
తిరుమల దర్శన్ బస్సు (నమూనా)
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నుంచి తిరుమల ఏడుకొండలవాని సన్నిధికి వెళ్లే వారి కోసం పర్యాటకశాఖ కొత్త ప్యాకేజీని త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. తిరుమలకు డైలీ దర్శన్ పేరిట ఈ ప్యాకేజీని ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ఇప్పటికే రెండు ఏసీ వోల్వో (మల్టీ యాక్సిల్) బస్సులను కొనుగోలు చేసింది. తొలిరోజు విశాఖ నుంచి బయలుదేరి మర్నాడు శ్రీకాళహస్తి, తిరుమల, అలివేలు మంగాపురాల్లో దర్శనం చేయించి మూడో రోజు ఉదయానికి విశాఖ తీసుకొచ్చేలా ప్యాకేజీని రూపొందించారు. రోజూ ఒక బస్సులో 48 మంది చొప్పున తీసుకెళ్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ నుంచి ఈ బస్సు బయలుదేరుతుంది. మర్నాడు ఉదయం శ్రీకాళహస్తి చేరుకుంటుంది. ఉదయం అక్కడ పర్యాటకశాఖ అతిథి గృహంలో స్నానపానాదులయ్యాక శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేయిస్తారు. అనంతరం తిరుపతికి తీసుకెళ్తారు. కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లి గంటన్నరలో పర్యాటకశాఖ ప్రత్యేక కోటాలో స్వామి దర్శనం పూర్తి చేస్తారు. ఆ తర్వాత కొండ దిగువన ఉన్న అలివేలు మంగాపురం అమ్మవారు, గోవిందరాజుస్వామిల దర్శనం కల్పిస్తారు. అనంతరం సాయంత్రం బయలుదేరి మర్నాడు ఉదయం విశాఖ చేరుకుంటారు.
దర్శన టిక్కెట్లు ప్యాకేజీలోనే..
తిరుమల శ్రీవారి దర్శనం సహా ఇతర దేవాలయాల్లో దర్శన టిక్కెట్ల ఖర్చును పర్యాటకశాఖే భరిస్తుంది. అయితే భోజనం ఖర్చును మాత్రం భక్తులే భరించాల్సి ఉంటుంది. ఆయా దేవాలయాల్లో దర్శనానికి ఇబ్బందుల్లేకుండా చూడడానికి పర్యాటకశాఖ మార్గదర్శి (గైడ్)ని ఎక్కడికక్కడే అందుబాటులో ఉంచుతుంది. ఈ ప్యాకేజీ ధర రూ.3000–3500 మధ్య ఉండేలా నిర్ణయించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ ఇలాంటి ప్యాకేజీని బెంగళూరు, కోయంబత్తూరు, చెన్నైల నుంచి తిరుపతికి నడుపుతోంది. వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో విశాఖ నుంచి తిరుమల డైలీ దర్శన్ పేరిట ప్యాకేజీని సిద్ధం చేసింది. కాగా విశాఖ నుంచి తిరుపతికి గరుడ సర్వీసు టిక్కెట్టు ధర రూ.1350 ఉంది. ఈ లెక్కన రానూపోనూ రూ.2700 అవుతుంది. అదే టూరిజం ప్యాకేజీలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శన టిక్కెట్టును భరిస్తూ ఇతర దేవాలయాల్లో దర్శనం చేయిస్తూ, పర్యాటకశాఖ అతిథి గృహంలో వసతి సదుపాయం కల్పిస్తూ రూ.3500 లోపు ప్యాకేజీని రూపొందిస్తున్నందున మంచి ఆదరణ అభిస్తుందని పర్యాటకశాఖ అధికారులు ఆశాభావంతో ఉన్నారు.
నెల రోజుల్లో ప్రారంభిస్తాం..
తిరుమల డైలీ దర్శన్‌ను మరో నెల రోజుల్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే ఆన్‌లైన్‌లో ఈ ప్యాకేజీ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాం. విశాఖతో పాటు రాజమండ్రి, విజయవాడల్లోనూ పికప్ పాయింట్లను ఏర్పాటు చేస్తాం. ఈ ప్యాకేజీ కోసం త్వరలో రెండు వోల్వో బస్సులు రానున్నాయి. వీటిలో ఇటు నుంచి ఒకటి, అటు నుంచి మరొకటి బయలుదేరతాయి.
– ప్రసాదరెడ్డి,డివిజనల్ మేనేజర్, పర్యాటకాభివృద్ధి సంస్థ
Comments
Please login to add a commentAdd a comment