హరిత భవిత దిశగా...
హరిత భవిత దిశగా...
Published Sat, Nov 26 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM
దేశంలో పర్యావరణ స్పృహ పెరిగి, అందుకు సంబంధించి చట్టాలు అవసరమని గుర్తించి మూడున్నర దశాబ్దాలు దాటుతోంది. కాలుష్య భూతాన్ని తరిమికొట్ట డానికి, కనీసం దాన్ని నియంత్రణలో ఉంచడానికి ఇన్నేళ్లలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఆచరణలో అవి పెద్దగా ఫలితాలనివ్వలేదని తరచు రుజువవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) ఇచ్చిన రెండు ఆదే శాలు ఊరటనిస్తాయి. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో అన్ని ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు హరిత ఆడిట్‌ను చేయించాలన్నది అందులో మొదటిది కాగా... నగరంలో బాణాసంచా వినియోగాన్ని నిషేధిస్తూ ఇచ్చిన ఆదేశం రెండోది. నిజానికి ఈ రెండు ఆదేశాలూ ఇతర నగరాలకు కూడా వర్తింపజేయాల్సిన అవసరం ఉంది. మనకున్న జాతీయ భవనాల కోడ్ (ఎన్‌బీసీ) లో హరిత ప్రమాణాల ఊసులేదు. కనుక పర్యావరణ అనుకూల భవన నిర్మాణం భావన ఎవరికీ పట్టడం లేదు.
దేశ రాజధానిలో కాలుష్యం కోరలు చాస్తోంది. అది చేయి దాటిపోయిందని నిత్యం వెల్లడయ్యే సూచీల్లోని అంకెలే చెబుతున్నాయి. పౌరులు శ్వాసకోశ సంబంధ, గుండె సంబంధ వ్యాధులకూ, పక్షవాతం, కేన్సర్ వంటి వ్యాధులకూ లోనవుతున్నారు. దీన్నుంచి ఎలా బయటపడాలో తెలియక నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. ఈ కాలుష్యం అమ్మ కడుపులో ఉన్నవారిని సైతం వదలడం లేదు. వేలాదిమంది తల్లులకు గర్భస్రావాలవుతున్నాయి. అయి దేళ్లలోపు పిల్లలు కూడా ఈ కాలుష్యం వల్ల అర్ధాయుష్కులవుతున్నారని నాలుగు నెలలక్రితం అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) వెల్లడించింది. వాస్తవానికి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్(సీఎస్‌ఈ) ఇరవైయ్యేళ్లక్రితం... అంటే 1996లోనే ‘స్లో డెత్’ పేరిట సవివరమైన నివేదికను వెలువరించింది. అది ఒక్క ఢిల్లీ గురించి మాత్రమే కాదు, అనేక నగరాల దుస్థితిని వివరించింది. కాలుష్యాన్ని తనిఖీ చేసే వ్యవస్థ ఏ నగరంలోనూ అమల్లో లేదని చెప్పింది. వాహనాల కాలు ష్యంపై హెచ్చరించింది. కానీ ఎవరూ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడిప్పుడు అందరికీ అర్ధమవుతోంది. ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుస్తోంది.
ప్రపంచంలోని కాలుష్య నగరాల్లో సగం మన దేశంలోనే ఉన్నాయి. ఇందుకు వాహనాలు మాత్రమే కాదు... ఎక్కడబడితే అక్కడ పోగుపడుతున్న చెత్త కుప్పలు, వాటిని తొలగించలేక నిప్పెట్టడం, పరిశ్రమలు అడ్డూ ఆపూ లేకుండా కాలుష్యం వెదజల్లడం వంటివి కారణాలవుతున్నాయి. చట్టాలు సక్రమంగా అమలయ్యేలా చేస్తూ, నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారిపై కేసులు నమోదు చేసి శిక్షపడేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు కూడా ఈ పాపంలో భాగస్వాములవుతు న్నాయి. అందరికీ శాస్త్రం చెప్పే బల్లి మాదిరి తామే చట్టాలు ఉల్లంఘిస్తున్నాయి. ఈ అరాచకాన్ని అరికట్టడానికే ఎన్‌జీటీ బెంచ్ బుధవారం హరిత ఆడిట్ చేయించమని ఆదేశించింది. దీని ప్రకారం ప్రభుత్వానికి చెందిన భవనాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు తమ వద్ద పోగుబడే చెత్తను, ఇతర వ్యర్థాలను ఎలా తొలగిస్తున్నారో ఎక్కడికి తరలిస్తున్నారో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. భవనాల లోపల వాయు నాణ్యత ఎలా ఉంటున్నదో, అది మెరుగ్గా ఉండటానికి అమలు చేస్తున్న వ్యవస్థ ఏమిటో చెప్పాల్సి ఉంటుంది. మురుగు బయటికి పోయేందుకు చేపట్టిన చర్యల గురించి చెప్పాలి.
చూడటానికి ఇవన్నీ చిన్న సమస్యలనిపించవచ్చుగానీ వాటివల్ల పర్యావరణానికి కలుగుతున్న హాని అంతా ఇంతా కాదు. కంప్యూటర్లు, లాప్ టాప్‌లు విరివిగా వినియోగంలోకి రావడం, సీడీలు ఉపయోగించడం అన్నిచోట్లా పెరిగింది. పనికిరాని విడిభాగాలు ఏదో మూలకు విసిరేయడం సర్వసాధారణ మైంది. ఇక ఆసుపత్రుల గురించి చెప్పనవసరమే లేదు. బ్యాండేజీలు, వాడి పారే సిన సిరెంజ్‌లు, కాలం చెల్లిన మందులు, ట్యాబ్‌లెట్లు వగైరాలను ఎక్కడబడితే అక్కడ పడేస్తారు. అన్నిచోట్లా ఇలాంటి స్థితే ఉంటుంది. ఒకవేళ చెత్తను తరలించినా శివార్లలో ఎక్కడో వదిలేయడం, ఆ సమీప ప్రాంతాల ప్రజలకు అది ప్రాణాం తకంగా మారడం రివాజే. ఈ స్థితి పోయి పరిశుభ్ర వాతావరణం కోసం కార్యా లయాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో, తమ ఆవరణల నుంచి తొలగించిన వ్యర్థాలను ఏం చేస్తున్నారో లెక్కచెప్పవలసి వస్తుంది. ఇలాంటి జవాబుదారీతనం అధికార యంత్రాంగం బాధ్యతను పెంచుతుంది. పర్యావరణానికి తమవల్ల జరుగు తున్న అపచారమేమిటో అర్ధమవుతుంది. వ్యర్థాలు పోగుబడే స్థితి ఏర్పడ కుండా ముందస్తు చర్యలు తీసుకునే అవకాశమూ ఉంటుంది.
ఈ ఆదేశాలు ప్రభుత్వాలపై బాధ్యతను పెంచుతాయి. ఒకేచోట ప్రభుత్వ కార్యాలయాలు పోగుబడేలా చేయడం, వాటితో నిత్యం పనులుండేవారు అక్కడికి రాక తప్పని స్థితి కల్పించడం ఎలాంటి సమస్యలకు దారితీస్తుందో పాలకులకు అర్ధమవుతుంది. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గురించి చెప్పుకోవాలి. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరా బాద్‌లో అభివృద్ధి పేరిట ఆయన తీసుకున్న చర్యలు నగర సహజ సౌందర్యాన్ని నాశనం చేశాయి. అది ఇరుగ్గా మారింది. వాహనాల కాలుష్యం హెచ్చయింది. ఆహ్లాదకర వాతావరణం ఆవిరైంది. ఇప్పుడు అమరావతి నిర్మాణంలోనూ ఆ విధానాలనే ఆయన అనుసరిస్తున్నారు. విజయవాడ-గుంటూరుల మధ్య 7,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తయారయ్యే ఆ రాజధానిలో నగర అంతర్భాగం 212 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కాగా, సీడ్ క్యాపిటల్ ఎనిమిది చదరపు కిలో మీటర్ల విస్తీర్ణమంటున్నారు.
ఈ ప్రాంతమంతా కాంక్రీట్ అరణ్యంగా మారుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు సమస్తం అక్కడే కేంద్రీకృతమవుతాయి. వస్తే గిస్తే పరి శ్రమలు అక్కడే ఉంటాయి. కనుక కాలుష్యం పెరిగిపోతుంది. ఎన్‌జీటీ ఆదేశాలు దేశంలోని ఇతర నగరాలకు కూడా వర్తింపజేస్తే, అభివృద్ధి పేరిట ప్రభుత్వాలు అమలు చేసే ఇలాంటి మతిమాలిన చర్యలకు కాస్తయినా అడ్డుకట్ట పడుతుంది. పర్యావరణ అనుకూల విధానాలపై దృష్టి పెరిగి ఆరోగ్యకరమైన పరిస్థితులు ఏర్ప డటానికి ఆస్కారం ఉంటుంది. ఈ దిశగా ఎన్‌జీటీ ఆలోచించాలి.
Advertisement
Advertisement