
అధికార పక్షానిదే అక్కడ ఇష్టారాజ్యం!
కొమ్మినేని శ్రీనివాసరావుతో ప్రముఖ నటి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్.కె. రోజా
రాజకీయాల్లోకి ఆర్టిస్టులే కాదు ఎవరైనా రావచ్చని, కానీ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వారికి మద్దతుగా ఉండాలి తప్ప ఆ సమయంలో మనం బిజీగా ఉన్నాం అని చెప్పి తప్పించుకుంటే జనం నమ్మకం కోల్పోతామని ప్రముఖ నటి, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు. ఆర్టిస్టుగా, ఎమ్మెల్యేగా, ఒకరి భార్యగా తనకున్న గౌరవాన్ని దెబ్బతీసి చట్టసభలోనే భయంకరమైన నిందలేసిన వారికి సారీ చేప్పేంత తప్పు తాను చేయలేదని స్పష్టం చేశారు.
20 మంది ఎమ్మె ల్యేలు వెళ్లిపోయారంటే జగన్ నాయకత్వ లోపం అంటున్న వారికి.. తెలంగాణలో టీడీపీ ఎమ్మె ల్యేలంతా వరసపెట్టి టీఆర్‌ఎస్‌లో చేరితే అది చంద్రబాబు నాయకత్వ లోపంగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు? మామకు వెన్నుపోటు పొడిచాక బాబు సొంత పార్టీ పెట్టుకుని ఉంటే తన బలమేమిటో, తన ఫేస్ వాల్యూ ఏమిటో తెలిసేదని, అలాగే బాబు కుమారుడు ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కూడా తన ఫేస్ వ్యాల్యూ ఏంటో తెలిసేది అంటున్న రోజా అభిప్రాయాలు ఆమె మాటల్లోనే..
రాజకీయాల్లోకి మీరు ఎలా వచ్చారు? ఆ ఆసక్తి ఎలా కలిగింది?
ప్రస్తుత ఎంపీ ఎన్. శివప్రసాద్ గారే నన్ను సినిమాల్లోకి తీసుకు వచ్చారు. 1999 ఎన్ని కల్లో గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని ఆయనకు టీడీపీవాళ్లు ప్రామిస్ చేశారట. అందుకని తన నియోజకవర్గంలో రెండు రోజులు వచ్చి నేను ప్రచారం చేయాలని ఆయన మా నాన్నను వచ్చి అడిగారు. సినిమాల్లో తొలి అవకాశం ఆయనే ఇచ్చారు కదా తప్పకుండా వెళ్లు అని నాన్న చెప్పారు. అలా రెండు రోజులు వెళ్లి వాళ్లు సమస్యలపై రాసి ఇచ్చినది తీసుకుని మాట్లాడాను. నా ప్రసంగాలను విన్న చంద్రబాబు ఈ అమ్మాయి బాగా మాట్లాడుతోంది. రాష్ట్రం మొత్తంలో పర్యటించి ప్రసంగిస్తుం దేమో కనుక్కోమని చెప్పారట. సీఎంగా ఉన్న వ్యక్తి ప్రశంసించారంటే.. పడిపోనివాళ్లు ఉంటారా? అలా 26 రోజులపాటు ప్రచారం చేశాను. స్థానిక ఎన్నికల నుంచి ఎంపీ ఎన్నికల వరకు అన్నింట్లో పాల్గొని పని చేశాను. 1999లో పార్టీ గెలిచాక కూడా అయిదేళ్లపాటు నేను మహా నాడు వంటి కార్యక్రమాల్లో తప్ప పార్టీ పనుల్లో జోక్యం చేసుకోలేదు. 2004లో టీడీపీ తరపున పోటీ చేయాలని అడిగారు. నా భర్త వద్దం టున్నా బలవంతంగా ఒప్పించారు. వాయల్పాడు సీటు అడిగితే, చివరి నిమిషంలో చంద్రబాబు నగరిలో పోటీ చేయమని చెప్పారు. ఎలాంటి మద్దతూ లేక ఓడిపోయాను. తర్వాత అయిదేళ్లు కష్టపడి నగరిలో బలమైన పునాదిని నిర్మించుకోగలిగాను. కానీ 2009లో అక్కడ నాకు సీటు ఇవ్వకుండా ఒక రోజు ముందు చంద్రగిరి సీటు ఇచ్చారు. అక్కడా ఓడిపోయాను. పదేళ్లు కష్టపడిన ఒక అమ్మాయిని కాపాడదాం అనే ఆలోచన కూడా బాబుకు లేదు. రోడ్డుమీద నిలబెట్టి చివరకు నా రాజకీయ కెరీర్‌నే నాశనం చేశారు. కులం ప్రాతిపదికనే నన్ను చూశారని అర్థమైంది.
మరి వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిశారు కదా?
చిత్తూరు జిల్లాకు బెల్ కంపెనీ, విమానా శ్రయం తీసుకొచ్చారు. మన జిల్లాకు ఇంత పెద్ద ప్రాజెక్టులు సాధించారన్న భావనతో మర్యాదపూర్వకంగా వెళ్లి వైఎస్‌ఆర్‌ని కలి శాను. టీడీపీ వాళ్లు చాలా మంది ఆయన వద్దకు వెళ్లి పనులు చేయించుకుని వచ్చారు కూడా. నేనలాంటివి చేయలేదు. అభినందించడానికి ఒక బొకే ఇవ్వడానికి వెళ్లగానే దాన్ని పెద్ద సీన్ చేసేసి, పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఏమో జరుగుతోందని పుకార్లు వ్యాపింపచేశారు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. నన్ను అవమానించి, ప్రతి ఎన్ని కల్లోనూ నన్ను ఓడించి, టీడీపీలో నా పొజిషన్ ఏంటో తెలీని స్థితికి తెచ్చిపడేశారు. ఇక నేనెందుకు ఉండాలి. వెళ్లిపోతాను అని ప్రకటించాను.
వైఎస్సార్‌ను కలిసిన తర్వాత మీ పార్టీలో గొడవ అయింది. తర్వాత కాంగ్రెస్‌లో చేరారా?
లేదండీ. రాయలసీమకు మంచిచేసి, ఎంతోమందికి ఉపాధి కలిగించే ప్రాజెక్టులు తీసుకువచ్చినందుకు అభినందించాలని ఆయన్ని కలిశాను. ఆ తర్వాత సంవత్సరం వరకు నేను ఏ పార్టీలో కూడా చేరలేదు. వైఎస్ మరణించిన తర్వాత కూడా కిరణ్ కుమార్‌రెడ్డి, పెద్దిరెడ్డి, బొత్స అందరూ రమ్మన్నారు. ఆయనంటే గౌరవంతో వచ్చాను కానీ అధికారం కోసం ఆయన్ని కలవలేదని చెప్పి చెన్నైలోనే ఉండిపోయాను. ఒక సంవత్సరం తర్వాత జగన్ పిలిచారు. మీలాంటి వారు పార్టీకి అవసరం. జీవితాంతం మీకు తోడుగా ఉంటాం పార్టీలోకి రండి అని పిలిచారు. అప్పుడు చెన్నై నుంచి నెల్లూరు సభలో పాల్గొన్నాను. పదేళ్ల పాటు టీడీపీలో చంద్రబాబుతో సమానంగా నేను జిల్లాల్లో తిరిగితే, అష్టకష్టాలు పడితే నాకు ఏ గుర్తింపూ లేదు. కాని ఏ పనీ చేయకపోయినా జగన్ నాకు పిలిచి మరీ సీటు ఇచ్చారు. గెలిపించారు. నాకు రాజకీయంగా గౌరవాన్నిచ్చారు. గెలిచినప్పుడే నాపై టీడీపీవాళ్లు అన్ని మాట్లాడారు. గెలవకపోయి ఉంటే ఇంకెన్ని మాట్లాడేవారు. అంతటి గౌరవం జగన్ కల్పించారు కాబట్టే ఆయనకు నేను జీవి తాంతం రుణపడి ఉండాలి. మహిళల సమస్యలపై మహిళల వాయిస్‌ని అసెంబ్లీలో వినిపించాలి అని నేను ఏదయితే కల కన్నానో దాన్ని సాకారం చేసినందుకు నిజంగానే ఆయనకు రుణపడి ఉంటాను.
అసెంబ్లీలో మీరు సస్పెండయ్యారు. సీనియర్లను కూడా కించపర్చారట కదా?
నేను అని ఉంటాను, అని ఉండొచ్చు అని మాత్రమే అంటున్నారు. కానీ బుచ్చయ్య చౌదరి, కాల్వ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, బొండా ఉమా, దేవినేని ఉమా, పీతల సుజాత, అనిత తదితరులు ఆన్ రికార్డులో నాపై దుర్భాషలాడుతున్నప్పటికీ దిక్కు లేదు. సారీ చెప్పడమూ లేదు. నిన్నగాక మొన్న బాబు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఈ అలగా జనం అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీలో ఎస్టీ, బీసీలున్నారు. ఈ అలగా జనం అని వారిని ఉద్దేశించి అన్నారు. ఈ సైకోలు, ఈ దొంగల పార్టీ, మీకు మెంటలా, ఎందుకు నవ్వుతున్నారు, మెంటలాసుపత్రికి పంపిస్తానని ఒక సీఎం అంటుంటే, వారి నుంచి సభాపతి ఇంతవరకు ఒక క్షమాపణ కూడా చెప్పించలేదు. ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి అచ్చెన్నాయుడు నీవు మగాడివా, మగతనం ఉందా అని దూషిస్తే.. సభా సాంప్రదాయాలేంటి, అంతకుముందు సభలో ఇలాంటివి జరి గాయా.. స్పీకర్‌ను ఉద్దేశించి అధ్యక్షా అంటూ తమ అభిప్రాయం చెప్పా ల్సిన వారు మమ్మల్ని చూసి తిట్టడమేంటి?
సంవత్సరం సస్పెండ్ చేసినా రోజా మారలేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు అన్నారే?
అదే నాకూ ఆశ్చర్యమండీ. జగన్ పారిపోయాడు, సవాల్ స్వీకరించలేదు అని అందరూ అరుస్తూంటే నేను ముందు మైక్ ఇవ్వండి అన్నాను. పది నిమిషాలు మైక్ ఇస్తే ఆయన సవాల్ స్వీకరిస్తారా లేదా అనేది తెలుస్తుంది. అసెంబ్లీలో అడుగుపెట్టింది మొదలు ఈ రోజు వరకు ఆధారం లేకుండా ఏ ఒక్కమాటా జగన్ మాట్లాడలేదు. తాను మాట్లాడిన ప్రతి మాటా కరెక్టేనని ఆయన రుజువు చేçస్తు న్నారు. అధికార పక్షం వాళ్లవి తప్పులు అని నిర్ధారించారు. అలాగే మంత్రి ప్రత్తి పాటి పుల్లారావు అగ్రిగోల్డ్ వ్యవహారంలో తప్పు చేశాడని అరోపణలు వస్తున్నప్పుడు, 127 మంది బాధితులు ఆత్మహత్య చేసుకున్న ప్పుడు కనీసం జాలి, దయ చూపరు.
ఫిరాయింపులపై మీ అభిప్రాయం?
తెలంగాణలో టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీవాళ్లకు సిగ్గూ శరమూ ఉంటే రిజైన్ చేసి పోవా లని చెబుతారు. ఇక్కడేమో సిగ్గూ, ఎగ్గూ లేకుండా వైఎస్సార్‌సీపీ వారిని తమ పార్టీలోకి లాగేసుకోవడమే కాకుండా మామీద ఎదురుదాడి చేస్తారు. అంటే ఆనాడు వైస్రాయ్ హోటల్‌లో స్టార్ట్ చేసి, రాజకీయాలను ఎంత భ్రష్టు పట్టించాలో అంత పట్టించారు. 20 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారంటే జగన్ నాయకత్వ లోపం అంటారు. మరి తెలం గాణలో టీడీపీ ఎమ్మెల్యేలంతా వరసపెట్టి టీఆర్‌ఎస్‌లో చేరితే బాబు నాయకత్వ లోపం కాదా? జగన్ దమ్మున్న నాయకుడు కాబట్టే కాంగ్రెస్‌కు రిజైన్ చేసి బయటకు వచ్చాడు. ఆయన ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. సొంతపార్టీ పెట్టి, సొంత ఎజెండాతో ప్రజ ల్లోకి వెళ్లి, 67 స్థానాలు గెల్చుకున్నాడు. మామకు వెన్నుపోటు పొడిచాక బాబు సొంత పార్టీ పెట్టుకుని ఉంటే తన బలమేమిటో, తన ఫేస్ వ్యాల్యూ ఏమిటో తెలిసేది. లోకేష్ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే తన ఫేస్ వ్యాల్యూ ఏమిటో కూడా తెలిసేది.
మరి చంద్రబాబు సక్సెస్ అయ్యారు కదా?
గోద్రా ఘటన జరిగినప్పుడు మోదీ సీఎంగా పనికిరాడు. ఇలాంటివాడు నా రాష్ట్రానికి వస్తే ఉరి తీస్తానన్నాడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు. అసెంబ్లీలో అవన్నీ రికార్డు అయ్యాయి కూడా. అదే చంద్రబాబు ఇవ్వాళ అధికారం కోసం మోదీ కాళ్లు పట్టు్ట కున్నాడు. అలా అధికారంకోసం కాళ్లు పట్టుకోవడానికి, వెన్నుపోట్లు పొడవడానికి, అబద్ధపు వాగ్దానాలు చేయడానికి చంద్రబాబులా జగన్ దిగజారిపోలేదు.
(రోజాతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి)