజాన్ ఒక మార్గమైంది. అది కొనసాగింది. ఇవాళ లౌడ్ స్పీకర్లలో వినిపించే అజాన్ కర్తవ్య నిర్వహణ కూడా వేళను గుర్తు చేయడమే. చాలా మంది ముస్లిం మహిళలు ఈ అజాన్ పిలుపు వినే ఇళ్లల్లో పనులకు విరామం ఇచ్చి నమాజు చదువుకుంటూ ఉంటారు. అజాన్ వారి కోసం కూడా.
నిజానికి పెద్దగా అరిచి చెప్పడం ప్రతి మతంలో ఉంది. గోపురం ఎక్కి మరీ తిరు మంత్రాన్ని అరిచి చెప్పిన రామా నుజాచార్యుల ఉదంతం మనకు ఉంది. యజ్ఞాలలో యాగాలలో బృందంగా ఋత్విక్కులు పెద్దగా మంత్రాలు చదివేది ఇక్కడ ఒక క్రతువు జరుగుతున్నది అందరూ తరలి రండి అనే పరోక్ష ఆహ్వానం పలకడానికే. చర్చి బెల్, రక్షకుడి అభయాన్ని స్థిరపరచ డానికి. ఆదివారాలు లౌడ్ స్పీకర్లలో క్రీస్తు స్తుతి చేసేది ఆ రక్షకుడి శరణు కోరండి అని చెప్పడానికే.
ఈ దేశంలో పాలకులు దేవుడిని తప్ప ప్రజలకు మరేమీ మిగల్చలేదు. ఇంట్లో ఆకలిగా ఉన్నా, ఒంట్లో ఆరోగ్యం బాగ లేకపోయినా, క్షణక్షణం జీవితం సంక్షోభంగా ఉన్నా, ఇలా ఎందుకు ఉన్నాము అని ప్రశ్నించుకోక దేవుడి వైపు చూడటమే ప్రజలకు మిగిలింది. జీవితంలో మరే ఆశా మిగలని మంద భాగ్యులకు మూఢ జనులకు ‘మతం ఒక మత్తు మందు’ అని మార్క్స్ అన్నది అందుకే.
గంట మోగించి, మంత్రం చదివి, అజాన్ పలికి, భజనలు చేసి, బృందగానాలతో స్తుతించి దేవుడిని రక్ష కోరకపోతే ఈ దేశంలో ప్రజలు బతకలేరు. విద్యలో, ఉపాధిలో, బతుకులో అన్ని విధాలా వెనుకబడిన ముస్లింలు అల్లాహ్‌కు మోకరిల్లకపోతే అసలు బతక లేరు. అల్లాయే వారి ధైర్యం. అల్లాయే వారి స్థయిర్యం. అనాథలుగా ఉన్న ముస్లిం బాలురను, బాల కార్మికులుగా పని చేస్తున్న ముస్లిం బాలురను, శరణార్థులుగా మిగులుతున్న ముస్లిం బాలురను, ఏ కపటం ఎరుగక అన్ని మతాల బాలుర వలే బతుకుతున్న ముస్లిం బాలురను, ఇతర మతాల స్నేహితులతో గుండె నిండుగా నవ్వే ముస్లిం బాలురను వీరనే ఏముంది కేవలం దేవుడి దయకు వదిలిపెట్టిన అన్ని మతాల అధోజీవుల అభాగ్య బాలురను సోను నిగమ్ తన కుమారుడికి చూపకుండా తనకు తానుగా చేసుకున్న శిరోముండనానికి కారణమైన ఒక ముస్లిం పెద్దను చూపడమే దృష్టి దోషం.
ఈ దేశంలో దేవుడు ‘లౌడ్’గా ఉండటం తప్పు లేదు. అతడు ఎంత లౌడ్‌గా ఉంటే సగటు మనిషికి అంత ఓదార్పు.
ఈ మాట నీ కొడుకు నివాన్‌తో చెప్తావా సోను నిగమ్?
– మహమ్మద్ ఖదీర్‌బాబు
9701332807