గల్లంతైన నక్కా భరత్ నాగేంద్ర మణికంఠ
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన జిల్లాకు చెందిన ఒక యువకుడి ఆచూకీ గల్లంతైంది. అప్పటివరకు తాను ఉద్యోగం నిర్వహించిన నౌకలోనే అతడు మాయం కావడం మిస్టరీగా మారింది. ఇది కిడ్నాపా.. లేక ఏదైనా ప్రమాదమా.. అనే విషయంలో స్పష్టతలేక అయోమయం నెలకొంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
పశ్చిమగోదావరి, పెనుమంట్ర: మండలంలోని నెగ్గిపూడికి చెందిన నక్కా భరత్ నాగేంద్ర మణికంఠ ఉపాధి నిమిత్తం మూడు నెలల క్రితం ఇండియా నుంచి దుబాయ్ వెళ్లాడు. అక్కడ మర్చంట్ నేవీలో కెఫ్టెన్‌కు సహాయకుడిగా ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో భాగంగా అతడు ఈ నెల 8వ తేదీ దుబాయ్ నుంచి సోమాలియా మీదుగా మస్కట్ దేశానికి నౌకలో ప్రయాణం సాగిస్తున్నాడు. కాగా ఈ నెల 16వ తేదీ రాత్రి షిష్టు ఉద్యోగంలో ఉన్న సమయంలో సోమాలియాలో అతడు ఆచూకీ గల్లంతైనట్టు తెలుస్తోంది. సదరు విషయాన్ని అతని సహ ఉద్యోగి అయిన గుంటూరు జిల్లాకు చెందిన శివ, నెగ్గిపూడిలోని మణికంఠ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అప్పట్నుంచి తీవ్ర మనో వ్యధకు గురైన కుటుంబీకులు పలు విధాలుగా సమాచారం కోసం ప్రయత్నిస్తున్నారు.
కుటుంబ నేపథ్యం ఇదీ..
మణికంఠ తండ్రి నక్కా దుర్గాప్రసాద్ సౌదీలో డ్రైవరుగా పనిచేస్తున్నారు. తల్లి ఝాన్సీలక్ష్మి గృహిణి. మణికంఠ నరసాపురంలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి అనంతరం మిత్రుల సలహాతో చెన్నై వెళ్లి అక్కడ శిక్షణ పొందాడు. అక్కడ నుంచి దుబాయ్‌కి ఉపాధి నిమిత్తం వెళ్లాడు. అక్కడ షిప్‌యార్డులో ఉద్యోగం చేస్తూ షిప్‌లో కెప్టెన్‌కు సహాయకుడిగా గతేడాది అక్టోబర్ నెలలో ఉద్యోగం ప్రారంభించాడు. మణికంఠ అక్క ప్రమీలాదేవి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. తమ్ముడు చందు సాయిరాం నెగ్గిపూడిలోనే ఉంటూ చదువుకుంటున్నాడు.
రాయబారి అధికారులకు వేడుకోలు
మణికంఠ ఆచూకీ కోరుతూ అతని తండ్రి దుర్గాప్రసాద్ దుబాయ్‌లో భారత రాయభార కార్యాలయం వద్ద తన ఆవేదన వినిపించాడు. అలాగే మనదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఉన్నతాధికారులకు కూడా మొరపెట్టుకున్నాడు. తన కుమారుడి ఆచూకీ తెలపాలని కోరుతూ వివరాలు అందజేశాడు.
మంత్రి పితానికి మొరపెట్టుకున్న తల్లి
కాగా గురువారం హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణను మణికంఠ తల్లి ఝాన్సీలక్ష్మి, సోదరి ప్రమీలారాణి కలసి మణికంఠ మిస్సింగ్ విషయాన్ని విన్నవించారు. అలాగే మణికంఠ తమ్ముడు చందు సాయిరాం ఏలూరులో కలెక్టర్ భాస్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మొత్తంగా ఈ సంఘటన కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment