తాళం వేసి ఉన్న పాత టీడీపీ కార్యాలయం
వరంగల్: పేద ప్రజలకు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఇళ్లు అందించిన గుడిసె పార్టీకి నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గూడు కరువైంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి 2004 వరకు జిల్లాలో ఒక వెలుగు వెలిగినా నేడు కార్యాలయం లేకుండా పోయింది. ఏడాది క్రితం ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు బాలసముద్రంలో ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకుని పార్టీ కార్యాలయం నిర్మించారు. ఇందుకు సుమారు రూ. 30 లక్షల వరకు పార్టీ నుంచి వచ్చిన నిధులను వ్యయం చేసినట్లు సమాచారం. జిల్లాలో పార్టీ కార్యాలయం నిర్వహణకు రాష్ట్ర పార్టీ నుంచి ప్రతి నెలా నిధులు వస్తుండడంతో ఎలాంటి లోపాలు లేకుండా సాఫీగా సాగిపోయింది.
పునర్విభజనతో ఇక్కట్లు..
జిల్లాల పునర్విభజనతో ఐదు జిల్లాల పార్టీ కన్వీనర్లను నియమించారు. దీంతో ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా ఉన్న సత్యనారాయణరావు సొంత జిల్లా భూపాలపల్లికి కన్వీనర్‌గా నియమితులయ్యారు. అయినప్పటికీ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా పార్టీ కార్యాలయ నిర్వహణ చూసుకునేవారు. వరంగల్ అర్బన్ జిల్లా కన్వీనర్‌గా నియమితులైన ఈగ మల్లేశంను 2017 జనవరి 26న జిల్లా కార్యాలయంలోని సీటులో రాష్ట్ర నాయకులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి కూర్చోపెట్టడంతో నేతల మధ్య అగ్గి రాజుకుంది. మల్లేశంను కుర్చిలో కూర్చోపెట్టినందున పార్టీ కార్యాలయానికి వచ్చేది లేదని సత్యనారాయణ భూపాలపల్లికే పరిమితమయ్యారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పార్టీ వ్యవహారాలకు గన్నోజు శ్రీనివాసాచారి కన్వీనర్‌గా ఉన్నప్పటికీ ఒక్కరికే కార్యాలయ బాధ్యతలు ఎలా అప్పగిస్తారన్న దానిపై వాదన కొద్ది రోజులు నాయకుల మధ్య జరిగింది. కార్యాలయ నిర్వహణకు ఇస్తున్న నిధులు తమ జిల్లాల్లోని కార్యాలయాలకు ఇవ్వాలని ఐదు జిల్లాకు చెందిన అధ్యక్షులు రాష్ట్ర నాయకుల వద్ద డిమాండ్ చేయడంతో రాష్ట్ర పార్టీ నుంచి వచ్చే ని«ధులు నిలిచిపోయాయి. దీంతో జిల్లా పార్టీ కార్యాలయం అద్దెలు పెండింగ్‌లో పడ్డాయి.
ఈ క్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ పార్టీని వీడడంతో కార్యాలయం స్థలం యాజమాని గత నెలలో అద్దె చెల్లించాలని ఒత్తిడి చేశారు. అయినప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో గత నెలలో కార్యాలయానికి తాళం వేశారు. దీంతో పార్టీ వ్యవహారాలు ఎవరి ఇళ్లలో వారు నిర్వహించుకుంటున్నారు. అర్బన్ పార్టీ అధ్యక్షుడు మల్లేషం ఆయన ఇంట్లో నిర్వహించుకోగా, రాష్ట్ర నాయకుడు ప్రకాశ్‌రెడ్డి పార్టీ వ్యవహా రా లపై సమీక్షలు ఆయన ఇంట్లో నిర్వహించుకున్నారు. పార్టీ కార్యాలయం నిర్వహణ కోసం హన్మకొండలో పలు ప్రాంతాల్లో భవనాలు చూసినప్పటికీ అద్దెలు ఎవరు కట్టాలన్న విషయంపై స్పష్టత రాకపోవడంతో కార్యాలయం ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం జనవరి 18న పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమం ఎక్కడ నిర్వహించాలన్న దానిపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. చివరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రాథమికంగా నేతలు నిర్ణయానికి వచ్చారు. పార్టీకి కార్యాలయం లేకపోవడంపై పార్టీ అభిమానులు, శ్రేణులు నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment