చేతులు కాలాక... | pollution holiday for schools in new delhi | Sakshi
Sakshi News home page

చేతులు కాలాక...

Published Wed, Nov 9 2016 2:09 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

చేతులు కాలాక...

చేతులు కాలాక...

ప్రాణంమీదికొచ్చాక దేశ రాజధాని న్యూఢిల్లీలో కాలుష్యంపై ఆదరాబాదరాగా దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. డీజిల్ జనరేటర్లు వినియోగాన్ని ఆపేయాలని, థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఉత్త ర్వులిచ్చింది. నిర్మాణరంగం పనులు ఎక్కడికక్కడే నిలిపేయాలని ఆదేశించింది. అంతేకాదు... ఆ నగరంలో ఉన్న పాఠశాలలన్నిటికీ మూడురోజులు సెలవులు ప్రకటించారు. పని లేకపోతే బయటకు రావొద్దని పౌరులను కోరింది. పరిస్థితి తీవ్ర తను గమనించాక మంగళవారం సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. ఈ ఉప ద్రవాన్ని ఎదుర్కొనడానికి ఏం చేస్తారో 48 గంటల్లో చెప్పండంటూ కేంద్రాన్ని ఆదేశించింది. దీపావళి పండుగను బాణసంచాతో జరుపుకోవద్దన్న పర్యావరణ వేత్తల వినతులు... కోతలయ్యాక పంట చేలోని గడ్డి మోళ్లకు నిప్పెట్టవద్దన్న న్యాయ స్థానాల ఉత్తర్వులు అరణ్యరోదనగా మిగిలినప్పుడు ఇంతకన్నా వేరే స్థితిని ఊహిం చలేం.

గడ్డి మోళ్లు తగలబెట్టడం వల్ల వచ్చే కాలుష్యం 20 శాతం మాత్రమేనని, మిగి లిందంతా ఢిల్లీలో పెట్రోల్, డీజిల్; బొగ్గు, కట్టెలు, ఎండుటాకులు, చెత్త తగ లేస్తుండటంవల్ల సంభవిస్తున్నదని ఈమధ్యే కేంద్ర పర్యావరణ మంత్రి అనిల్ దవే చెప్పారు. మంత్రి చెప్పిన జాబితాలో బాణసంచా లేదు. గడ్డి మోళ్ల ప్రస్తావన ఉన్నా దానివల్ల వచ్చేది 20 శాతమేనని ఆయన చెబుతున్నారు. మన దేశంలో సమస్య ఇదే. కాలుష్యం ముంచుకొస్తున్న వైనం తెలిసినా  చురుగ్గా స్పందించరు. సమస్యను గుర్తించాకైనా లౌక్యం విడనాడి వ్యవహరించాలని భావించరు. కృత్రిమ వర్షం కురి పించడానికి గల సాధ్యాసాధ్యాలపై కేంద్రంతో చర్చిస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అంటున్నారు. అంతక్రితం ఎయిర్ ప్యూరిఫయర్ల గురించి కూడా ఇలాగే మాట్లాడారు.

పరిమిత ప్రాంతంలో హెలికాప్టర్ల ద్వారా నీరు విరజిమ్మడం సాధ్యం కావచ్చేమోగానీ విస్తృతమైన భూభాగంలో అది అసాధ్యం. వాతావరణంలో మేఘా లుంటే క్లౌడ్ సీడ్ ప్రక్రియ ద్వారా వర్షం సాధ్యమవుతుంది. కానీ ఈ సమయంలో మేఘాలు ఎక్కడినుంచి వస్తాయి? రాగల నాలుగైదు రోజులు ఆకాశం నిర్మలంగా ఉంటుందని వాతావరణ కేంద్రం చెబుతున్నది. పైగా గాలి మంద్రంగానే వీస్తుం దని, తేమ శాతం పెరుగుతుందని, ఉష్ణోగ్రతలు పడిపోతాయని చావు కబురు మోసుకొస్తోంది. వాస్తవానికి ఈ సమయంలో సాధారణ స్థాయికి మించి గాలులు వీచడం, వాతావరణం పొడిగా ఉండటం రివాజు. కానీ పగబట్టినట్టు ఈసారి వాతా వరణం భిన్నంగా ఉంది.
 
కేంద్ర మంత్రి చెప్పినట్లు గడ్డి మోళ్ల వల్ల జరిగే కాలుష్యం 20 శాతమే అనుకున్నా అదేమీ తక్కువ కాదు. న్యాయస్థానం జారీచేసిన ఉత్తర్వులు అమలు చేయలేకపోవడం మాట అటుంచి అసలు ఆ విషయంలో ఎలాంటి చర్యలు చేపట్ట      వచ్చునో అధికార యంత్రాంగం కసరత్తు చేసిన దాఖలాలు కనబడవు. పంజాబ్ ఎన్నికలు వచ్చిపడుతున్నాయి గనుక అక్కడి రైతుల జోలికి వెళ్లేందుకు ఆ రాష్ట్రం లోని అకాలీ-బీజేపీ ప్రభుత్వంగానీ, కేంద్రంగానీ సాహసించవు. బహుశా అందు వల్లే దాన్ని తగ్గించి చూపుతున్నారన్న అనుమానాలు కూడా అందరిలో ఉన్నాయి. రెండేళ్లనాడు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఉంటే వాటి అమలుపై స్పష్టత వచ్చేది. పంజాబ్, హర్యానాల్లో ఎక్కువగా పెద్ద కమతాలుం డటం...వరి, గోధుమ పంటల కోతకు యంత్రాలే ఉపయోగించడం వాస్తవం. యంత్రాల సాయం తీసుకోవడం వల్ల పొలాల్లో మోళ్లు మిగిలిపోతాయి. వాటిని తగలబెట్టడం కాక తొలగించడానికి ప్రయత్నిస్తే రైతులకు తడిసి మోపెడు ఖర్చవు తుంది.

ఇప్పటికే ఇన్‌పుట్ వ్యయం పెరిగి, సాగు ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించక ఇబ్బందులు పడుతున్న రైతులు మోళ్ల తొలగింపు పేరుతో మరింత భారాన్ని మోయగల స్థితిలో లేరు. మోళ్లను తగలబెట్టకుండా తొలగించే వారికి  ఎకరానికి ఇంత చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వాలు ప్రకటించి ఉంటే రైతులు ఉత్సాహంగా ఆ పని చేసేవారు. ఎండు గడ్డిని సేంద్రియ ఎరువుగా మార్చే సాంకే తికత ఇప్పటికే అందుబాటులో ఉంది. దాంతోపాటు ఇంధన ఉత్పత్తి కోసం బయో మాస్ ప్లాంట్లకు ఆ వ్యర్థాలను తరలించవచ్చు. కానీ ఆ విషయంలో చొరవ తీసుకున్నవారేరి? మరికొన్ని రోజుల్లో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సైతం కోతలు మొదలవుతాయి. ఈలోగా పెనుగాలులు వీచి ఢిల్లీని ఆవరించి ఉన్న కాలుష్యం కొట్టుకుపోతే ఏమోగానీ... లేనట్టయితే పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుంది.
 
ఢిల్లీ రాత్రికి రాత్రి గ్యాస్ చాంబర్‌గా మారిపోలేదు. దాదాపు రెండు దశా బ్దాలనుంచి అది క్రమేపీ ఆ దిశగా పోతోంది. కానీ ఎవరికి వారు పట్టనట్టు ఉన్నారు. కాలుష్యం విషయంలో సరి-బేసి కార్ల విధానాన్ని అమలు చేసినంత శ్రద్ధగా ఇతర అంశాలపైన కూడా దృష్టి పెట్టి ఉంటే వేరుగా ఉండేది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పటికిప్పుడు కాలుష్యంపై నగారా మోగించడంవల్ల రూ. 40కి మించని మాస్క్‌ల ధర రూ. 2,000 దాటిపోయిందని అంటున్నారు. నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థ పరమ అస్తవ్యస్థంగా ఉండటం వల్లనే వాహనాల సంఖ్య అపరిమితంగా పెరుగుతోందన్నది వాస్తవం. న్యూఢిల్లీలో మాత్రమే కాదు...తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖ తదితర నగరాలన్నిటా ఇదే దుస్థితి. సొంత వాహనాలుండటం హోదాకు చిహ్నంగా పరిగణించే రోజులు పోయి నగ రాల్లో బతకడానికి అవి తప్పనిసరి అవసరంగా మారిపోయాయి.

ఢిల్లీలో నిరుడు డిసెంబర్‌నాటికి దాదాపు 90 లక్షల వాహనాలున్నాయని ఒక సంస్థ అంచనా వేసింది. వీటికి రోజూ కొత్తగా రోడ్లపైకి వచ్చే వాహనాలు అదనం. మరోపక్క ఆ నగరంలో ఉండే సిటీ బస్సులు 6,000 మించవు. ఇందులో మరమ్మతులో ఉండేవి పోగా మిగిలినవి మాత్రమే ప్రయాణికుల అవసరాలు తీరుస్తాయి. ఇలాంటి పరి స్థితుల్లో సొంత వాహనాలు తప్ప సాధారణ పౌరులకు దిక్కేది? ఢిల్లీ దుస్థితి గమ నించాకైనా ఇతర రాష్ట్రాల్లోని పాలకులు గుణపాఠం నేర్చుకోవాలి. తమ నగరాల భవిష్యత్తు చిత్రపటాన్ని దర్శించుకుని తెలివి తెచ్చుకోవాలి. అపసవ్య విధానాలతో నగరాలను భ్రష్టుపట్టించే పోకడలను సరిచేసుకోవాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement