
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబును సెంటిమెంట్ భయం వెంటాడింది. దాంతో ఆయన తన షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ ఆ కార్యక్రమంలో పాల్గొనకుండానే వెనుదిరిగారు. వివరాలిలా ఉన్నాయి. నిన్న (బుధవారం) విశాఖపట్నం పర్యటనలో భాగంగా సిరిపురం జంక్షన్‌లో రూ.10 కోట్లతో పునర్నిర్మించిన గురజాడ కళాక్షేత్రాన్ని చంద్రబాబు ప్రారంభించాల్సి ఉంది. విశాఖ చేరుకున్న ఆయన మొదట మహిళా పారిశ్రామికవేత్తల సదస్సును ప్రారంభించారు. అనంతరం గురజాడ కళాక్షేత్రం వద్దకు చేరుకున్నారు. బయట ఉన్న గురజాడ అప్పారావు విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం కళాక్షేత్రం ప్రారంభ సూచకంగా లోపల ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించాల్సి ఉంది.
అయితే ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనకుండానే విమానానికి టైమ్ అయిపోతోందంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆయన వెంట ఉన్న టీడీపీ నేతలు కొందరు.. ‘గురజాడ కళాక్షేత్రంలో సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలకు హాజరైన ప్రజాప్రతినిధులు పదవీచ్యుతులయ్యారు’ అని చంద్రబాబుకు చెప్పారని, ఈ కారణంగానే ముఖ్యమంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించకుండా వెళ్లిపోయారని అధికార వర్గాలు వెల్లడించాయి. సెంటిమెంట్‌కు భయపడే సీఎం లోపలికి వెళ్లి శిలాఫలకాన్ని ఆవిష్కరించలేదని పలువురు టీడీపీ నేతలు సైతం చర్చించుకోవడం కనిపించింది. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత రోడ్లు భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.