ఈ హితవచనాలు వింటారా?
పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అడ్వాణీ బుధవారం చేసిన వ్యాఖ్యలతో నూటికి నూరుపాళ్లూ ఏకీభవిస్తారు. గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం పార్లమెంటులో సాగుతున్న పరిణామాల పట్ల మరో వేదికపై ఆందోళన వ్యక్తం చేశారు. గత నెల 8న పెద్ద నోట్ల రద్దు గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన వారం రోజులకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఆ వారం రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న ఉదంతాలపై సహజంగానే ప్రతిపక్షాలు విరుచు కుపడతాయని అందరూ ఊహించారు. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయ కుండా పెద్ద నోట్లు రద్దు చేసి, కనీసం జనం ఇబ్బందులు పడుతున్నారన్న గ్రహింపు కూడా లేనట్టు ప్రవర్తిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిలదీయాల్సిందే. సంజాయిషీ కోరవలసిందే. కానీ అందుకు పార్లమెంటును స్తంభింపజేయడమే ఏకైక మార్గమ న్నట్టు విపక్షాలు వ్యవహరిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇదే బాగుందని పిస్తున్నట్టుంది. లోక్‌సభలో మెజారిటీ ఉన్నది గనుక కీలకమైన బిల్లులు ఆగిపోతా యన్న చింత ఎటూ లేదు. ఎవరెంత గొంతు చించుకుంటున్నా, సభలో ఎంత గంద రగోళం సాగుతున్నా అవేమీ పట్టనట్టు కావాలనుకున్న బిల్లులు సభా ప్రవేశం చేస్తు న్నాయి. మూజువాణి ఓటుతో ఆమోదం పొందుతున్నాయి. నామమాత్రంగా చర్చలు సాగుతున్నాయి. ఎవరికి వినబడుతుంది... వినబడదన్న విచక్షణ లేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ అయిన డబ్బుపై భారీ మొత్తంలో జరిమానా విధించే పన్ను చట్టాల(రెండో సవరణ) బిల్లు ఎలాంటి చర్చకూ తావు లేకుండానే లోక్‌సభలో అయిందనిపించారు. ఒకరిద్దరు సభ్యులు బిల్లుకు సవర ణలు ప్రతిపాదించినా స్పీకర్ వాటన్నిటినీ తోసిపుచ్చారు.
నిజానికి బిల్లుపై చర్చకు అవకాశం వచ్చినప్పుడు అధికార పక్షం ఆ అవకాశాన్ని వదులుకోకూడదు. ఒకపక్క పెద్ద నోట్ల రద్దు అనంతరం నల్ల కుబేరులు తమ దగ్గరున్న అక్రమ ధనాన్ని సక్రమం చేసుకోవడానికి పాట్లు పడుతున్నారని కేంద్రం అనడమే కాదు... అలాంటివారికి లబ్ధి చేకూర్చేందుకే విపక్షాలు పార్లమెంటును స్తంభింపజేస్తున్నాయని ఆరోపి స్తోంది. బిల్లుపై చర్చకు సిద్ధపడి ఉంటే అందులో నిజమెంతో, విపక్షాల అభ్యంతరా లేమిటో ప్రజలకు వెల్లడయ్యేది.
ఇప్పుడు పార్లమెంటు సాగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన నేతలిద్దరూ రాజకీయాల్లో తల పండినవారు. అడ్వాణీ ప్రస్తుత లోక్‌సభలో కూడా సభ్యుడు. పార్లమెంటులో ప్రతిష్టంభన ఎందుకు ఏర్పడుతుందో, అందుకు దారితీసే పరిస్థితు లేమిటో ఇద్దరికీ తెలియందేమీ కాదు. 2012 మే నెలలో వజ్రోత్సవం సందర్భంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించినప్పుడు సైతం పార్లమెంటు ప్రతిష్టం భనపై చర్చ జరిగింది. ఆనాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ కూడా ఈ ధోరణిపై ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటికి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర ఆర్ధిక మంత్రిగా యూపీఏ ప్రభుత్వంలో ఉన్నారు. అద్వానీ విపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఆందోళన వ్యక్తం చేయడానికి నేపథ్యం ఉంది.
అంతకు కొన్ని నెలల ముందు 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై జాయింట్ పార్లమెం టరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలన్న ఏకైక డిమాండ్‌తో పార్లమెంటు నిరవ దిక వాయిదాలతో గడిచి, ఆ స్థితిలోనే ముగిసిపోయింది. తమ డిమాండ్‌ను అంగీ కరిస్తే తప్ప సభను సాగనీయబోమని అప్పుడు విపక్షంలో ఉన్న బీజేపీ తెగేసి చెప్పింది. ఆ విషయంలో కాస్తయినా పట్టు సడలించుకోని యూపీఏ సర్కారు బడ్జెట్ సమావేశాలకల్లా దిగొచ్చి వారి డిమాండ్‌ను అంగీకరించింది. వజ్రోత్సవ సమావేశంలో వాయిదాలు సరికాదని చెప్పిన మన్మోహన్ ఇవాళ రాజ్యసభలో ఉన్నా తమ పార్టీకి హితవు చెప్పలేకపోతున్నారు.
సభ సజావుగా సాగితే ఆ విషయంలో ప్రతిష్ట దక్కేది అధికార పక్షానికే. తమ వైపు లోటుపాట్లేమీ లేనప్పుడు, దేన్నయినా ఎదుర్కొనగలిగే స్థితిలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల డిమాండ్‌ను అధికార పక్షం తోసిపుచ్చదు. పైగా చర్చకు చోటిచ్చి ఆ డిమాండ్‌లోని నిరర్ధకతను ప్రజలకు వెల్లడయ్యేలా చేయడానికి ఉత్సాహపడు తుంది. కానీ ప్రభుత్వ వాలకం చూస్తుంటే దానికి ఆ ఉత్సాహం ఉన్నట్టు కనబడదు. అలాగని పెద్ద నోట్ల రద్దుపై మోదీ అసలు మాట్లాడటం లేదని కాదు. భిన్న వేదికల నుంచి ప్రసంగిస్తూనే ఉన్నారు. ఏటీఎంల ముందూ, బ్యాంకుల ముందూ ఓపిగ్గా గంటల తరబడి నించుంటున్నందుకు వారిని అభినందిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో విపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారు. వారిని అవహేళన చేస్తున్నారు. సభా సమావేశాలున్నప్పుడు తీసుకునే నిర్ణయాలను ఆ సభలోనూ... అవి లేన ప్పుడు తీసుకున్న నిర్ణయాలను తదుపరి జరిగే సమావేశాల్లోనూ ప్రభుత్వం ప్రకటించాలన్న సంప్రదాయం ఉంది. రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ బదులు తానే నోట్ల రద్దును ప్రకటించిన మోదీ అందుకు దారితీసిన పరిస్థితులపై సభలో మాట్లాడటా నికి ఎందుకు వెనకాడుతున్నారు? విపక్షాల డిమాండ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకో వడం సబబేనా?
ఇప్పటికైనా ప్రణబ్, అడ్వాణీల హిత వచనాలను రెండు పక్షాలూ చెవి కెక్కిం చుకోవాలి. ఇరుపక్షాలూ ఆ వ్యాఖ్యలకు వక్రభాష్యం చెప్పేందుకు ప్రయ త్నిస్తున్నాయి. అవతలి పక్షాన్నుద్దేశించి అన్నట్టు తేల్చేస్తున్నాయి. ఇది సరికాదు. అత్యున్నత పదవిలో ఉండటం వల్ల కావొచ్చు... పార్లమెంటు సభ్యులు నినాదాలకూ, ఆందోళనలకూ దూరంగా ఉండి తమ పని తాము చేయాలని ప్రణబ్ చెప్పి ఉండొచ్చు. కానీ అడ్వాణీ మాత్రం తాను ఇరుపక్షాలనూ ఉద్దేశించి మాట్లాడుతున్నానని నేరుగా అన్నారు. స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలపై జనంలో ఉన్న అసంతృప్తికి అడ్వాణీ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. దీన్ని గమ నించుకుని అధికార, విపక్షాలు రెండూ తమ తమ వైఖరులను సరిదిద్దుకోవాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నిజంగా విశ్వాసం ఉంటే అందుకనుగుణంగా అవి ప్రవర్తించాలి.