మహానగర విస్తరణలో సామాన్యుడికి చోటేది?
సందర్భం
ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని 1893 సంవత్సరంలో నిర్మించి నప్పుడు దానిపై ‘అర్బ్స్ ప్రైమా ఇన్ ఇండిస్’ అనే పదాలు చెక్కించారు. అంటే దేశంలోనే తొలి నగరం లేదా ప్రధాన నగరం అని అర్థం. ఇది ఒక సింగపూర్‌లా, హాం కాంగ్‌లా విలసిల్లుతుందని అప్పట్లో ఆకాంక్షిం చారు. కానీ పారిశ్రామికీకరణ కొనితెచ్చిన వలసల నేపథ్యంలో కిక్కిరిసిపోయిన భవంతులు, మురికి వాడలతో ఇప్పు డిది ఒక పరిశుభ్ర నగరంలా కూడా ఉండటం లేదు. మరాఠీలో చాల్ అంటే నాలుగైదు అంతస్తుల భవంతి అని అర్థం. కుటుంబం మొత్తానికి ఒకటే గదితో, బాల్కనీ వంటి వరండాతో, చివరలో ఉమ్మడి మరుగుదొడ్లతో ఉండే భవంతులివి. ఇవి కలిసి ఉండటం అనే ఉమ్మడి సంస్కృతిని ప్రోత్సహించేవి కానీ, మరమ్మతులకు సాధ్యంకానంతగా పతనమైన స్థితిలో ఇవి ఇప్పటికే రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కిక్కిరిసిపోయి ఉండే ఆధునిక భవంతులుగా.. పునర్నిర్మాణం బాటలో ఇప్పుడు సాగుతున్నాయి.
ముంబై నగరం దుస్థితికి మురికివాడలు కారణమంటూ కొంతమంది తరచుగానే ఫిర్యాదులు చేస్తుంటారు. నగర జనాభాలో సగంమంది మురికి వాడల్లోనే నివసించడం వాస్తవమే కానీ ఇవి నగరంలోని 15 శాతం కంటే తక్కువ భూమిలో ఉంటున్నాయి. ఏదేమైనా, నగరం మాత్రం సమర్థ పనితీరుకు ప్రాణాధారమైన మౌలిక వసతుల కల్పనకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జనం ఇప్పటికీ కిక్కిరిసి పోయిన రైళ్లలో ప్రయాణిస్తూనే ఉన్నారు. పనికిరాని స్థితిలో ఉన్న ప్రభుత్వ బస్సు సేవలను, ఫుట్‌పాత్‌లను ఉపయోగి స్తూనే ఉన్నారు. ఫుట్‌పాత్‌ల మీదయితే జనం నడవలే రు. ఎందుకంటే అవి చిల్లర వ్యాపారులు, అక్రమ షాపుల విస్తరణలతో పాటు నడవడానికి ఏమాత్రం అనుకూలంగా లేని ఉపరితలాన్ని కలిగి ఉంటున్నాయి.
కొత్తగా మౌలిక వసతుల కల్పనకోసం నగర పాలక సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రూ. 11,500 కోట్ల వ్యయంతో కూడిన 22 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంత రహదారి, ముంబై తీరప్రాంతాన్ని మహానగరంతో అనుసంధానించే ట్రాన్స్-హార్బర్ లింక్ వంటి నిర్మాణాలు వేగం పుంజుకుంటున్నాయి. కానీ ఈ నిర్మాణాలన్నీ కార్లను ఉపయోగించేవారికి ఉద్దేశించినవే. కానీ సామాన్యుడి అవసరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే మెట్రో, మోనో రైళ్లు, స్థానిక రైళ్ల అభివృద్ధి, బస్సు సేవల వంటివాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. చిత్తడి నేలమీద నిర్మితమైన ఇలాంటి సంక్లిష్ట నగరంలో జనజీవితాన్ని ఒక క్రమంలోకి తేగలిగే సమర్థ పరిపాలన అవసరం ఎంతైనా ఉంది. అయితే, ముంబై 1.25 కోట్లమంది జనాభాను కలిగిన మహా నగరం. దేశ జనాభాలో ఒక శాతం మంది ఈ ఒక్క నగరంలోనే 434 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసిస్తున్నారు.
బహుశా ముంబై నగరం దేశంలోనే అతి పెద్ద పురపాలక సంస్థను కలిగి ఉంది. 2015-16 సంవత్స రానికి దీని బడ్జెట్ రూ. 33,514 కోట్లు. చిన్న చిన్న దేశాలను సైతం పాలిపోయేటట్టు చేసేంత పెద్ద బడ్జెట్ ఇది. పైగా దాని బడ్జెట్ కంటే ఎక్కువగా రూ.41,000 కోట్ల మేరకు భారీ స్థాయిలో బ్యాంకు డిపాజిట్లను నగరం కలిగి ఉంది. కానీ కొత్త ఆర్థిక సంవత్సరం సమీపిస్తుండగా, నగర బడ్జెట్‌లో కేవలం 30 శాతం నిధులను మాత్రమే నగరపాలక సంస్థ ఖర్చు పెట్టగలి గింది. అందుచేత, సరైన నిర్వహణ ద్వారా ఒనగూరే ప్రయోజనాలను నగరం కోల్పోయిందన్నమాట. డిపాజిట్లు బ్యాంకులలోనే ఉంటున్నప్పటికీ, ఉద్యోగుల ప్రావిడెంట్, పెన్షన్ నిధులను నగరపాలక సంస్థ తొక్కిపట్టి ఉంచిందని తెలిసినప్పుడు నగరపాలక సంస్థ వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. నగర బడ్జెట్‌లో పీఎఫ్, పెన్షన్ నిధుల వాటా అయిదింట ఒక వంతు మాత్రమే. రహదారులు, మురికికాలువలు, పాఠశాలలు వంటి నగర మౌలిక వసతుల కల్పనను పేలవమైన నాణ్యతతో నిర్వహిస్తున్నారు. అయినా సరే ఇంత తక్కువ మొత్తాన్ని మాత్రమే ఖర్చుపెట్టడం గమనార్హం.
రహదారుల నిర్మాణం, వాటి నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్టర్లు తరచుగా తక్కువ కోట్ చేస్తూనే, తర్వాత బిడ్ విలువను పెంచుతుంటారు. ఈ క్రమంలో పేలవమైన రహదారులను వీరు నిర్మిస్తారు. ఇక నగర అధికారిక పర్యవేక్షణా వ్యవస్థ మరీ ఘోరంగా ఉంటోంది. ఒకసారి వర్షం కురిస్తే చాలు రహదారులు గుంతలమయం కాక తప్పదు. ఈ గుంతలను పూడ్చడానికి న్యాయస్థానాలు రంగంలోకి దిగి, తుది గడువును విధిస్తుంటాయి కాని అవి ఎన్నడూ అమలు కావు. హైకోర్టులోని కఠినమైన న్యాయమూర్తులు ఈ విషయమై అప్పుడప్పుడూ వేడిని కొనసాగిస్తుంటారు.
న్యాయస్థానం ఆదేశాలను ఒక జాబితాగా చేస్తే అది మీ చెయ్యి అంత పొడవుగా ఉంటుంది. న్యాయ స్థానా లు తరచుగా ఇచ్చే ఆదేశాలు నగరపాలక సంస్థ నిర్వహ ణ ఎంత అస్తవ్యస్థంగా ఉంటోందో తెలుపుతుంది. మహిళలు ముక్కు మూసుకోవడానికి వీల్లేనివిధంగా టాయ్‌లెట్లు, వాష్ రూమ్‌లు నిర్మించాలని ఆదేశాలు వెలవడుతుంటాయి. మూత్ర విసర్జన కూడా మహిళల హక్కు కాబట్టి, న్యాయస్థానాలు ఈ విషయంలో కూడా జోక్యం చేసుకుంటాయి కాని దాని అమలు మాత్రం నత్తనడకతోనే సాగుతుంటుంది. ఇదంతా ఒక సందర్భోచితమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇప్పుడున్నదానికంటే మెరుగ్గా ఉంచాలనే ఆకాంక్షలతో ముంబై నగరాన్ని ఎవరు నిర్వహించగలరన్నదే ఆ ప్రశ్న.
(వ్యాసకర్త : మహేష్ విజాపుర్కార్, సీనియర్ పాత్రికేయులు)