మీకోసంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎఎస్పీ రత్న
సమాజంలో స్త్రీల పట్లవివక్ష చూశాను. చదువుకోవడానికి కూడా ఆటంకాలు ఉన్నాయి.వేటికీ వెరవకూడదు. పోరాడితే మహిళలుఅనుకున్నది సాధిస్తారు.ఈ విషయంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. కుటుంబ వ్యవస్థలో కూడా మార్పు రావలసి ఉంది. ఆడపిల్లలుఅబలలు కాదని,సబలలని నిరూపించే సంఘటనలు అనేకం ఉన్నాయి.
ఏలూరు టౌన్: ఆధునిక సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో పోటీపడుతున్నా... అదేస్థాయిలో వివక్ష, దాడులు, హత్యలు, అత్యాచారాలు, వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి... మహిళగా అనేక ఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధిగమించి విజయాలు అందుకోవటం అద్భుతమైన అనుభూతినిచ్చింది. ఎర్రచందనం మాఫియా భరతం పట్టినప్పుడు గానీ.. మహిళల అక్రమరవాణా ముఠాపై దాడులు చేసి కేసులు పెట్టిన పరిస్థితుల్లోనూ బెదిరింపులు, ఒత్తిళ్ళు ఎదురైనా చట్టం.. మనస్సాక్షితో పనిచేస్తూ ఆరాచక శక్తుల ఆటకట్టించాను. స్త్రీ ఎంత ఎదిగినా అనాదిగా సమాజంలో వివక్ష ఎదుర్కొంటూనే ఉంది. నేను ఈ స్థాయికి చేరేందుకు బాల్యం నుంచీ వెన్నుతట్టి ప్రోత్సహించిన.. నా తల్లీదండ్రే నా మార్గదర్శకులు. నా రోల్‌మోడల్ అంటోంది జిల్లా అదనపు ఏఎస్పీ వెలిశెల రత్న. ఇంకా అనేక విషయాలు ఆమె
మాటల్లోనే..
నేను చదువుకునే రోజుల్లో మహిళల చదువు పట్ల చిన్నచూపు ఉండేది. మా తండ్రి నా సోదరులతో సమానంగా చదివించటం కారణంగానే ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. చదువుకోవాలనే ఆశ ఉన్నా కొందరికి ఆ అవకాశమే ఉండేది కాదు. ఆడపిల్లకు చదువెందుకు అనేవారు. ఆడపిల్ల ధైర్యంగా బయటకు వస్తే నిందలు వేసే నీచమైన పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాడితేనే విజయం సాధించగలమనే నమ్మకం రావాలి. భవిష్యత్తులో సైబర్ క్రైం పెద్ద సవాల్‌గా మారే పరిస్థితులు కన్పిస్తున్నాయి. టెక్నాలజీ పెరగటం అరచేతిలోనే ప్రపంచాన్ని చుట్టిరాగల పరిస్థితులు ఉన్నాయి. పరిజ్ఞానం ఎంత పెరిగిందో నేరాలు అంతేస్థాయిలో అధికం అయ్యాయి. స్త్రీ ఎంత ఎదిగినా సమాజంలో వివక్ష ఎదుర్కొంటూనే ఉంది. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నా...ఆయా రంగాల్లో నేటికీ దారుణ పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉన్నారు.
సామాజిక, ఆర్థిక, జీవన విధానంలో మార్పులు మహిళలపై దాడులు పెరిగేందుకు కారణంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం లేకుంటే మహిళలు అభివృద్ధి సాధించటం సాధ్యం కాదనే చెప్పాలి. కుటుంబ వ్యవస్థలో మార్పులు ఒంటరి మహిళల సంఖ్యను పెంచింది. ఈ పరిస్థితుల్లో మహిళలపై దాడులు, వేధింపులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. మహిళలు నేరస్తులుగా ఉన్న సంఖ్య స్వల్పమే కానీ.. బాధితులుగా వేలల్లో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయం ఇలా అన్ని రంగాల్లోనూ ముందంజ వేస్తూ పట్టుదలతో పోరాడితేనే మహిళా సాధికారిత, స్వావలంబన సాధ్యమవుతుంది. మా తండ్రి నాగేంద్రరావు ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తల్లి వీఎంజే పిన్నమ్మ గృహిణి. మా నాన్న ఆర్మీలో పనిచేయటంతో దేశభక్తికి కొదవలేదు. నా తల్లీతండ్రిని చూస్తూ పెరగటంతో బాల్యం నుంచీ ప్రజలకు సేవ చేయాలనే కాంక్ష అధికంగానే ఉండేది.
నాకు ఇద్దరు సోదరులు ఉన్నారు. నాకు ఒక కుమారుడు, భర్త బిజినెస్ చేస్తారు. మాది కృష్ణాజిల్లా పెనుమలూరు మండలం తాడిగడప గ్రామం. పెనుమలూరులోనే టెన్త్ వరకూ చదివాను. విజయవాడ మేరీ స్టెల్లా కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తిచేసి, రాజమహేంద్రవరంలో బీఎడ్ చదివాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ, ఎంఫిల్ చేశాను.
ఇక 2002లో జవహర్ నవోదయ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే గ్రూప్–2 పరీక్ష రాసి ఏసీటీఓగా 2005లో పనిచేశా. సామాజిక సేవ పట్ల ఉన్న ఆసక్తి కారణంగా గ్రూప్–1 పరీక్షలు రాసి డీఎస్పీగా 2007 బ్యాచ్‌లో ఉద్యోగంలో చేరాను. పోలీస్ శాఖలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి దశాబ్దకాలం పూర్తయింది. మొదట పోస్టింగ్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి, రెండో పోస్టింగ్ గుంటూరు అర్బన్ డీఎస్పీగా పనిచేశాను. మూడో పోస్టింగ్ గుంటూరు అర్బన్ ఓఎస్‌డీగా పనిచేశా. చిత్తూరు జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా పనిచేయటం మంచి గుర్తింపునిచ్చింది. 2016 డిసెంబర్ 5న పశ్చిమ అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించా. ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాలు తీసుకున్నాను.
సత్తుపల్లి, గుంటూరు, చిత్తూరులో పోలీస్ అధికారిగా పనిచేస్తోన్న కాలంలో అనేక కేసులు ఛాలెంజింగ్‌గా తీసుకుని ఛేదించాను. మహిళల అక్రమ రవాణా చేస్తోన్న ముఠాల ఆటకట్టించి, పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయించా. ఒత్తిళ్ళకు లొంగిపోకుండా చట్టం, మనస్సాక్షి ఆధారంగా దోషులకు శిక్షలు పడేలా చేయటం ఆనందాన్ని ఇచ్చింది. చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్ల భరతం పట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. బడా నేతల కనుసన్నల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేస్తూ కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని కాపాడాను. గుంటూరులో పనిచేస్తోన్న సమయంలో ఘోరరోడ్డు ప్రమాదంలో 12మంది చనిపోయారు. వారిలో నిండు గర్భిణి కూడా ప్రాణాలు కోల్పోవటం బాధించింది. డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడపటంతో ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment