గురువులదే గురుతర బాధ్యత | teachers greater responsibility | Sakshi
Sakshi News home page

గురువులదే గురుతర బాధ్యత

Published Sat, Sep 3 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

గురువులదే గురుతర బాధ్యత

గురువులదే గురుతర బాధ్యత

సందర్భం

ఇప్పటికీ నూటికి 95 శాతం మందికి పైగా ఉపాధ్యాయులు బాగా పనిచేయాలనే కోరిక కలిగిన వారే. విద్యార్థులు ఉన్నత స్థానాన్ని అధిరోహించినప్పుడు అమి తంగా సంబరపడేది గురువే. అందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించాలి.
 

 డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ గొప్ప వేదాంతి మాత్రమే కాదు, సమున్నత రాజనీతి జ్ఞునిగా విద్యారంగంలో రాబోయే పరిణామాలు ఎంతో ముందుగానే ఊహిం చారు. ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయవర్గానికి అంకితం చేసి ఉపాధ్యాయ దినోత్స వంగా జరుపుకోవటం  సముచితం.

రాధాకృష్ణన్ జీవించి ఉన్నప్పటి పరిస్థితులకూ, నేటి పరిస్థితులకూ ఎంతో తేడా ఉన్నది. విద్యారంగంలో మార్పులు శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. విద్యా రంగంలో వచ్చే ప్రతి మార్పు తదనుగుణంగా ఉపాధ్యా యలోకంలోనూ మార్పుని కాంక్షిస్తుంది. 21వ శతా బ్దంలో సమాజ ప్రగతికి పునాది విద్యారంగమే అనే భావన ఈనాడు యావత్ ప్రపంచంలో ఏర్పడింది.   అంటే 21వ శతాబ్దంలో సమాజంలో కీలకపాత్రధారులు ఉపాధ్యాయులే. మునుపటి కంటే గొప్ప టీచర్లను తయారు చేసుకోవాల్సిన అవసరం నేడు ఎంతగానో పెరిగిందని అర్థం. ఈ సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన దేశానికీ, ఈ సమాజానికీ ఒక గొప్ప ఉపాధ్యాయుడినీ, ఒక గొప్ప భవిష్యత్‌ను ఇవ్వనున్నామనే హామీని ప్రజలు కోరుకుంటున్నారు. ఉపాధ్యాయుడనేవాడు ఆకాశంలోనుంచి ఊడిపడడు. సమాజం నుంచే వస్తాడు. భారతదేశంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా టీచర్‌కు సమున్నత స్థానమే ఇచ్చారు. మన సంస్కృతిలో మాతృదేవో భవ, పితృ దేవోభవ, ఆచార్యదేవోభవ అంటూ తల్లి, తండ్రి తరు వాత గురువుకు స్థానం కల్పించారు. నేటి ఉపా ధ్యాయతరం దీనిని గుర్తించాలి. ఒక గొప్ప టీచర్‌గా మన పాత్ర ఏమిటనేది ఆలోచించాల్సిన సందర్భం కూడా ఇదేనని నా అభిప్రాయం.

ప్రతిరోజు ఉపాధ్యాయుల గురించి రకరకాల కథనాలు, వ్యాఖ్యానాలు మీడియాలో వస్తుంటాయి. నేను ప్రతీరోజూ ఒక పాఠశాలను సందర్శిస్తుంటాను. ఉపాధ్యాయులతో మాట్లాడుతుంటాను. కాబట్టి వాస్త వాలకూ, వదంతులకూ చాలా తేడా ఉంటుంద న్న విషయం గ్రహించాను. ఇప్పటికీ నూటికి 95 శాతం మందికి పైగా ఉపాధ్యాయులు బాగా పనిచేయాలనే కోరిక కలిగిన వారే. విద్యార్థులు ఉన్నత స్థానాన్ని అధిరోహించినప్పుడు అమితంగా సంబరపడేది ఉపా ధ్యాయుడే. ప్రభుత్వం, మీడియా, సమాజం ఉపా ధ్యాయులకు సరైన వాతావరణాన్ని కల్పించాలి. నూటికి తొంభయ్ శాతంగా ఉన్న ఉపాధ్యాయుల చిత్తశుద్ధినీ, విద్యాబోధనలో వారు అనుసరిస్తున్న నూతనత్వాన్నీ, పద్ధతులను, ప్రజల దృష్టికి తెస్తూ తగిన ప్రోత్సాహం ఇస్తే ఉపాధ్యాయ లోకం తన బాధ్యతలను ఇప్పటికంటే మెరుగ్గా చేయగలరనే నమ్మకం నాకున్నది. కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో మీడియా ఈ విషయంలో క్రియాశీలకమైన పాత్ర నిర్వహిస్తున్నది. విద్యారంగంలో జరుగుతున్న వినూత్న ప్రయోగాలకు ప్రచారం కల్పి స్తున్నది. అటువంటి ప్రయత్నాలు అన్ని చోట్లా జరగాలి.

తెలంగాణ వంటి రాష్ట్రాల్లో టీచర్ నియామక విధానంలో మార్పులు చేసి, సమర్థవంతమైన ఉపా ధ్యాయుల ఎంపికపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా టీచర్ల ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో మూడు అంశాలు ప్రధానమైనవి. మొదటిది విద్యాపరమైన సమర్థత, రెండవది వృత్తిపరమైన సమర్థత. మూడవది ప్రతిభ. విద్యాపరమైన, వృత్తిపరమైన సమర్థత విష యంలో నియామక సంస్థ చేయగలిగేది పెద్దగా ఏమీ ఉండదు. ప్రతిభను గర్తించటం వరకే దాని విధి. ప్రతిభ వ్యక్తికి సంబంధించినది. సమర్థతకు గీటురాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని సర్వీస్ కమిషన్ ముందుకెళ్తుందని ఆశిస్తున్నాను. ఉపాధ్యాయుల వృత్తిపరమైన సమర్థత ఉపాధ్యాయవిద్యపై ఆధారపడి ఉంటుంది.

నేడు విద్యారంగంలో ప్రమాణాల పెంపు ఒక సవా లుగా మారింది. ఇప్పటికీ డ్రాప్‌అవుట్ రేట్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండడం కలవరపెట్టే అంశం. డ్రాప్‌ఔట్ రేట్‌ను సరిగ్గా నియంత్రించలేకపోవటమంటే విద్యా రంగంలో మన వైఫల్యాన్ని అంగీకరించటమనే అర్థం. ఆశించిన స్థాయిలో ప్రతిభ చూపలేకపోతున్న పిల్లలు, డ్రాప్‌ఔట్ అవుతున్న పిల్లల గురించి మరింత లోతుగా, శాస్త్రీయంగా అధ్యయనం జరగాలి. సరైన ప్రతిభ చూపని పిల్లలు, డ్రాప్‌ఔట్ అవుతున్న పిల్లలు విద్యకు పనికి రారు అనే భావనను తొలగించాలి. లేకుంటే దేశ ఆర్థిక వ్యవస్థకే నష్టం. మరో ముఖ్యమైన అంశం పబ్లిక్ - ప్రైవేట్ రంగాల పాత్ర. ఈనాడు ప్రభుత్వాలే అంతా చేయగలిగే పరిస్థితులు లేవు. ప్రైవేట్ రంగంతో సామ రస్యపూర్వకంగా ఉంటూ పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో విద్యారంగాన్ని మరింతగా అభివృద్ధి చేయాలి. విద్యారంగం ఎంతగా బలోపేతం అయితే, సమర్థవంతమైన టీచర్లు ఎంతగా పెరిగితే దేశభవిష్యత్తు అంత బాగుంటుంది.



 వ్యాసకర్త: చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త
 శాసనమండలి మాజీ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement