
తిరగబడిన ‘వారసత్వం’!
భారతీయ మాంచెస్టర్‌గా పేరొందిన అహ్మ దాబాద్ జౌళి పరిశ్రమ మూడవ తరం వ్యాధి లక్షణం కారణంగా క్షీణిస్తున్నదంటూ ఒక లాంచన ప్రాయ సూత్రీకరణ వాడుకలో ఉంది
విశ్లేషణ
భారతీయ మాంచెస్టర్‌గా పేరొందిన అహ్మ దాబాద్ జౌళి పరిశ్రమ మూడవ తరం వ్యాధి లక్షణం కారణంగా క్షీణిస్తున్నదంటూ ఒక లాంచన ప్రాయ సూత్రీకరణ వాడుకలో ఉంది. అదేమి టంటే, తాత తన రక్తం ధారపోసి మిల్లు నిర్మించాడు. కుమారుడు దాన్ని చూసి తన తండ్రితో కలిసి మిల్లును వృద్ధిలోకి తీసుకొచ్చాడు. మిల్లు స్థాపనలో తన తాత శ్రమను గ్రహించని మనమడు వ్యాపారం నల్లేరు మీద నడక అని భ్రమించి చివరకు దాన్ని పతనంవైపు తీసుకెళ్లాడు.
కాంగ్రెస్ పార్టీలో కూడా రాజీవ్ తర్వాత సోనియాగాంధీ, ఆ తర్వాత రాహుల్ గాంధీతో కూడిన మూడవ తరాన్ని, నాలుగవ తరాన్ని ఒక్కటి చేయడం ద్వారా అలాంటి గందరగోళాన్ని సృష్టిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలావరకు జరు గుతూ వచ్చిందీ లేదా ఇప్పటికి జరిగిందీ ఇదే. చివరగా ప్రస్తావించిన వారయితే బంగారు పళ్లేల్లో భుజించే కుటుంబంలో పుట్టారు. రాహుల్ గాంధీ పడ్డ కష్టం అంటూ ఏదయినా ఉందంటే ఒక రాత్రిపూట ఆయన దళితుడి ఇంట్లో గడపటమే.
అయితే, గత రెండేళ్లుగా జరుగుతూ వస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తాను ఉండవలసిన దానికంటే ఇంకా కురచగా మారిపోయింది. ‘ఓటమి శాశ్వతం కాదు’ అంటూ పార్టీ నైతిక స్థైర్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తూ సోనియాగాంధీ తన విధి తాను నిర్వహించారు. సాధారణార్థంలో ఆమె అన్నది నిజమే. 2009 తర్వాత కాంగ్రెస్ పరిస్థితి చాలావరకు దిగజారిపో యిందని, పార్టీ శాశ్వతత్వం సందేహాస్పదంగా మారిపోయిందనే వాస్తవం మినహా సోనియా చెప్పిందంతా బాగానే ఉంది.
కాంగ్రెస్ పార్టీని 2014 సార్వత్రిక ఎన్నికలలో నరేంద్రమోదీ చిత్తుగా ఓడించిన తర్వాత, రాష్ట్రాలకు ఇప్పటివరకు జరిగిన ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌కు అధికారికంగా ఏడు రాష్ట్రాలు మాత్రమే మిగిలాయి. వీటిలో కూడా కొన్ని సంకీర్ణ ప్రభుత్వాలు. పశ్చిమబెంగాల్లో తన ఎన్నికల భాగ స్వామి సీపీఎం కంటే కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలుపొందిన విషయం చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ అది తనంతట తానుగా ప్రభు త్వాన్ని ఏర్పర్చిందా లేదా అన్నదే అసలు విషయం.
సోనియాగాంధీ, ప్రస్తుతం జబ్బుబడిన ఆమె కుమారుడు రాహుల్ గాంధీనే ఈ ప్రశ్నకు జవాబు చెప్పవలసి ఉంటుంది. కార్యకర్తల్లో స్ఫూర్తిని నేతలు సమున్నతంగా నిలుపుతూనే వారిలో దృఢ విశ్వా సాన్ని కూడా కలిగించాలి. ఇంత వరకు మాతా పుత్ర ద్వయం చుట్టూ కార్యకర్తలు సమీకృతులు అయి ఉండవచ్చు, విమర్శనుంచి వారిని కాపాడటానికి వాస్తవంగానే ప్రయత్నిస్తుండవచ్చు.. కానీ అలాంటి కేంద్రీకృత పార్టీ యంత్రాంగంలో నింద, దూషణ లను ఆ ఇద్దరే స్వీకరించాల్సి ఉంది.
గాంధీలు తప్పు చేయరనడం అసంబద్ధ విషయం కావచ్చు. పార్టీ అంచనాలకు సోనియా, రాహుల్ గాంధీ సరిపోలనట్లయితే మరొకరిని తీసుకురావచ్చు. పార్టీ తదుపరి డిమాండ్‌గా అంటే నాయకురాలిగా ప్రియాంకా గాంధీ అయితే బాగుం డవచ్చు. ప్రియాంకలో నాయనమ్మ ఇందిరాగాంధీ పోలికలు ఉన్నాయని, ఆమె ‘ప్రజలను చెప్పు కోదగిన స్థాయిలో ఆకర్షించగలర’ని దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే వర్ణించారు కూడా. అయితే బీజేపీ వంటి పోరాట శక్తి గల పార్టీతో తలపడటానికి ఇది సరైన మార్గం కాకపోవచ్చు.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఒక తలకిందుల ప్రపంచంలో తన్ను తాను చూసుకుంటున్నట్లు ఉంది. కాంగ్రెస్ ఒకవైపు, దానికి వ్యతిరేకంగా అన్ని పార్టీల లాగా నడిచిన కాలం గతంలో ఉండేది. గతంలో పార్టీని జనం ఆమోదించని స్థితి ఏర్పడి నప్పుడు, దాన్ని మళ్లీ ఉచ్ఛస్థాయిలో నిలిపేందుకు.. దాని నిజమైన విలువ ప్రాతిపదికన కాకుండా కాంగ్రెస్‌కు మరో ప్రత్యామ్నాయం లేదనే వాదన పుట్టుకొచ్చేది. దేశంలోని అత్యంత పురాతన పార్టీకి ఇది గర్వించే విషయం కాదనుకోండి. కాంగ్రెస్ ఎలాంటి ప్రత్యామ్నాయం లేని పార్టీగా కనిపించేది.
ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకవైపు, దానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలలాగా పరిస్థితి మారిపోయింది. బీజేపీ పురోగమిస్తున్న క్రమంలో గత రెండు దశాబ్దాల నుంచే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం క్షీణిస్తూ వచ్చింది. దీన్ని వెనక్కు తిప్పే ధోరణి మధ్యంతర ఎన్నికల్లో సాధ్య మయ్యేలా కనిపించదు. ఎందుకంటే కాంగ్రెస్ కలిసి కట్టుగా వ్యవహరించలేకపోతోంది.
దాదాపు పతనం అంచులకు చేరిన కాంగ్రెస్ పార్టీని మెరుగుపర్చేందుకు సోనియా గాంధీ ప్రయ త్నిస్తూ ఉన్నప్పుడు ‘ఎవరైనా మూల సూత్రాలకు కట్టుబడి ఉంటే’, వైఫల్యం శాశ్వతం కాదని వ్యాఖ్యానించడం ద్వారా ఆమె చెప్పదలిచిన భావం ఏమిటి? తన సూత్రాల తొలి జాబితా తయారు చేయాలంటే కాంగ్రెస్ పూర్తిగా మూలాల్లోకి వెళ్లాల్సి ఉంది. ఎలాంటి ఫిర్యాదూ చేయని తన సొంత ప్రధాని (మన్మోహన్‌సింగ్) స్థాయినే అనేకరకాలుగా అపహాస్యం చేయడం ద్వారా ప్రతి సూత్ర బద్ధ అంశాన్నీ కాంగ్రెస్ పార్టీ గతంలో పక్కన పెట్టింది. భారీఎత్తున సాగించిన అవినీతిని ఒక సూత్రబద్ధ అంశంగా ఆమె నిలిపిఉంచుతున్నారా?
ప్రత్యేకించి ప్రియపుత్రుడు చేతులు మడిచి, బలంగా గొంతు విప్పని తీరుతో.. నాయకుడు అనే పదానికి సమీపంగా కూడా నిలబడని పరిస్థితుల్లో వారసత్వం ఇక ఏమాత్రం ప్రోత్సహించకూడని విషయంగా ఒక కొత్త సూత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆమోదించవచ్చు. నాయకుడు అనేవాడు నేతృత్వం వహించేవాడు. అంతే కానీ తల్లి కార ణంగా, తాను నాయకుడినని తలచేవాడు కాదు. తను నాయకుడు అని ఇతరులు తనకు చెప్పారు. రాహుల్‌కి సంబంధించిన వాస్తవం ఇదే.
వ్యాసకర్త
మహేష్ విజాపుర్కార్
సీనియర్ పాత్రికేయులు
ఈమెయిల్: mvijapurkar@gmail.com